14, జనవరి 2022, శుక్రవారం

కంఠ చామీకర న్యాయం

 అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


***


146

కామెంట్‌లు లేవు: