*43-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*16. వేదాంగములు : వ్యాకరణము*
((((((((((🕉))))))))))
*వేదపురుషుని ముఖస్థానము (నోరు) వ్యాకరణము. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది - పాణిని రచన. అది సూత్రాలతో నిండి యుంటుంది. ఆ సూత్రాలకు విపులమైన వ్యాఖ్య (వార్తికం) రచించినది వరరుచి. పతంజలి మహర్షికూడ ఒక వ్యాఖ్యానం రచించాడు. ఈ మూడు గ్రంథాలూ వ్యాకరణ శాస్త్రంలో ముఖ్యములు. ఇతర శాస్త్రాలకీ వ్యాకరణానికీ భేదముంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాల కంటె ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లాకాదు. సూత్రాల కంటె భాష్యమే ప్రధానం. సూత్రాలు వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికీ భాష్యముంటుంది. ప్రతిభాష్యానికీ, విషయం బట్టి ఒక పేరుంటుంది. వ్యాకరణభాష్య మొక్కదానినే మహాభాష్య మంటారు, దాని ప్రాధాన్యతను బట్టి. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి. వ్యాకరణమూ, శివుడూ: శివాలయాలలో ''వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండప ముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి.*
*ఈ శ్లోకం చూడండి : ''నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శే శివసూత్ర జాలం'' ''అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది'' ఈ శ్లోక తాత్పర్యమిది. నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్య మాడుతూన్నంత సేపూ ఆ జడలు కూడ తిరుగు తూంటాయి.నర్తన మాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు. నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండే వాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు.*
*పై శ్లోకంలో ''ననాదఢక్కాం'' అన్న మాటకిదే అర్థం. వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి. (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్ వంటివి - తంత్రులనుపయోగించేవి. (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి. చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ''చోపు'' అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (''నృత్తావసానే'') చోపు ధ్వని వినబడింది. నటరాజు నృత్య మాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, ఋషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని ''దివ్యదృష్టి'' అంటారు. దీనినే భగవద్గీతలో ''దివ్య చక్షు'' వన్నారు.*
*సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ''చోపు'' వస్తుంది. పై శ్లోకంలోని ''నవపంచవారం''. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది. డమరుకపు దరువుల విద్యలు కూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజు కూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది ఋషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనాతన, సనత్ కుమారులనే మహర్షులు.*
*ఆ పధ్నాలుగు దరువులూ ఈ ఋషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ''శివభక్తి సూత్రాలంటారు''. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.*
🕉🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి