నీటి ఎద్దడి – పంపుసెట్టు
అది సూర్యుడు ప్రచండంగా ఉన్న ఎండాకాలం. పల్లెల్లో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. చాలా ఇళ్ళల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఉన్న నీళ్ళనే ఊరివారందరూ పంచుకుంటున్నారు.
అలాంటి ఒక నీటి ఎద్దడి ఉన్న గ్రామప్రజల అభ్యర్థన మేరకు మహాస్వామి వారు వచ్చి ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. ఆ ఊర్లోని పేద-ధనిక, మంచివారు-చెడ్డవారు, విధ్వాంసుడు-అవివేకి అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్వామివారి దర్శనానికి వచ్చారు.
బాగా వయసుమళ్ళిన ఒక ముసలాయన స్వామి వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ అతనికి దారిచ్చి, ఎంతో గౌరవంతో మహాస్వామి వారి దర్శనానికి సహకరించారు. బహుశా అతను ఆ గ్రామ పెద్ద కావచ్చు.
అతను స్వామివారికి నమస్కరించి నిలుచున్నాడు.
మహాస్వామి వారు అతణ్ణి “నీ వయసెంత?” అని అడిగారు.
”నాకా? చాలా ముసలివాణ్ణి. ఎనభైరెండేళ్ళు” అని ముసలాయన బదులిచ్చాడు.
”అంతా బగున్నదా? సంతోషంగా ఉన్నావా?” అని అడిగారు స్వామివారు.
”లేదు, సామి. నాకు సంతోషానికి తావెక్కడ? మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నేను చెప్పినది ఎవరూ వినరు? ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ప్రాణం ఉంది కాబట్టి బతుకుతున్నాను” అని నిర్వేదంగా చెప్పాడు. ”ఐతే చాలా బాధలో ఉన్నానంటావ్”
“అవును సామి. . .”
“నువ్వు సంతోషంగా ఉండడానికి మార్గం చూపిస్తే దాన్ని పాటిస్తావా?” అని అడిగారు స్వామి వారు. ”చెప్పండి సామి” ఆత్రుతతో అడిగాడు ఆ ముసలాయన.
”మీ తోటలో ఉన్న పంపుసెట్టుకి ముళ్ళకంచె వేసావు, ఎవరూ ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకోరాదని. తాగడానికి, వండుకోవడానికి నీరు లేక ఇక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నీవు నీ పంపుసెట్టు ద్వారా నీటిని నీ పొలాలకి పంటలకి మాత్రమే వాడుకుంటున్నావు. నీ ఆస్తి, నీ కుటుంబం వల్ల నీకు సంతోషం లేదని అంటున్నావు. ఆ పంపుసెట్టు చుట్టూ పెట్టిన కంచెను తొలగించు. అందరూ ఆ నీళ్ళను తీసుకోవడానికి వదులు. అందరూ ఆ నీళ్ళను వాడుకోనివ్వు. వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీస్సుల వల్ల నీకు సంతోషం లభిస్తుంది” అని చెప్పారు.
ఇదంతా విన్న తరువాత ఆ ముసలాయన కళ్ళల్లో నుండి నీరు ధారాపాతంగా కారుతున్నాయి.
పరమాచార్య స్వామివారి మాటలను విన్న ఆ గ్రామప్రజలు ఆశ్చర్యపోయారు. ”ఆ ముసలాయన పొలంలో పంపుసెట్టు ఉన్న విషయం గురించి స్వామివారికి ఎవరూ చెప్పలేదు. ఎవరూ నీళ్ళు తీసుకోరాదని దానికి వేసిన కంచె గురించి చెప్పలేదు. ఎవరైనా తీసుకోవడానికి వెళ్తే ఆ ముసలాడు గొడవకు వచ్చేవాడని కూడా ఎవరూ చెప్పలేదు” పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల వారి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తే చాలు అని ప్రార్థించారు.
పరమాచార్య స్వామివారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఇద్దరు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఆ ముసలాయన పంపుసెట్టు చుట్టూ ఉన్న కంచెను తీసేసాడు” అని చెప్పారు.
ఆరోజునుండి ఆక్కడి నీరు ఊరుమొత్తం పొంగింది.
పంపుసెట్టుకి కంచె తీసివేసి ఊరి వారందరికి ఆ నీరు పంచడం వల్ల ఆ ముసలాయనకు కూడా సంతోషం ఉప్పొంగింది.
పరమాచార్య స్వామివారి కరుణ అపారమైనది. వారి కరుణ వారి దయ ఎండిపోని జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి