12, మే 2022, గురువారం

మండోదరి

 రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుని మరణ వార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. 


రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన వాడు. అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. సత్యమైనా జీర్ణయించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది.


మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున వస్తుంది. మనసులో రాముని మీద కోపం. రాముని నిందించాలనే ఆత్రుత. రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై 

ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. 


రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుధ్ధ భూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. దూరం నుండి వస్తున్న మండోదరి 

యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించిందతనికి. 


ఎవరో తెలియదు కాని నీడను 

చూస్తే ఆ ఆకారం స్త్రీ మూర్తిదని అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీమూర్తి నీడ తన  నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు.  


ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీ పై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రాముని పై తనకున్న క్రోధం ఆమెలో మాయమయింది. 


యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. జయం అపజయం 

శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. 

డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. వ్యక్తుల నుండి 

విడదీసేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం 

అంటుంది రామాయణం. అలాంటి నాయక పాత్రకు ప్రతీక రాముడు.

 

అధమాః ధనమిచ్ఛంతి,

ధనం మానంచ మధ్యమాః

ఉత్తామాః మానమిచ్ఛంతి

మానోహి మహాతాం ధనం!

 

ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై , 

యత్నించే వారు, మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు 

సమాజంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు. మూడవ రకం ఉత్తములు అంటున్నారు, సుభాషిత కర్త.

 

ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం Result oriented attitude కాగా ధర్మ 

బధ్దమైన రీతిలో విజయం పొందాలనుకోవడం Process oriented attitude. గెలుపు 

ఇతరులపై సాధించేది కాగా విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది. గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. విజయంలో శాంతి ఉంటుంది. సౌమనస్యత  ఉంటుంది. ఇదే రామాయణం మనకు బోధించే నీతి.

కామెంట్‌లు లేవు: