24, మార్చి 2022, గురువారం

కామాక్షి కాపాడుతుంది

 కామాక్షి కాపాడుతుంది


1982-83లలో బెంగళూరులో కొందరు మిత్రులు కలిసి “జగద్గురు భక్త సభ” అను పేర ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఒకసారి నేను స్థానికంగా ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనలో పాల్గొంటూ ఉంటే, దేవాలయమ లోపల కిటికీ వద్ద ఒక చిన్న పాప నవ్వుతూ నిలబడి ఉండడం కనపడింది. హఠాత్తుగా నాకు మాటలు పోవడంతో భజనను నిలిపివేశాము. ఇంటికి వచ్చేశాను. కొన్ని నెలల తరువాత నాకు మూర్చ వ్యాధి రావడంతో చికిత్స తీసుకోవడం ప్రారంభించాను.


మా సంఘ అధ్యక్షుడు ఒక వస్త్రవ్యాపారి మంచి జ్యోతిష్కుదు కూడా. నా జాతకచక్రాన్ని పరిశీలించి, నాకు ఎటువంటి అనారోగ్యము లేదని, గురువు యొక్క కటాక్షముతో అంతా సరిపోతుందని తెలిపాడు. కొన్ని నెలల తరువాత మా అబ్బాయి, అమ్మాయి, భార్యతో కలిసి కాంచీపురం వెళ్లాను.


ఎత్తుగా ఉన్న వేదిక పైనుండి పరమాచార్య స్వామివారు దర్శనం ఇస్తున్నారు. భక్తులతో రద్దీగా ఉంది. నేను వరుసలో నిలబడి స్వామి దర్శనం కోసం మెల్లగా ముందుకు కదులుతూ, స్వామివారికి విన్నవించుకోవలసిన విషయాలను మననం చేసుకుంటూ ఉన్నాను. వరుసలో నా వంతు రాగానే మరలా నా మాట పడిపోయింది. మహాస్వామివారు ఆశీర్వదించగా ముందుకు వెళ్ళిపోయాము. బయటకు వచ్చిన తరువాత నా మాట సరిపోయింది. బయటకు వెళ్లి పలహారం చేసి మరలా తిరిగొచ్చాము. భక్తుల గుంపు ఉంది కాని మహాస్వామివారు లేరు. గుంపు చివర మేము నిలబడి ఉన్నాము. వెళ్ళిపోవడానికి స్వామివారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాము.


కొద్దిసేపటి తరువాత వేదికపై మహాస్వామివారు కనపడ్డారు. తమ కుడిచెయ్యిని కాళ్ళపై ఉంచుకుని ఆ గుంపులో ఎవరికోసమో వెదుకుతున్నారు. చేయి ఊపి ఇలా రమ్మన్నారు. నా ముందు ఉన్న భక్తులు కొద్దిగా దారి ఇచ్చారు. మమ్మల్ని చూసి మరలా రమ్మని చేయి ఊపారు.


మేము వేదికపైకి వెళ్ళాము. మమ్మల్ని ఒక గదిలోనికి తీసుకునివెళ్ళి స్వామివారు నేలపై కూర్చున్నారు. మేము నేలపై పడి స్వామివారికి నమస్కరించాము. హఠాత్తుగా ఒక సేవకుడు వచ్చి మేము లోపలకు ఎలా వచ్చాము అని అడిగాడు. తామే రమ్మన్నారని మహాస్వామివారు తెలిపారు. స్వామివారిని ప్రార్థించి, వరుసలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయిన నా సమస్య గురించి తెలిపాను. స్వామివారు ఆశీర్వదించి, “కామాక్షి ఉంది కదా, కాపాడుతుంది” అని దీవించారు.


కలాకండ, ద్రాక్షను మా పిల్లలకిమ్మని సహయకునికి చెప్పారు స్వామివారు. కుంకుమ ప్రసాదం, ఎందుద్రాక్ష, కలకండతో బయటకు వచ్చాము. ఆరోజు నుండి నాకు ఏ అనారోగ్య సమస్యా లేదు. కామాక్షి కటాక్షం ఏమిటో నాకు అర్థం అయ్యింది. మహాస్వామివారు ఆశీస్సుల వల్ల మా పిల్లలు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు.


--- ఎన్. రామగోపాల్, కంచి పెరివ ఫోరం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: