11, మే 2022, బుధవారం

పరమాచార్య స్వామివారు

 పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది.

అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు.

ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది.

ఆ పందిరి నుండి బయటకు రాగానే, ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, “అమ్మా! పెరియవ నిన్ను పిలుస్తున్నారు” అని చెప్పాడు. “నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో” అని సంశయంగా చెప్పింది. “అవును అమ్మా మిమ్మల్నే. లోపలికి రండి” అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, “నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు” అని చెప్పారు.

ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామి వారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు ఒకచేతిలో చెరుకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో “అమ్మా! అమ్మా!” అని అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది.

[కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడితేనే భక్తుని భక్తి, ఆర్తి తెలిసేది. కష్టాలలో కూడా భగవంతుని నమ్మి నిలిచినవాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా!!

పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చెయ్యడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోకకళ్యాణానికే!!]

కామెంట్‌లు లేవు: