మన మహర్షులు - 29
మార్కండేయ మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
మార్కండేయుడు తన అనన్య సామాన్యమైన భక్తి ద్వారా ఆ పరమేశ్వరునుండి నుండి చిరంజీవిగా 'మరణములేని' జీవితాన్ని పొంది ఉద్దరింపబడినాడు.
మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం.
బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.
చిన్నతనం లొనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు.
మార్కండేయుడు కొంచెం పెద్దవాడయ్యాక ' నాయనా! నువ్వు విష్ణుమూర్తి, శివుడు ఇచ్చిన వరం వల్ల పుట్టావు కానీ, నీకు ఆయుష్షు తక్కువ' అని చెప్పాడు మృకండుడు.
తండ్రీ! మీరిచ్చిన ఈ శరీరంతోనే శివుణ్ణి మెప్పించి చిరంజీవిగా ఉంటానని చెప్పాడు మార్కండేయుడు.
మార్కండేయుడు తపస్సు మొదలు పెట్టాడు. ఈలోగా అతనికి పదహారేళ్ళు వచ్చాయి. యమధర్మరాజు వచ్చేశాడు. కానీ, మార్కండేయుడు తపస్సులో ఉండిపోయాడు. శివుడు వచ్చి నా భక్తుడి వైపు చూశావంటే ఊరుకోనని యముడికి చెప్పాడు. వీళ్ళిద్దరూ గొడవపడుతుండగా మార్కండేయుడు శివుడి కాళ్ళు పట్టుకుని అప్పటికి మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.
అసలు, చావే లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలని శివుణ్ణి అడిగాడు మార్కండే యుడు. విష్ణుమూర్తిని ప్రార్థించమన్నాడు శివుడు.
మార్కండేయుడు మళ్ళీ విష్ణుమూర్తి కోసం తపస్సు మొదలు పెట్టాడు. పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంద్రుడున్నాడు కదా తపస్సు భంగం చెయ్యడానికి, ఆయన ఎన్ని చేసినా మార్కండేయుడు చలించలేదు. దీన్నే దీక్ష అంటారు. దేన్నయినా సాధించాలి అనుకున్నప్పుడు అంత పట్టుదలగా ఉండాలి.
విష్ణుమూర్తి మార్కండేయుడికి ప్రత్యక్షమై ఏంకావాలి? అన్నాడు. స్వామీ! ఎన్ని యుగాలయినా ఈ శరీరంతోనే చావు అనేది లేకుండా చెయ్యమని విష్ణుమూర్తిని బ్రతిమలాడి వరం తీసుకుని చివరికి సాధించాడు. మొత్తం లోకాలకే పేరు తెచ్చాడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు మనస్సుకి బాధ తగ్గించాలని వచ్చాడు మార్కండేయుడు.
మార్కండేయుణ్ణి పూజించాక ధర్మరాజు మనుషుల కర్మగతుల గురించి చెప్పమన్నాడు.
రాజా! మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మంతో కూడుకున్న శరీరాల్ని పుట్టించాడు. అందులోంచి మంచి ప్రవర్తన కలవాళ్ళు, సత్యసంకల్పం వున్న వాళ్ళు జ్ఞానవంతులు, ఎక్కువ ఆయుష్షు ఉన్నవాళ్ళు అయ్యారు. రానురాను మనుషులు అల్పాయుష్కులు, దరిద్రులు, రోగాలతో బాధపడేవాళ్ళు, మాయమాటలు చెప్పేవాళ్ళు, తయారయి వాళ్ళు వాళ్ళ పాపపుణ్యాలకి తగినట్లు పుడుతూ, చస్తూ వాళ్ళ కర్మఫలం అనుభవిస్తున్నారు. ధర్మ మార్గంలో వుండేవాళ్ళు మంచిపనులు చేస్తూ, పిల్లలో చేయిస్తూ పుణ్యం పొందుతున్నారు. మంచి చేస్తే మంచిని, చెడు చెయ్యడం వల్ల చెడుని అనుభవిస్తున్నారు. ఇదే కర్మగతి 'అన్నాడు మార్కండేయుడు.
మార్కండేయుడు ధర్మరాజుకి బ్రాహ్మణ ప్రభావం గురించి, దుంధుమారుడనే రాజు గురించి, అత్రి గౌతముల వాదన గురించి వైవస్వత చరిత్ర, వామదేవుడి చరిత్ర ఇలాంటివన్నీ చెప్పాడు. ధర్మరాజు ఎన్నో విషయాలు మార్కండేయుణ్ణి అడిగి తెలుసుకున్నాడు.
మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాక గౌరముఖ మహర్షి అక్కడికి వెళ్ళి పితృదేవతల గురించి మార్కండేయ మహర్షి నడిగి తెలుసుకున్నాడు.
నమార్కండేయుడు ధర్మ పక్షుల గురించి చెప్పిన దాన్ని 'మార్కండేయ పురాణమని” పిలుస్తారు.
మార్కండేయ పురాణం, అష్టాదశ పురాణాలలో ఒకటి. జైమిని ముని మరియు మార్కండేయుడు మధ్య జరిగిన సంవాదముగా
వ్రాయబడింది.
కోర్టుకి అనే ముని మార్కండేయుణ్ణి ప్రపంచ విషయాలు చెప్పమన్నాడు. బ్రహ్మ జన్మ గురించి, అన్ని ద్వీపాల గురించి, సూర్యడి గొప్పతనం గురించి అన్నీ చెప్పాడు మార్కండేయుడు.
కఠోరదీక్షతో విష్ణుమూర్తి కటాక్షంతో మృత్యువిజయం, మహాతపశ్శక్తి సంపాదించిన మార్కండేయ మహర్షి సదా స్మరణీయులు.🙏
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి