25, ఆగస్టు 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *23.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మొదటి అధ్యాయము*


*యదువంశమునకు ఋషుల శాపము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*1.17 (పదిహేడవ శ్లోకము)*


*తచ్ఛ్రుత్వా తేఽతిసంత్రస్తా విముచ్య సహసోదరమ్|*


*సాంబస్య దదృశుస్తస్మిన్ ముసలం ఖల్వయస్మయమ్॥12183॥*


మునుల వచనములను విన్నంతనే ఆ యదుకుమారులు మిగుల భీతిల్లిరి. వెంటనే వారు సాంబుని చూడగా వారికి ఒక ఇనుప ముసలము కనబడెను.


*1.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*కిం కృతం మందభాగ్యైర్నః కిం వదిష్యంతి నో జనాః|*


*ఇతి విహ్వలితా గేహానాదాయ ముసలం యయుః॥12184॥*


అంతట వారు ఖిన్నులై 'నిజముగా మనము బుద్ధిహీనులము. దురదృష్ట వంతులము. ఎంతటి తగనిపని చేసితిమి. మనము చేసిన ఈ పిచ్చిపనికి మన పెద్దలు మనలను ఎంతగా నిందింతురోగదా!' అని ఆందోళన చెందుచు ఆ ముసలమును దీసికొని తమ ఇండ్లకు చేరిరి.


*1.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తచ్చోపనీయ సదసి పరిమ్లానముఖశ్రియః|*


*రాజ్ఞ ఆవేదయాంచక్రుః సర్వయాదవసన్నిధౌ॥12185॥*


అనంతరము ఆ యదుకుమారులు దానిని రాజసభకు తీసికొనివెళ్ళిరి. అప్పుడు వారి ముఖములు వాడిపోయియుండెను. వారు ఆ సభలోనే సమస్త యాదవుల సమక్షమున తామొనర్చిన మహాపరాధమును, తత్ఫలితముగా లభించిన మునుల శాపమును ఉగ్రసేన మహారాజునకు సమగ్రముగా వివరించిరి.


*1.20 (ఇరువదియవ శ్లోకము)*


*శ్రుత్వామోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృప|*


*విస్మితా భయసంత్రస్తా బభూవుర్ద్వారకౌకసః॥12186॥*


పరీక్షిన్మహారాజా! తిరుగులేని ఆ విప్రోత్తముల శాపమును విని, ముసలమును గాంచి, ఆ ద్వారకానగర వాసులందరును ఎంతయు భయసంభ్రమములకు లోనై గజగజవణికిపోయిరి.


*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*తచ్చూర్ణయిత్వా ముసలం యదురాజః స ఆహుకః|*


*సముద్రసలిలే ప్రాస్యల్లోహం చాస్యావశేషితమ్॥12187॥*


అంతట యాదవరాజైన ఉగ్రసేనుడు ఆ ముసలమును పిండిపిండిగావించి, ఆ చూర్ణమును మిగిలియున్న ఇనుపముక్కను సముద్ర జలములలో పడవేయించెను.


*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*కశ్చిన్మత్స్యోఽగ్రసీల్లోహం చూర్ణాని తరలైస్తతః|*


*ఉహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసన్ కిలైరకాః॥12188॥*

పరీక్షిన్మహారాజా! ఆ లోహపుముక్కను ఒక చేప మ్రింగెను. ఆ చూర్ణపు రేణువులు అలలకు కొట్టుకొనివచ్చి తీరమునకు (ఒడ్డునకు) చేరెను. అవి తుంగగడ్డిగా మొలిచెను.


*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మత్స్యో గృహీతో మత్స్యఘ్నైర్జాలేనాన్యైః సహార్ణవే|*


*తస్యోదరగతం లోహం స శల్యే లుబ్ధకోఽకరోత్॥12189॥*


జాలరులు వలవేసి సముద్రము నందలి ఇతర చేపలతో పాటు, ఈ మత్స్యమును (ఇనుపముక్కను మ్రింగిన మత్స్యమును) గూడ పట్టుకొనిరి. దాని కడుపులోని లోహపుముక్కను ఒక వేటగాడు తన బాణమునకు ములికగా చేసెను.


*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*భగవాన్ జ్ఞాతసర్వార్థ ఈశ్వరోఽపి తదన్యథా|*


*కర్తుం నైచ్ఛద్విప్రశాపం కాలరూప్యన్వమోదత॥12190॥*


శ్రీకృష్ణభగవానుడు సర్వజ్ఞుడు. ఆ విప్రశాపమును అన్యథా చేయుటకును సమర్థుడు. కానీ కాలపురుషుడైన ఆ ప్రభువు అట్లొనర్పక ఆ శాపమును ఆమోదించెను (ఆ శాపవిషయమును పట్టించుకొనక నిర్లిప్తుడై యుండెను).


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ప్రథమోఽధ్యాయః (1)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *యదువంశమునకు ఋషుల శాపము* అను

మొదటి అధ్యాయము (1)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

*24.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*2.1 (ప్రథమ శ్లోకము)*


*గోవిందభుజగుప్తాయాం ద్వారవత్యాం కురూద్వహ|*


*అవాత్సీన్నారదోఽభీక్ష్ణం కృష్ణోపాసనలాలసః॥12191॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని బాహుబల రక్షణలో ద్వారకానగరము సకలసంపదలతో వర్ధిల్లుచుండెను. శ్రీకృష్ణుని దర్శించుటయందు మిక్కిలి ఔత్సుక్యముగల నారదమహర్షి ఆ నగరమునకు పదే పదే విచ్చేయుచు అచట నివసించుచుండెడి వాడు.


*2.2 (రెండవ శ్లోకము)*


*కో ను రాజన్నింద్రియవాన్ ముకుందచరణాంబుజమ్|*


*న భజేత్సర్వతో మృత్యురుపాస్యమమరోత్తమైః॥12192॥*


మహారాజా! అమరులైన బ్రహ్మాది దేవతలకు సైతము శ్రీకృష్ణుని చరణాంబుజములు సర్వదా ఉపాస్యములు. ఇక అనుక్షణము మృత్యువుకోరలలో చిక్కుపడియుండెడి మానవుడు చక్షురాది ఇంద్రియములు కలవాడయ్యును కృష్ణప్రభు పాదారవిందములను ఎందుకు సేవింపకుండును?


*2.3 (మూడవ శ్లోకము)*


*తమేకదా తు దేవర్షిం వసుదేవో గృహాగతమ్|*


*అర్చితం సుఖమాసీనమభివాద్యేదమబ్రవీత్॥12193॥*


ఒకానొకప్పుడు దేవర్షి (నారదుడు) వసుదేవుని భవనమునకు ఏతెంచెను. అప్పుడు వసుదేవుడు ఆ మహర్షిని అర్ఘ్యపాద్యాదులతో అర్చించెను. పిమ్మట సుఖాసీనుడైయున్న ఆ మహామునికి ప్రణమిల్లి ఇట్లడిగెను.


*వసుదేవ ఉవాచ*


*2.4 (నాలుగవ శ్లోకము)*


*భగవన్ భవతో యాత్రా స్వస్తయే సర్వదేహినామ్|*


*కృపణానాం యథా పిత్రోరుత్తమశ్లోకవర్త్మనామ్॥12194॥*


*వసుదేవుడు పలికెను* "మహాత్మా! తల్లిదండ్రులయొక్క రాక (దర్శనము) వారి సంతానమునకు ఆనందదాయకము. భగవత్సాక్షాత్కారమును పొందిన మహానుభావులయొక్క ఆగమనము తాపత్రయ పీడితులైన దీనులకు శుభప్రదము. పూజ్యుడవైన నీవు సాక్షాత్తుగా భగవత్స్వరూపుడవు. పుణ్యపురుషుడవైన నీయొక్క సంచారము లోకకల్యాణకారకము.


*2.5 (ఐదవ శ్లోకము)*


*భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ|*


*సుఖాయైవ హి సాధూనాం త్వాదృశామచ్యుతాత్మనామ్॥12195॥*


ప్రాణులపట్ల దేవతల ప్రవృత్తి విచిత్రముగా ఉండును. తమను పూజించినప్పుడు సంతసించి ప్రాణులకు సుఖమును కూర్చెదరు. ఏదేని పొరపాటు సంభవించినచో కోపగించి దుఃఖముల పాలు చేయుదురు. కానీ, నిరంతరము కృష్ణధ్యాన పరాయణులైన మీవంటి సాధుపురుషుల సంచారము మాత్రము సకలప్రాణులకును కల్యాణదాయకమే అగును.


*2.6 (ఆరవ శ్లోకము)*


*భజంతి యే యథా దేవాన్ దేవా అపి తథైవ తాన్|*


*ఛాయేవ కర్మసచివాః సాధవో దీనవత్సలాః॥12196॥*


దేవతలు తమను సేవించిన మానవులకు తదనుగుణముగనే (సేవా తారతమ్యములను బట్టి) ఫలములను ప్రసాదించుచుందురు. ఏలయన వారు ఛాయవలె కర్మాధీనఫలములను ఇచ్చుచుండెడివారు. కాని మీవంటి సత్పురుషులు తాపత్రయ బాధితులయెడ సమానముగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండ అవ్యాజకృపను ప్రసరింపజేయుచుందురు.


*2.7 (ఏడవ శ్లోకము)*


*బ్రహ్మంస్తథాఽపి పృచ్ఛామో ధర్మాన్ భాగవతాంస్తవ|*


*యాన్ శ్రుత్వా శ్రద్ధయా మర్త్యో ముచ్యతే సర్వతోభయాత్॥12197॥*


మహాత్మా! నీ దర్శనభాగ్యము చేతనే మేము కృతార్థులమైతిమి. ఐనను భగవంతుడు ప్రసన్నుడగుటకై ఆచరించవలసిన ధర్మములను గూర్చి నిన్ను అడుగుచున్నాము. వాటిని భక్తిశ్రద్ధలతో (సావధానముగా) విన్నవారు వివిధములగు సాంసారిక భయములనుండి విముక్తులగుదురుగదా!


*2.8 (ఎనిమిదవ శ్లోకము)*


*అహం కిల పురాఽనంతం ప్రజాఽర్థో భువి ముక్తిదమ్|*


*అపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయా॥12198॥*


మహర్షీ! నేను పూర్వజన్మమున దేవమాయా మోహితుడనై ముక్తికొరకుగాక సంతానప్రాప్తికై ఆ సర్వేశ్వరుని పూజించియుంటిని (ఈ విషయమును సూతాకాగృహమున కృష్ణపరమాత్మయే తెలిపియుందెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: