24, మార్చి 2022, గురువారం

భగవంతుడు గుణాతీతుడు

 భగవంతుడు గుణాతీతుడు 

ద్వయత ప్రపంచంలో వున్న మనం త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి అరిషడ్వార్గానికి బానిసలుగా వుంటూ సంసార జీవనం గడుపుతున్నాము. సంసారులైనవారు కూడా సంసారం మోక్షసాధనకు ఉపయోగకరంగా మలచుకోవటానికి వారు వారి మనస్సుని నియంత్రించుకొని సదా పరబ్రహ్మ్మములోనే చరిస్తూ మోక్షాన్ని పొందిన మహానుభావులు ఎందరో అందులకు నిదర్శనం జనక మహారాజు. అనాదిగా వున్న  మన వేదాంత గ్రంధాలను అంటే ఉపనిషత్తులను పరిశీలిస్తే మనకు గోచరించేది ఒక్కటే అదే పరబ్రహ్మ అంతేకాని ఇంకొకటి లేదు.  ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా మానవులమైన మనం పరమాత్మలో ఎలావిలీనం (మోక్షం) కావాలో తెలియచేస్తుంది. ఉపనిషత్తులు అన్నిమతాలవారికి అంటే హిందూ ధర్మాన్ని ఆచారాయించే అద్వేతులకు , విశిష్ఠద్వితులకు, ద్విఎతులకు అందరికి ఉన్నవి ఒక్కటే. ఆయా మతాచారులు వారి, వారి జ్ఞ్యానంతో ఎలాంటి విభేదాలు చేశారు కానీ బ్రహ్మ ఒక్కటే అన్నది అందరికి ఆమోదయోగ్యం. అదే సత్యం. 

సంసారులు తమ దైనందిక జీవనవ్యాపారాలలో పది భగవంతుని కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు కనుక పూర్తిగా ఆ భగవంతునికొరకు జీవితాన్ని సమర్పించుకోవటానికి ఏర్పడిన ఆశ్రమం "సన్యాస ఆశ్రమం" సన్యాస ఆశ్రమ ప్రధాంధర్మం సత్వగుణ వంతులు కావటము. ద్వితీయం అరిషడ్వార్గానికి దూరంగా ఉండటం. వారు దాంపత్య జీవితానికి సంబందించిన కొన్ని పదాలను నోటితో ఉచ్చరించటానిని కూడా మన ధర్మం నిషేదించింది. కామ, క్రోధ, మధ, మాత్సర్యాలకు తావివ్వకుండా పూర్తిగా జీవితాన్ని భగవంతుని కొరకే అర్పణ చేయటం సన్యాసధర్మం. అంతేకాక కేవలము ఒక సంవత్సరములో నాలుగు నెలలు మినహా మిగిలిన ఎనిమిది నెలలు కేవలము పాదచారులై బిక్షలో దొరికినది మాత్రమే భుజిస్తూ, గృహస్తుల ఇండ్లకు వెళ్లకుండా కేవలం దేవాలయాలలో మాత్రమే వసిస్తూ సమాజానికి ధర్మబోధ చేస్తూ జీవనం జీవనం గడపాలి. 

సన్యాసికి స్త్రీల పట్ల మోహము, కామము ఉండకూడదు, అంతేకాక ఏ విషయవాంఛలపై కూడా మొహం ఉండకూడదు. పూర్తిగా శిరస్సు ముండనం చేసుకొని (గుండు చేసుకొని) ఉండాలి. శిఖ (పిలక ) ఉండకూడదు. అదే సంసారి శిఖ (పిలక) లేకుండా పూర్తిగా ముండనం (గుండు) చేసుకోకూడదు చివరికి తిరుపతికి వెళ్లినా కూడా సంసారికి పూర్తీ ముండనం నిషిద్ధం. 

సన్యాస జీవనం సంసారిక జీవనం కన్నా మిగుల కఠినతరం. ఇప్పటి సన్యాసులుగా చెప్పుకొనే సన్యాసులు ఎంతవరకు సన్యాసులుగా వున్నారో అన్నది వారి విజ్ఞతకే తెలియాలి. 

భగవంతుడు త్రిగుణాతీతుడు, రూపం లేని వాడు, కాలంలో లేనివాడు. అటువంటి భగవంతుని సామాన్యమైన మానవులు తేలికగా అర్ధం చేసుకొనేటందుకు మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలతో మనలోని మానసిక స్థిరత్వాన్ని చేకూర్చటానికి మన మహర్షులు ఏర్పాటు చేశారు. నిజానికి త్రిమూర్తులు కూడా ఆ పరబ్రహ్మయే మనిషి జ్ఞ్యానిగా మారినప్పుడు ఆ స్థితిని పొందుతాడు. పరబ్రహ్మ జ్ఞ్యానం లేని మిడిమిడి జ్ఞ్యానవంతులు త్రిమూర్తులను విడివిడిగా చూడటమే కాకుండా వారిలో ఒకరు గొప్ప ఇంకొకరు కారని చెపుతూ మానవులకు గల సహజ సిద్ద స్వభావాలైన అరిషడ్వార్గాలను వారికి కూడా ఆపాదించటం ఎంతవరకు సమంజసము విజ్ఞులు యోచించాలి. 

బాధాకరమైన విషయం ఏమిటంటే సర్వ సంఘపరిత్యాగినని ప్రకటిస్తూ ఆశ్రమాలను నడిపే స్వామీజీలు త్రిమూర్తులను వారి పత్నులను సాధారణ దంపతులుగా భవిస్తూ విమర్శించటం విచారకరం. మిత్రులారా మన హిందూ ధర్మంలో శివ కేశవ బేధం లేదు. దేముళ్ళకు కూడా మనకు ఉన్ననీచ స్వభావాలను అంటకట్టటము అత్యంత పాపహేతువు అవుతుంది. అందునా సన్యసించినట్లు ప్రకటించే వారలు కూడా. 

ఇప్పటి సన్యసించిన సత్పురుషులకు  నేను విన్నవించుకునేది ఒకటే మహానుభావులారా మీకు చేతనయితే పరబ్రహ్మ తత్వాన్ని ప్రభోదించి సాధారణ మానవులకు జ్ఞ్యాన బిక్ష పెట్టండి. లేకుంటే విభేదాలు కలగకుండా మీరు నమ్మిందే ప్రచారం  చేయండి. సన్యాసులు రాజకీయనాయకుల ప్రాబల్యానికి పాకులాడటం చాలా చాల శోచనీయం. మీరు కేవలం బ్రహ్మత్వాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి కానీ బాహ్య పటాటోపానికి కాదు కదా. 

బ్రహ్మ ఒక్కటే రెండవది లేదు (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ')అందరమూ మన మన సహజ స్వభావాలను త్యజించి ఆ పరబ్రహ్మలో లీనం అవ్వటానికి కృషి చేద్దాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 

కామెంట్‌లు లేవు: