12, మే 2022, గురువారం

ఉపాధ్యాయ ఉవాచ'

 మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.


ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట. నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి? సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.

 

అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే. 


సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి 

వారిని గురించి ఆరా తీస్తాడు. ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని అనుకున్నాడు. 


ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.

 

ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు 

పడుతున్నారు కదా! స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకు తున్నాము కదా ! మరి !

 

తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా! వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం', "నిశ్చయం" అనడానికి "నిచ్ఛయం" అని పలుకుతున్నారు. మరి ఎలా ఒప్పుకుంటున్నారు? యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు. హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు. వినడానికి సొంపుగా వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.


పాఠశాలలో చదివేటప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి. ఇప్పుడు బుల్లితెరలో వార్తలు చదివేవారు ఆంగ్లములో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు. ఆచ్చర్యం, నిచ్ఛయం అంటూ తప్పుగా చదువుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.

 

ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠాలను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి. అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా ఉండాలో ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)

 

వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక చిత్తుడై యనుపమ భక్తితో చదువు నాతని వాచకుండండ్రు సద్బుధుల్


చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు. ఆ,ఈ వూ అని అనకూడదు. విసుగు చెందకూడదు. ఒక ప్రవాహం లాగా ఆవిరళంగా సాగాలి. అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందేమిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తి శ్రద్ధలతో చదివేవాడిని, మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు

 

ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది. ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా 

తెలియదు. చెప్పేవారు కూడా లేరు. ఉపాధ్యాయులు అలాగే వున్నారు, విద్యార్థులూ అలాగే వున్నారు. 

 

'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు, యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.


(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

కామెంట్‌లు లేవు: