*🥀గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం' అనటం కాదు. ఇంట్లో ఉన్నదానిని, నోట్లోకి పోయేదానిని కూడా అనగలగాలి🥀*
చాల చాలా చక్కని విశ్లేషణ.
*కృష్ణసందేశం !!*
కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!!
*కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది.*
*ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.*
*శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే!!*
ఓం దేవకీ గర్భసంజాతాయ నమః !!
ఓం యశోదేక్షణ లాలితాయ నమః !!
*కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -*
అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే
అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద!!
*కృష్ణనామమహత్యం* :-
సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం.
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీ పోవడానికి (అంటే మనసు కష్టం అని భావించదు ) అవి ఆలా కర్మ పరిసమాప్తం ఐపోతాయ్ అన్నమాట.
*మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!!*
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప!
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్!!
కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః!
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్!!
*కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.*
కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా!
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః!!
కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు!!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే!
ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే!!
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే!! అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామ మంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు.*
*కృష్ణవిగ్రహముఇస్తున్నసందేశం* :-
దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -
*1. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ!!*
*గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది!!*
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః!
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్!!
*యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు!!*
*బీష్మపితామహుడు* :-
ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః!
దశాశ్వమేధీ పునరితి జన్మ
కృష్ణప్రణామీ న పునర్భవాయ!!
*శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు!!*
*శత్రుచ్చేదైకమన్త్రం*
సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం!
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః! సంఘనిర్యాణమన్త్రమ్!!
సర్వైశ్వర్యైకమన్త్రం! వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం!
*జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం!! (ముకుందమాలా)*
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి*
*"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము"!!*
*హరే కృష్ణ*🥀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి