పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు మూడుగుణముల హెచ్చుతగ్గులతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది. ప్రకాశాన్ని, వెలుగును ఇస్తుంది. కానీ అగ్నిపక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేము కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తే, ఆ కర్మలలో దోషం ఉన్నా, ఆ కర్మల వాసనలు అంటవు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదము వలన దోషములు ఉన్నా, వాటిని పరమాత్మ పరంగా చేస్తే, వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నాడు పరమాత్మ.
ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాము. కాళ్ల కిందపడి ఎన్నోజీవులు మరణిస్తుంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా పంచ మహాయజ్ఞములు చేయమన్నారు.
1.బ్రహ్మయజ్ఞము (దేవతలను ఆరాధించడం, శాస్త్రములు చదవడం, వినడం),
2. పితృయజ్ఞము అంటే పితృదేవతలను ఆరాధించడం, క్షణములు, పిండప్రదానములు చేయడం,
3. దేవ యజ్ఞ అంటే సకల దేవతారాధన, హెూమములు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం,
4. భూతయజ్ఞము అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం
5. మనుష్య యజ్ఞము అంటే బ్రాహ్మణులకు, అతిధులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తి పరచడం.
వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి