మన మహర్షులు - 20
జాబాలి మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
జాబాలి మహర్షి వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో కనిపించే ఒక గొప్ప పాత్ర.
త్రేతాయుగంలో జాబాల అనే ఒక బ్రాహ్మణ వనిత మృకండు మహర్షిని కొన్ని సంవత్సరాల పాటు తీవ్రంగా శుశ్రూష చేసింది. తన తపస్సు నిర్విఘ్నంగా సాగినందుకు సంతోషించి మహర్షి గొప్ప ప్రజ్ఞాశాలి, సర్వవేదాలను అభ్యసించిన వేదవేత్త, గొప్ప తపస్సంపన్నుడు అయిన కుమారుడు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. అలా వరప్రభావంతో జనించిన కుమారునికి జాబాలి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
జాబాలికి యుక్త వయస్సు రాగానే అతని తల్లి గౌతమ గోత్రీకుడైన హరిద్రుమతుడు అనే గురువు గారి వద్ద విద్యాభ్యాసం కోసం అప్పగించింది.
అతనికి ఉపనయనం చేయగోరి గురువు పూజాసంకల్పం కోసం కులగోత్రాలను అడుగగా అవి తనకు తెలియవని సమాధానం ఇస్తాడు.
మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని రావల్సిందిగా గురువు ఆదేశిస్తాడు.
కుమారుని సందేహాన్ని విన్న తల్లి తనకు భర్త లేడని, దాసీ వృత్తినే స్వీకరించి అనేక ప్రదేశాలలో తిరగానని, ఒక మహర్షి ఆశీర్వాదం కారణంగా నువ్వు పుత్రునిగా లభించావని తెలుపుతుంది.
తిరుగి తన వద్దకు తిరిగి వచ్చిన జాబాలి జన్మ కథను దివ్య దృష్టితో తెలుసుకున్న హరిద్రుమతుడు అతడు కారణజన్ముడని తెలుసుకుని ఉపనయనంతో పాటు గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు.
అంతేగాక నాటి నుండి అతని పేరును సత్యకామజాబాలిగా మారుస్తాడు.
బ్రహ్మ విద్యను అభ్యసించేందుకు తగిన అర్హత కోసం అతనిని గోసేవ చేసుకొమ్మని గురువు ఆదేశిస్తాడు.
సత్యసంధత, గురుభక్తి అచంచలమైన భక్తి విశ్వాసాలతో జాబాలి అహర్నిశలు గో సేవ చేసుకుంటూ ఉండేవాడు.
అతని భక్తి తత్పరత, సేవాదృక్పధాలకు మెచ్చి వాయుదేవుడు వృషభరూపంలో వచ్చి మంత్రోపదేశం చేసాడు.
అనంతరం గోవుల రూపంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, బృహస్పతులు వచ్చి జాబాలికి బ్రహ్మోపదేశం, వేదాలు , ఉపనిషత్తులను ఉపదేశించడం వలన జాబాలి బ్రహ్మ జ్ఞాన సంపన్నుడయ్యాడు.
ఆత్మసాక్షాత్కారం పొందిన జాబాలి గురువు ఆదేశం మేరకు ఒక ఆశ్రమం నిర్మించుకుని నిత్యం వేదపారాయణ, సత్గంధపఠన, గురుధ్యానము నందే నిమగ్నుడయ్యేవాడు.
గురుధ్యానం, గురునామం జపించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. జాబాలి గురుభక్తికి మెచ్చి హరిద్రుమతుడు స్వయంగా శిష్యుని ఆశ్రమానికి వచ్చి సర్వవేదసారం, బ్రహ్మజ్ఞానం ఉపదేశించి తన సర్వ తప్పశ్శక్తిని ధారపోస్తాడు.
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల పవిత్ర రపదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఘోరతపస్సు ఆచరించాడు.
ఆయన ఆశ్రమ ప్రాంతాన్ని జాబాలి తీర్థం అని పిలుస్తారు.
అశేష భక్త జనావళి తమ గృహ, నక్షత్ర దోషాలను పరిష్కరించుకునేందుకు జాబాలి తీర్థం దర్శించుకుని అక్కడే ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి మూర్తులను పూజించుకుంటారు.
అనంతర కాలంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో జాబాలి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి, ఆ స్వామి అనుగ్రహంతో పరతత్వ రహస్యాలను గ్రహించారు.
అనంతరం బ్రహ్మజ్ఞాన సాధనకు తనను ఆశ్రయించిన పిప్పలాద మహర్షికి సకల వేద సారాన్ని బోధించాడు. వీరిద్దరి నడుమ సాగిన సంవాదం జాబాల్యుపనిషత్తు పేరిట సుప్రసిద్ధం అయింది.
రామాయణంలో అయోధ్యకాండలో తండ్రి ఆజ్ఞను అనుసరించి అడవులకు బయలుదేరుతుండగా జాబాలి మహర్షి అక్కడి వచ్చి తన వాక్పటిమ, తర్కం, అపారమైన శ్రస్తసంపదను రామునితో వాదనకు దిగి అతనిని అడవులకు వెళ్లకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు.
ఆ వాదనలో ఎన్నో తత్వ రహస్యాలు, వేదవిజ్ఞానం, బ్రహ్మసూత్రాలు వచ్చి వినేవారికి సంపూర్ణ జ్ఞానోదయం అవుతుంది.
అయితే చివరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లే యోచనలో ఎంతో పరమార్ధం ఉందన్న విషయం తపశ్శక్తి ద్వారా గ్రహించి తన వాదనను ఉపసంహరించుకుంటాడు.
జాబాలి ఎంతో కాలం దశరథునికి ముఖ్య సలహా దారునిగా ఉంటూ ప్రజాసంక్షేమమే ధ్యేంగా సత్యం, ధర్మం, న్యాయం, అహింసలనీ నాలుగు పునాదులపై కోసల దేశంలో సుపరిపాలనను సాగించేందుకు కృషి చేసాడు.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి