25, ఆగస్టు 2021, బుధవారం

ఒక్కడే యజమాని

 ఆ ఒక్కడే యజమాని..మరి మనమో? (నా అంతరంగ తరంగం)

.....................

నా ఇంటికి నేను యజమానా? తర్కించుకుంటే దొరికిన సమాధానం..కాదు అనే. ఆ మాటకు వస్తే ఎవరికి ఎవరూ యజమాని కాదు. అందరికీ యజమాని ఆ సర్వాంతర్యామే. మనమంతా సేవకులమే. నా భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా నేను సేవకుడినే. నేను యజమానిని అనుకుంటే నా పైన ఒకడు, అతనిపై మరొకడు, అతనిపై ఇంకొకడు, ఆపైన చిట్ట చివరన ఒకడు. ఇక లేడు. వాడే కదూ..యజమాని. సమస్త సృష్టిలో భౌతిక ప్రకృతి ఒక భాగం మాత్రమే. తక్కిన ప్రధాన భాగమంతా ఆధ్యాత్మిక ప్రకృతే. అలాంటి అవ్యక్తమైన వైకుంఠ ధామమే నా ధామం అన్నారు గీతా భగవానుడు. అందరూ అక్కడికే చేరాలనుకుంటారు. ఈ కనిపించే సృష్టి భగవానుడిదే అనుకుంటే సృష్టికి ముందు ఆయన ఉన్నట్టేగా. మరి...ఆయనే యజమాని అనడానికి అభ్యంతరం ఏముంది? భౌతిక దృష్టికి నువ్వు, నేను, తక్కిన వారు కుటుంబ యాజమానులమని చెప్పుకోవడం కద్దు. కానీ, నిజమైన యజమాని ఆయనే..అనే స్పృహ మాత్రం ఉండాలి. మన పైన యజమాని అని చెప్పుకునే వాళ్ళను ఆ విధంగానే చూదాలి, తప్పదు. కానీ ఆయన కూడా నీకు యజమాని కాదనే స్పృహ అంతరంలో ఉండాలి. ఏదో సాధించాలని మానవ జన్మ ఎత్తి, ఎంత సాధించినా తృప్తి లేని మనం, రాగం- విరాగంలోనే మగ్గిపోయి భళ్లున తెల్లారిటనట్టు ఎప్పుడు జీవితానికి తెరపడుతుందో తెలియని మనం యాజమానులం ఎలా అవుతాం? దాస దాసులం, దాసాను దాసులం. ఆ సకల జగన్నియంత ముందు ఏ నియంతా..నియంత కాదు. ఎవడూ యజమాని కాడు, కాలేడు. హరి ఓం.// ఆదూరి వేంకటేశ్వర రావు.

కామెంట్‌లు లేవు: