21, మే 2021, శుక్రవారం

సాలె గూడు

 సాలె గూడు

                                          - - - - - - - - - - 

                                                           - సత్య భాస్కర్ 

         ఆదివారం

         

         రాత్రంతా టివిలో కార్యక్రమాలు చూసి ఆలస్యం కావడంతో పొద్దునే మెలకువ రాలేదు. అలా మొద్దు నిద్ర పోతున్న రాఘవను వాళ్ళావిడ కుదుపుతూ లేవమని పోరు పెడుతోంది. మెలకువ వచ్చి కళ్లు తెరిచాడు రాఘవ. ఎదురుగా శ్రీమతి. 

         

         "ఒకసారి లేవండి! మీతో పనుంది. అవసరమైతే మళ్లీ పడుకుందురుగానీ!" అని అంటోంది. 

         

         "ఆదివారమేగా! అంత కొంపమునిగే పనేముంది! కొద్దిగాగి లేస్తాలే!" అని మరోవైపు ఒత్తిగిల్లి పడుకోబోయాడు. కానీ వేషాలు కుదురలేదు. ఆవిడ పట్టు వీడలేదు. 

         

         "ఓసారి లేవండి! టివి ఆగిపోయింది. రీఛార్జ్ చేసి మళ్లీ పడుకోండి! "అని బతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతూ భుజాన్ని పట్టుకుని కుదుపుతూనే వుంది. ఇది వదిలే వ్యవహారం కాదని అర్ధమయింది. అందులోనూ ఆదివారం టివి రాకపోతే ఏమైనా వుందా! లేవక తప్పదు. విసుక్కుంటూనే లేచాడు. 

         

         ఆవులించుకుంటూ హాలు లోకి వచ్చి టివి ముందున్న సోఫాలో కూలపడ్డాడు. పిల్లలిద్దరూ నిద్ర లేచినట్టు లేదు.ఇల్లంతా ప్రశాంతంగా వుంది. ఇలాంటి సమయంలోనే ఆవిడ ముందుగా లేచి టివిలో భక్తి ఛానల్ పెట్టి పనులు చేసుకుంటూ వుంటుంది. అలాంటి ఇంపార్టెంట్ సమయంలో రీఛార్జ్ చేయనందుకు ప్రసారం చేయనని ఛానల్ వాడు మొరాయించి కూర్చున్నాడు. 


         "అప్పుడే నెలయిపోయిందా! వీడేదో వేషాలేస్తున్నాడు.. పోయి నా పర్సు తీసుకురా.. డెబిట్ కార్డు దానిలోనే వుంది." అని అన్నాడు రాఘవ! అప్పటికే ఆవిడ బెడ్ రూంలోంచి పర్సు తీసుకు వస్తోంది.

         

         టీపాయ్ మీద వున్న సెల్ ఫోన్ ను చేతిలో తీసుకుని ఆ ఛానెల్ వెబ్ సైట్ ను గూగుల్ లో తెరిచాడు. ఆ తర్వాత తాను ప్రతి నెలా వేసే రు. 249 మంత్లీ ప్యాకేజీ ని సెలెక్ట్ చేసాడు. పేమెంట్ ఆప్షన్ లో వెళ్లి డెబిట్ కార్డు ఎంచుకున్నాడు. పర్సు లో నుండి డెబిట్ కార్డు ను తీసి నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇయర్ ఎంటర్ చేసి,కార్డు ను వెనక్కి తిప్పి చూసి సివివి నెంబర్ ఎంటర్ చేసాడు. కొద్ది సెకండ్ లలోనే ఓటిపి ని ఎంటర్ చేయమని అడిగింది. అదే క్షణంలో సెల్ కు ఓటిపి వచ్చింది. దాన్ని ఎంటర్ చేయడం.,సెకన్లలోనే రీఛార్జ్ అయింది, కంగ్రాచ్యులేషన్స్ అనే మెసేజి వచ్చేసాయి. అదే సమయంలో టివిలో "గోవింద హరి గోవింద" అని గీతం తారాస్థాయిలో అందుకుంది. మళ్లీ టివి మొదలయినందుకు ఆవిడ సంతోషంగా ఆ భజన గీతంతో గొంతు కలుపుతూ, స్వామి వారికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి మైమరిచి పోయింది. 

         

         తన పనయిపోయిందని సెల్ ఫోన్ ను టీపాయ్ మీద పెట్టబోతున్న రాఘవ, 

బ్యాంకు నుండి వచ్చిన ఎకౌంట్ బ్యాలన్స్ మెసేజ్ చూసి అదిరి పోయాడు. నిద్ర మత్తంతా ఎగిరి పోయి షాక్ కొట్టినట్టు సోఫాలో కొయ్యబారి పోయాడు. కళ్లునులుముకుని ఆ మెసేజ్ ను మళ్లీ ఓసారి చూశాడు. సందేహం లేదు. 


         "ముందు ఆ వెధవ టీవీని ఆపు" అని ఓ అరుపు అరిచాడు. 

         

ఊహించని రీతిలో భర్త ఆ విధంగా అరిచేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి 


         "ఏమైందండీ" అని ఆందోళనగా అడిగింది. అప్పటి దాకా నిద్ర లేపినందుకు గొణుగుతున్న ఆయన పిచ్చి చూపులు చూస్తూ సోఫాలో కనబడ్డాడు. వెనక టివిలో గోవిందా.. గోవిందాని పాట వస్తూనే వుంది. 

         

         ఏమీ బదులివ్వకుండానే" ముందా రిమోట్ లు ఇలా ఇవ్వు" అని అరిచాడు.ఆవిడ అయోమయంగా చూస్తూ టివి దగ్గరకు వెళ్ళి రిమోట్ లను తీసుకుని వచ్చి చేతికి ఇచ్చింది. 

         

            టీవి ముందునుండి పక్కకు జరగమని సైగ చేస్తూ టీవిలో వస్తున్న ఛానెల్ మార్చేసి ఎకౌంట్ బ్యాలన్స్ బాక్స్ ను ఓపెన్ చేసి దాన్నే నిలువుగుడ్లేసి చూస్తుండి పోయాడు. 

            

            శ్యామలకూడా ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి తానూ టివీ స్క్రీన్ చూడసాగింది. ఏమైందో అర్థం కాక వుండబట్టుకోలేక "అంత ఖంగారు పడుతున్నారెందుకండీ! ప్రతినెలా డబ్బులు వేస్తూనే వున్నారుగా! కొత్తేముంది."అని అంది. 

            

            భార్యను కోపంగా చూస్తూ "ఏమి జరిగిందో ఆ స్క్రీన్ మీద కనబడటంలా! ఎంత ఎమౌంట్ కట్టామో చూడు!" అని అన్నాడు రాఘవ. అప్పుడు ఎకౌంట్ బ్యాలన్స్ ను పరీక్షగా చూసిన శ్యామల" ఆ! "అని నోరెళ్ళబెట్టేసింది. రు. 24,900 రీఛార్జ్ చేసినట్లు, తదుపరి రీఛార్జ్ 2025 సంవత్సరంలో వున్నట్లు చూపిస్తోంది.

            

            "అయ్యయ్యో.. అదేంటండీ!మనం కట్టేది 249 గదా! అంత డబ్బు ఎలా పోయింది" అని గోల గోల పెట్టేసింది. 

            

            "అర్థం అయిందా లేదా! మనం 249 రీఛార్జ్ చేస్తే మన అకౌంట్ లోనుండి 24,900లు వెళ్లి పోయాయి. 2025 వరకు రీఛార్జ్ చేశామని చూపిస్తోంది. మన కొంప మునిగింది. ఐదేళ్ల పాటు రీఛార్జ్ చేయడానికి మనకేం సరదా!"అని తల పట్టుకున్నాడు రాఘవ.నిద్ర మధ్య లో లేవడంతో మొహమంతా జిడ్డు గా వుంది. అనుకోని షాక్ తగలడంతో మరింత జేవురించి పోయింది. 

            

            మొగుడు డీలా పడ్డాడని గ్రహించిన శ్యామల ధైర్యం చెప్పాలనుకొని

           " తప్పంతా నాదేనండి. నిద్ర సరిపోలేదు పడుకుంటానని మీరంటున్నా వినకుండా లేపేసి రీఛార్జ్ చేయమని పట్టుబట్టాను. ఆ నిద్ర మబ్బు లో ఏం నొక్కారో ఏమో! డబ్బులన్నీ ఎగిరి పోయాయి." అని ఏడుపు గొంతుతో అంది. 

           

           "కొత్తగా నొక్కింది ఏమీ లేదే! ప్రతి నెలా వేస్తుందే గదా! ఏదో జరిగింది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే మన డబ్బులు ఆ ఛానెల్ వాడికే పోయాయి. ఎట్లాగో అట్ల వసూలు చేసుకోవాలి. అదే ఏ సైబర్ క్రిమినల్ చేతిలో పడితేనా ఆశ వదులుకోవాల్సిందే! "అని అన్నాడు. షాక్ నుండి తేరుకని బుర్ర పనిచేయసాగింది. అందుకే అలాంటి మాటలు వచ్చాయి. 

           

          " ఇప్పుడు ఎవరిని అడుగుతారండి. మీరే అనవసరంగా లోకల్ కేబుల్ వాడిని మాన్పించేసారు. వాడైతే ప్రతి నెలా ఇంటికి వచ్చి పైసలు కట్టించుకునే వాడు. ఛానెల్స్ సరిగ్గా ఇవ్వడం లేదని ఈ డిష్ పెట్టించారు. వాడినే వుండనిస్తే మనతోబాటు వాడూ బతికే వాడుగా!" అని జాడించింది. దాంతో మిగిలిన నిద్ర మత్తుకూడా వదిలింది. 

          

         " అవన్నీ వదిలేయవే! ముందు టీ పెట్టు. మొహం కడుక్కుని వస్తా."అని అంటూనే లేచి బాత్రూంలో దూరాడు. ఆవిడ వంటింట్లోకి నడిచింది. 

                                                           ******

  

    గొంతులో టీ పడుతుంటే మనసు స్థిమితం పడసాగింది. జరిగిన తప్పుకు పరిష్కారం ఏమిటాని ఆలోచించి సాగాడు. శ్యామల అన్నది కరెక్టే! ఇంతకు ముందు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ చేస్తే ముందో వెనకో వచ్చి చూసేవాడు. నెలనెలా పైసలు కట్టించుకునే వాడు. ఆ కేబుల్ టివికి యజమానో లేక ఆపరేటరో మన కళ్ల ముందు కనబడే వాడు. ఈ డిష్ చానెల్ కు డబ్బులు కడుతున్నా వాటిని పొందే యజమాని మన జీవితంలో మనకు కనబడడు. ఆయన ఏదేశంలో వుంటాడో తెలీదు. వార్తల్లోనే అప్పుడప్పుడు ఫలానా డిష్ ఛానెల్ యజమాని దేశంలోనే అతిపెద్ద సంపన్నుడని వస్తుంటుంది. మనం నెలనెలా కట్టే డబ్బులతోనే అంత సంపాదిస్తున్నాడా! 

    

      "ఏమి ఆలోచించారండీ!" అని చేతిలో గరిటతోనే శ్రీమతి రంగ ప్రవేశం చేయడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు రాఘవ. చేతిలోని టీ కప్పును ఎదురుగా వున్న టీపాయ్ మీద పెడుతూ

      

      "నా సెల్ అందుకో! కస్టమర్ కేర్ కు ఫోన్ చేద్దాం." అని అన్నాడు రాఘవ. 

      

      "మీ ఎదురుగా వున్న టీ పాయ్ కిందే వుంది. నేను పోతున్నా నాకు స్టౌ మీద పోపు వేగుతోంది." 

      అని అంటూవంటింట్లోకి వెళ్లి పోయింది. 


      సెల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెదికి ఆన్ చేసాడు. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ కాసేపు సహనాన్ని పరీక్షించాక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడుతాడు  వేచివుండండి అనే సందేశం వచ్చింది. హమ్మయ్య మాట్లాడడానికి ఓ మనిషి దొరికాడనుకున్నాడు రాఘవ! 

కాసేపు టింగ్... టింగ్.. టింగ్ మంటూ మ్యూజిక్ వచ్చింది. అలాగే ఓపిగ్గా ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. క్షమించడి కోవిడ్ కారణంగా 50% స్టాఫ్ తోనే పనిచేస్తున్నందువలన మీ కాల్ అటెండ్ చేయలేక పోతున్నాము. మళ్లీ కొద్ది సేపు ఆగి ప్రయత్నించండి. అని చల్లగా పలికింది. 

ఛీ.. అనివిసుక్కున్నాడు. 


ఎదురుగా టివిలోడిష్ ఛానెల్ వాట్సప్ గ్రూప్ డౌన్ లోడ్ చేసుకోమని యాడ్ వస్తోంది. సరే ఇదీ చూద్దాం... అనుకుని కొద్ది సేపు కష్టపడి ఆ గ్రూప్ డౌన్ లోడ్ చేసాడు. వినయంగా పలకరింపు లయ్యాయి. కస్టమర్ లకు ఎదురయ్యే సమస్యల జాబితా ఇచ్చి సంబంధిత సంఖ్య వేయమని వచ్చింది. రీఛార్జ్ ప్రాబ్లమ్స్ అనేదాన్ని ఎంచుకున్నాడు. తన సమస్యను వివరించాక 'సారీ! నేను రోబోట్ ను. ఇంకా నేర్చుకుంటున్నాను. కస్టమర్ కేర్ ను సంప్రదించండి' అనే సందేశం వచ్చింది. 

'హార్నీ! ఇప్పటిదాకా చాటింగ్ చేసింది రోబోనా! మనిషనుకున్నానే!'అని ఆశ్చర్య పోయాడు రాఘవ. 


         బుర్ర వేడెక్కిపోయింది. సెల్ పక్కన పెట్టేసాడు. ఇన్నాళ్లూ అందంగా గర్వ కారణంగా కనబడే టివి తన అదుపులో లేని భూతంలా కనబడుతుంది. ఇంతలో చేతిలో టీ కప్పుతో శ్రీమతి ప్రవేశించింది. అడిగితే తిడతాడేమో అనే భయంతో ఏమీ మాట్లాడకుండానే ఆ టీ కప్పును అందుబాటులో టీపాయ్ మీద పెట్టింది. తాను కూడా పక్కనే వున్న దివాన్ మీద కూర్చొని సెల్ ఫోన్ చేతిలో తీసుకుని మొగుడు ఏం చేసాడాని చూడసాగింది. టివికూడా ఆపివేయడంతో ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలు కూడా లేవక పోవడంతో ఆ నిశ్శబ్దం కొనసాగుతోంది. 

         


  రెండు సిప్పులు టీ గొంతులో దిగడంతో ఓ ఐడియా వచ్చింది రాఘవకు!వెంటనే ఆ టీ కప్పు చేతిలో పట్టుకునే బెడ్ రూం లోని కంప్యూటర్ దగ్గర కు పరిగెట్టాడు. వెనకాలే శ్యామల అనుసరించింది. గబగబా స్విచ్ లన్నీ ఆన్ చేసి స్క్రీన్ ఎదురుగా ఛెయిర్ లో కూర్చున్నాడు. వెనకాలే కొద్ది దూరంలో కుర్చీలో కూర్చుంది శ్యామల. పొద్దునే డబ్బులన్నీ ఎగిరి పోయాయని మొగుడికి పిచ్చెక్కి పోయిందని ఆమెకు అర్థమయిపోయింది. ఇప్పుడేమన్నా మాట్లాడినా, చప్పుడు చేసినా తన మీద విరుచుకు పడతాడని తెలిసి తగు జాగ్రత్తలో వుంది. నిద్ర మబ్బులో ఏమి నొక్కాడో ఇప్పుడు తన్న్నుకులాడుతున్నాడని లోపల అనుకుంటోంది. 

  

  గూగుల్ క్రోం లోకి వెళ్లి ఆ డిష్ టివి సైట్ ఓపెన్ చేసాడు. సైట్ ని దీక్ష గా చూశాడు. ఢిల్లీ లో హెడ్ ఆఫీస్ ముంబాయి,చెన్నై ల్లో రీజినల్ ఆఫీసులున్నట్టు అర్ధం అయింది. టేబుల్ మీదున్న పెన్న్ను పేపర్ తీసుకొని వాటి మెయిల్ అడ్రస్ రాసుకున్నాడు. తర్వాత మెయిల్‌బాక్స్ ఓపెన్ చేసి తన గోడంతా వెళ్లబోసుకుంటూ ఆ రెండిటికీ మెయిల్ పెట్టాడు. అయినా నమ్మకం కలగ లేదు. ఇలా కాదు,ఏదో ఒక ఫోన్ నెంబర్ దొరక బట్టాలి. మళ్లీ ఆ సైట్ ఓపెన్ చేసి స్క్రీన్ అంతా గాలించాడు. సైట్ అడుగు కు పోయి కళ్ళంతా చికిలించి వెదకంగా చీమ తలకాయంత సైజు లో ఓ లోకల్ నెంబర్ దొరికింది. దాన్ని పేపర్ మీద రాసుకుని, శ్యామల చేతిలో వున్న సెల్ ను గుంజుకున్నంత పని చేసాడు. వెంటనే ఆ నెంబర్ కు డయల్ చేసాడు. అవతల వైపు ఫోన్ మోగింది కానీ ఎవరూ ఎత్తు లేదు. విసుగొచ్చి సెల్ ఆఫ్ చేసి నీరసంగా ఆ కంప్యూటర్ ఛెయిర్ లో వెనక్కు వాలిపోయాడు. 

  

  ఆయన అలా డీలా పడడం చూసిఆపుకో లేక "ఏమయిందండీ!" అని ఆతృతగా అడిగింది ఆవిడ.

  

 "ఏముంది. మన చేయగలిగిందంతా చేశాం.! కనపడిన అడ్రస్ కల్లా మెయిల్ పెట్టాను. ఆ కస్టమర్ కేర్ ఏమో దొరకడం లేదు. ఏదో లోకల్ నెంబర్ దొరికితే ఫోన్ చేసా రెస్పాన్స్ లేదు. ఈ కార్పొరేట్ కంపెనీలు మనలాంటి చిన్న ప్రాణులని మోసం చేస్తాయనుకోను! ఏ బ్యాంకు లనో లక్షల కోట్లు ముంచేస్తారు. ఏదో పొరపాటు జరిగింది. అది సరయ్యే వరకూ మనకీ టెన్షన్ తప్పదు. టెక్నాలజీ మీద ఆధారపడడం పెరిగే కొద్దీ ఇలాంటి ప్రమాదాలు వుంటాయి. "అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే సెల్ మోగింది. ఏదో తెలీని నెంబర్. అయినా ఎత్తాడు రాఘవ! 

 

  అవతలనుండి పూర్తి ప్రొఫెషనల్ టోన్ లో మాట్లాడుతూ తనను డిష్ టివి రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని ఎందుకు ఫోన్ చేసారని అడిగాడు. తాను చేసిన లాస్ట్ కాల్ ఫలించిందని అర్ధమయింది రాఘవకు! టెన్షన్ తో పొలమారిన గొంతు సరి చేసుకుంటూ తన బాధను వివరంగా చెప్పి ఒక నెల ఛార్జీలు మాత్రమే వంచుకుని మిగతా డబ్బులు తిగి ఇచ్చేయమని మొర పెట్టుకున్నాడు. అన్నిటికీ ఓకె.. ఓకె అంటూ విని ఫోన్ నెంబర్, ఐడి నెంబరు తెలుసుకుని తాను అన్ని చూస్తానని15నుండి 30రోజుల్లో మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని చెప్పి పెట్ట్టేసాడు. 


  "హమ్మయ్య! బతికాం!" అని పెద్ద నిట్టూర్పు వదిలాడు రాఘవ! 

  

  "ఏమయిందండీ!" అని ఆతృతగా అడిగింది శ్యామల. "ఈ నెలాఖరు కల్లా మన డబ్బులు మనకొచ్చేస్తాయిలే!" అని అంటూ సంభాషణ వివరాలన్నీ చెప్పాడు. పొద్దున్నుంచీ వాళ్ళు పడ్డ టెన్షన్ అంతా యింతా కాదు. వేల రూపాయలు చిటుక్కుమని అకౌంట్ నుండి ఖాళీ అయిపోతే ఎవరికయినా ఖంగారే కదా!

  

  "నిజంగా వస్తాయంటారా! రాకపోతే ఏం చేద్దాం!" అని అనుమానం లేవనెత్తింది శ్యామల! 

  

 " ఏం చేస్తాం! ఇలాగే కాళ్లా వేళ్ళా పడాలి. బెదిరించడానికి వాడు మనిషయితే గదా! ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోన్న కార్పోరేట్ భూతాలలో వాడొకడు. కోర్టుకు పోయినా మన ఆస్తి అంతా అమ్మేసినా వాడి మీద గెలవలేం! వస్తాయని నమ్మి ఊరుకోవడమే మంచిది."అని ముగించాడు.

 

  "పోన్లేండి మన డబ్బులు మనకు వచ్చేస్తే అంతే చాలు.పొద్దునే గజేంద్ర మోక్షం లాగయింది. నేను ఎన్ని దండాలు పెట్టుకున్నానో!" అని అందావిడ. 

  

  ఆమాటకు రాఘవ నవ్వుతూ "అవును మనలను పట్టింది కార్పొరేట్ మొసలి.! ఆ విష్ణుమూర్తే మనలను కాపాడాడు." అని అన్నాడు. "పద ఇక లేచి మన పనులు మనం చేసుకుందాం. "అని అంటూ లేవబోయాడు. ఇంతలోనే చింటూ సుడిగాలి లా పరిగెత్తుకుని వచ్చాడు. వీళ్ల గోల లో పిల్లలు లేచి ఆటలు మొదలెట్టారని కూడా గమనించ లేదు. 

  

  "డాడీ!w.w.w.అంటే ఏమిటో చెప్పు!"అని నిలేసాడు. వాడెప్పుడూ అంతే వాడికి తెలిసినవి డాడికి తెలుసా లేదని పరీక్షిస్తుంటాడు. 

  

  పిల్లాడిని దగ్గర తీసుకుంటూ "సాలె గూడు. ఇప్పుడు మనం దాన్లోనే చిక్కుకున్నాం!" అని జవాబిచ్చాడు. ఒక్క క్షణం వాడికేమీ అర్ధం కాలేదు. "రాంగ్! వరల్డ్ వైడ్ వెబ్! "అని చెప్పేసి తండ్రి ని వదుల్చుకుని అక్క దగ్గర కు పరుగు పెట్టాడు. ఈ లోపల సెల్ మోగడంతో ఆన్ చేసాడు. 

  

  "అమెజాన్ నుండి ఫోన్ చేస్తున్నాం సార్! మీఅడ్రస్ చెబుతారా!"అని అవతలనుండి మాట్లాడుతున్నారు. మరో కార్పొరేట్ మొసలి అని అనుకుంటూనే అడ్రస్ చెప్ప సాగాడు. 

                                          • ** ******

కామెంట్‌లు లేవు: