13, ఫిబ్రవరి 2021, శనివారం

మొగలిచెర్ల

 *నియమం లో మార్పు..*


ప్రతి శుక్రవారం నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది..అర్చకస్వాములు సిబ్బందీ అందరూ ఇందులో పాల్గొంటారు..అందుబాటులో ఉన్న భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు..శ్రీ స్వామివారి సమాధి ని శుభ్రం చేయడం..అదీ తమ స్వ హస్తాలతో చేయడం అరుదైన అవకాశం గా భక్తులు భావిస్తారు..ఇది ప్రతివారం జరిగే ఒక తప్పనిసరి కార్యక్రమం..ఒక శుక్రవారం నాడు జరిగిన సంఘటన ఈరోజు వివరిస్తాను..


ఆరోజు ఉదయం ఎనిమిది గంటల వేళ..కార్లో దంపతులిద్దరు వచ్చారు..సరిగ్గా ఆ సమయానికి స్వామివారి మందిరం శుభ్రం చేయడానికి అర్చకస్వాములు సమాయత్తం అవుతున్నారు..ఈ దంపతులు మందిర ప్రాంగణం లోకి రావడం చూసి.."ఎవరో దూర ప్రాంతం నుంచి వచ్చినట్లు వున్నారు..వీళ్లకు అర్చన జరిపించి..వీళ్ళు దర్శనం చేసుకున్న తరువాత మనం ఆలయం శుద్ధి చేసుకుందాము.." అని అర్చకస్వాములే ఒక నిర్ణయం తీసుకొని..వేచి వున్నారు..ఆ దంపతులు మందిరం లోకి వచ్చి.."మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము..నిన్న రాత్రి మేము ఇక్కడకు వచ్చి నిద్ర చేయాలని అనుకున్నాము..కానీ మా పనుల వత్తిడి వల్ల మేము హైదరాబాద్ లో బైలుదేరడమే ఆలస్యం అయింది..అందుకని రాత్రి కందుకూరులో మా బంధువుల వద్ద ఆగిపోయి..ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధి దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి.." అన్నారు.."లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి..అర్చక స్వాములు కూడా మీకోసమే వేచి వున్నారు..మీరు త్వరగా దర్శనం చేసుకుంటే..ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి.." అని చెప్పాను.."మేమూ త్వరగా వెళ్ళాలి..ఈరోజు శుక్రవారం కదా.." అని అన్నారు..అలా ఎందుకు అన్నారో అప్పుడు అర్ధం కాలేదు..


దంపతులిద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులకు తమ శిరస్సు ఆనించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు..ఆ తరువాత బైటకు వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి ముందు నిలబడ్డారు.."మీ గోత్రం తెలుపండి.." అని పూజారి గారు అడిగారు..ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."పంతులు గారూ..మేము ముస్లిం వాళ్ళము..మాకు గోత్రం ఉండదు..నాపేరు ఖాజావలి..ఈమె నా భార్య రజియా..మా పేర్ల తోనే అర్చన చేయండి.." అన్నారు..పూజారిగారు అర్చన చేశారు..ఆ దంపతులు శుక్రవారం త్వరగా వెళ్ళాలి అని ఎందుకు అన్నారో అప్పుడు అర్ధమైంది..నమాజు చేసుకోవడానికి అని అనుకున్నాను..


ఆ దంపతులు ఇవతలికి వచ్చి..వాళ్లలో వాళ్ళు ఉర్దూ లో ఏదో మాట్లాడుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.. "అయ్యా..ఇందాక మీరు మాతో మాట్లాడినప్పుడు..ఆలయం శుభ్రం చేసే కార్యక్రమం అన్నారు..ఇప్పుడు ఈ మందిరం అంతా శుభ్రం చేస్తారా..? " అని ఆ భర్త అడిగాడు.."అవును.." అన్నాను.."మేము కూడా పాల్గొనవచ్చా..?" అన్నాడు.."గర్భాలయం లో ఉన్న స్వామివారి సమాధి శుభ్రం చేయడానికి స్త్రీలను అనుమతించము..బైట ప్రాంగణం అంతా శుద్ధి చేసే పనిలో స్త్రీలు కూడా పాల్గొనవచ్చు..స్వామివారి పూజా కార్యక్రమానికి వాడే వస్తువులను కడిగి పెట్టడం వంటి పనులు స్త్రీలు చేయవచ్చు.." అని చెప్పాను...వెంటనే ఖాజావలి తన చొక్కా విప్పేసి, తన భార్య చేతికి ఇచ్చాడు..ఆరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం లో ఆ ముస్లిం దంపతులు అత్యంత భక్తితో పాల్గొన్నారు..


స్వామివారి మందిరం శుభ్రం చేయడం..ఆపై స్వామివారి సమాధి వద్ద అభిషేకము నిర్వహించి..హారతి ఇవ్వడం జరిగిపోయింది...


"అయ్యగారూ..మాకు చాలా ఆనందంగా వుందండీ..స్వామివారికి నేరుగా సేవ చేసుకున్నంత సంతోషంగా ఉంది..మీరు.. మీ సిబ్బంది..మీ పూజారులు..ఎవ్వరూ మమ్మల్ని వేరుగా చూడలేదు..ప్రతి శుక్రవారం ఎన్ని పనులున్నా..నేను నమాజు చేయడం తప్పనిసరి..అటువంటిది ఈరోజు ఈ భాగ్యం కలిగింది..మాకూ మీతో సమానంగా అవకాశం ఇచ్చారు..ఇక మీదట మేము తరచూ ఈ గుడికి వస్తాము..వెళ్ళొస్తాము.." అని ఖాజావలి చెప్పాడు.."మంచిది.." అన్నాను...ఈలోపల అతని భార్య తన సంచీ లోంచి గోధుమ వర్ణం తో ఉన్న శాలువాను తీసింది.."అయ్యగారూ..ఈ శాలువాను స్వామివారి సమాధి మీద పరుస్తారా..? దీనిని హైదరాబాద్ లో ఇక్కడకు వచ్చేముందు కొన్నాము.." అన్నది..నా ప్రక్కనే నిలబడి ఉన్న పూజారిగారు ఆ శాలువాను చేతిలో తీసుకొని.."అమ్మా..స్వామివారి సమాధి పై పరుస్తాము..కాకుంటే..ఈరోజు కాదు..ఈసారి సమాధి కి అభిషేకం చేసిన తరువాత పరుస్తాము.." అని చెప్పారు.."చాలా సంతోషం.." అన్నారు ఆ దంపతులు..ఆ తరువాత వాళ్లిద్దరూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు..


ఆ దంపతుల కు అత్యంత అరుదైన అవకాశాన్ని స్వామివారు కల్పించి నట్లుగా  తోచింది..నిజానికి వాళ్ళు గురువారం నాడే స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని అనుకున్నారు..కానీ వాళ్లకు శుక్రవారం నాడు ఆ భాగ్యం కలిగిస్తూ..నమాజు చేసే నియమాన్ని మారుస్తూ..దానితో పాటు తన సేవ చేసుకునే అదృష్టాన్ని కూడా కల్పించారు..ఆ దంపతుల మనస్సులో మతం కన్నా అతీతమైన భక్తిని స్థిరీకరించారు..


ఒక్కొక్కరి మనస్సులో ఒక్కొక్క అనుభవాన్ని పొందుపరుస్తారు స్వామివారు అని మరోసారి ఋజువుఅయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: