వైశాఖ పురాణం - 11
11వ అధ్యాయము - రతి దుఃఖము - దేవతల ఊరడింపు
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.
కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.
శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.
ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్ర్హస్పతి యింద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి యిట్లనిరి.
కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువునర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.
రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!
ఓం నమః శివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి