22, ఫిబ్రవరి 2021, సోమవారం

మొగలిచెర్ల

 *చీకటి..వెలుగు..*


"పల్లకీసేవ లో పాల్గొనాలి..మా పేర్లు వ్రాసుకోండి..టికెట్ ఎంతో చెప్పండి.." అని ఆ దంపతులు నన్ను అడిగారు..మా సిబ్బంది దగ్గరకు వెళ్ళమని చెప్పాను..సిబ్బంది వద్దకు వెళ్లి పల్లకీసేవ కొఱకు తమ పేర్లు, గోత్రము నమోదు చేయించుకున్నారు..ఆరోజు భక్తులు ఎక్కువగా వున్నారు..పల్లకీసేవ లో పాల్గొనే వాళ్లే దాదాపు యాభై మంది పైనే తమ పేర్లు నమోదు చేసుకున్నారు..స్వామివారి మంటపం లో ఇంతమందిని వరుస క్రమం లో కూర్చోబెట్టడం..అందరి గోత్రనామాలను చెప్పించుకోవడం..అర్చకస్వాములకూ కష్టం గానే ఉంది..అందరితో పాటు ఈ దంపతులూ పల్లకీసేవ లో పాల్గొన్నారు..పల్లకీసేవ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది..ఆ తరువాత అన్నప్రసాద వితరణ..ఆ రాత్రికి మంటపం లోనే పడుకున్నారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకే ఆ దంపతులు స్నానాదికాలు ముగించుకొని మందిరం లోకి వచ్చారు..అప్పుడే అర్చకస్వాములు స్వామివారి సమాధి మందిరం తలుపులు తెరచి..లోపల శుభ్రం చేసుకుంటున్నారు.."అయ్యా..మమ్మల్ని స్వామివారి సమాధి దర్శనానికి ఏ సమయం లోపంపుతారు? " అని నన్ను అడిగారు.."హారతులు అన్నీ పూర్తయ్యేసరికి సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది..ఆ తరువాత భక్తులను సమాధి దర్శనానికి అనుమతి ఇస్తాము..మీరు విశేషపూజ అని చెప్పి మా సిబ్బంది వద్ద టికెట్ కొనండి..వరుసగా అందరినీ పంపుతాము..అంతవరకూ మంటపం లో కూర్చుని..స్వామివారి సమాధికి అర్చకులు చేసే అభిషేకములు, హారతులు చూడండి.." అని చెప్పాను..సరే అని వెళ్ళిపోయి మంటపం లో కూర్చున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తయిన తరువాత..ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శనం, స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..మధ్యాహ్నం దాకా వుండి..మధ్యాహ్న హారతి కూడా చూసి..స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి వెళ్లిపోయారు..ఆ ప్రక్క శనివారం నాడు మళ్లీ వచ్చారు..పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం స్వామివారి సమాధి ని దర్శించుకొని, తమ పేర్లతో అర్చన చేయించుకొని..మధ్యాహ్నం వరకూ మంటపం లో కూర్చుని స్వామివారి చరిత్ర పారాయణం చేసుకొని..అన్నప్రసాదం తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ మూడోవారం కూడా అదే విధంగా వచ్చి వెళ్లారు..ఇలా..వరుసగా పదివారాల పాటు ప్రతి శనివారం మధ్యాహ్నం మందిరానికి రావడం..పల్లకీసేవ లో పాల్గొనడం..రాత్రికి నిద్ర చేయడం..ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన చేయించుకొని..తిరిగి వెళ్లడం..జరుగుతున్నది..


పదకొండో వారం కూడా ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..ఆరోజు నేరుగా నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..రేపటితో  మా పదకొండువారాల నియమం పూర్తవుతుందండీ..మొట్ట మొదటి రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు..మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది..తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాము..ఏ దిక్కుతోచక..ఈ స్వామివారి గురించి విని..చిట్టచివరి ఆశగా ఇక్కడికి వచ్చాము..ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాము..మా తోబుట్టువులే మమ్మల్ని మోసం చేశారు..ఒక్క కుమారుడు..ఒక సంవత్సరం నుంచీ ఉద్యోగం లేక ఖాళీగా వున్నాడు..పైగా అప్పుల వాళ్ళ వేధింపులతో విసిగిపోయి ఉన్నాము..ఇన్ని కష్టాల మధ్య స్వామివారి వద్దకు వచ్చాము..మొదటి వారం మేము స్వామివారి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు.."స్వామీ ఈ కష్టాలు పడలేకుండా ఉన్నాము..ఆత్మహత్య మాత్రమే దిక్కు..మమ్మల్ని కాపాడు తండ్రీ..నువ్వే దిక్కు.." అని పరిపరివిధాల మొక్కుకున్నాము..ఆరోజు మంటపం లో కూర్చుని వున్నప్పుడు.."పదకొండు వారాల పాటు స్వామివారిని కొలవండి మీకు మంచి జరుగుతుంది "అని ఇక్కడ ఉన్న ఒక ఆడమనిషి..చెప్పింది..ఎందుకో ఆ మాట స్వామివారే చెప్పించాడు అని అనిపించింది..ఇద్దరమూ పదకొండు వారాలు ఈ క్షేత్రానికి వచ్చి..స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాము..ఐదు వారాలు గడిచే సమయానికి..మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో ఎంపిక అయినట్లు వార్త వచ్చింది..మంచి జీతం కూడా..స్వామివారే చూపించారు అనుకున్నాము..మా ఆర్ధిక ఇబ్బందులు అలాగే వున్నా..అవి తీరే మార్గాలు కనబడ్డాయి..అప్పులవాళ్లకు నచ్చ చెప్పుకున్నాము..ముందు నిరాశ లోంచి బైట పడ్డాము..మా వాటా ఆస్తి లో కొంతభాగం అమ్మకానికి పెట్టాము..మంచి ధర వచ్చింది..కష్టాలు తొలగిపోతాయి అనే ధైర్యం వచ్చింది..చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లుగా ఉన్నది..రేపు స్వామివారి సమాధి దర్శించుకొని..ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని..వెళ్లిపోతాము..మళ్లీ..మళ్లీ స్వామివారి వద్దకు వస్తూనే ఉంటాము.." అన్నారు..


ఆ దంపతుల కష్టాలు పూర్తిగా తొలగిపోవడానికి ఇంకా సమయం పడుతుంది..కానీ..ఆ కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని స్వామివారు కల్పించారు..జీవితం మీద విరక్తి కలిగిన తరుణం లో..జీవించడానికి మార్గాన్ని చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: