13, ఫిబ్రవరి 2021, శనివారం

మన మహర్షులు -21

 మన మహర్షులు -21


 తండి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



 పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి, జ్ఞాని, మహర్షి అయ్యాడు.


సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.


తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో 'ఓ పరమేశ్వరా యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్ఠాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు నువ్వు ఆజుడివి, అనాదినిధనుడివి, విభుడివి, ఈశానుడివి, అత్యంతసుఖివి, అనఘుడివి నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను' అన్నాడు


పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక 'పరమేశ్వరా ! కామ క్రోధాలు నువ్వే, ఊర్ధ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు, పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణుగతివి అన్నీ నువ్వే జనన మరణాలు కలిగించేది నువ్వే, దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే. రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా, మాసాలు భుజాలుగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు,,'


ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 'వత్సా నువ్వు తేజశాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. నీకేం కావాలో' అడగమన్నాడు


ఈశ్వరా! నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు. ఎప్పుడూ నాకు నీ పాదాల

దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు -తండి మహర్షి .


తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.


ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు .


ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు. వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.


 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు. దీన్నే 'తండి కృత శివసహస్రనామస్తోత్రం' అన్నారు 


ఇది సర్వమంగళములను సమకూర్చునది. సర్వకల్మషములను నశింపజేయునది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు బరుడు, తేజములకు దేజము, తపములకు దపము, శాంతములకు శాంతము, ద్యుతలకు ద్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు దీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞములకు యజ్ఞము, శివులకు శివుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణములకు గారణము, నగు హరుని అష్టోత్తర సహస్రనామములు:


ఇలా తండిమహర్షి శివ సహస్రనామ స్తోత్రమును తెలియజేసెను. వీనిని జపించినవారు సర్వకామ్య సంసిద్ధిగాంచి ముక్తులగుదురు.

 

 దీని వివరాలు మహాభారతంలోని  అనుశాసనిక పర్వం లో లభ్యమవుతాయి.


ఋషులు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కాని వాళ్ళకి కావల్సింది ఏమీ ఉండదు. ముక్తి తప్ప...🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: