7, ఆగస్టు 2022, ఆదివారం

ఉపనిషత్

ఆధ్యాత్మిక జగతిలో ఉపనిషత్తుల యొక్క మహత్వం వర్ణనాతీతం. మోక్ష సాధకహేతుభూతములు ఉపనిషత్తులు. వేదాల యొక్క అంతిమ భాగమే ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయి. ఉపనిషత్ ప్రతిపాద్య విషయం జీవేశ్వర ఐక్యత్వం. అత్యంత భయంకర మృత్యురూప సంసారం నుండి బయటపడదలచిన ప్రతి ముముక్షువు ఉపనిషత్ వేద్య పరమాత్మను తెలుసుకోవాలి. ఉపనిషత్ వేద్యపరమాత్మ నిత్యశుద్ధ బుద్ ధముక్త స్వభావుడు, ఆనంద స్వరూపుడు, ఓంకార శబ్దవాచ్యుడు, గుణాతీతుడు ఇత్యాది లక్షణాలు కలిగి ఉంటాడు. ఉపనిషత్ జ్ఞానం వల్ల అనిర్వచనీయమైన అనాది అవిద్య నశిస్తుంది.

ఉపనిషత్ శబ్దార్థం- "నదేర్థాతోః విశరణగత్య వసాదనార్థస్యోపనిపూర్వస్య క్విప్ ప్రత్యయాన్తస్యరూపముపనిషత్” ఉపనిషత్ అను పదములో ఉప, ని, షత్ అను మూడు మాటలు గలవు. 'షదల్' అనునది ధాతువు. ఈ ధాతువునకు విడిపోవుట, ప్రాప్తి, నాశము అను మూడర్థములు గలవు. ఉప, ని, అనునవి రెండును ఉపసర్గలు. ఈ మూడు మాటలకు 'క్విప్' అను ప్రత్యయమును చేర్చగా 'ఉపనిషత్' అను పదము నిష్పన్నమగును.

“ఉపనిషదితి విద్యోచ్యతే తచ్ఛీలినాం గర్భజన్మజరాది నిశాతనాత్ తదేవసాదనాద్వా బ్రహ్మణో వా ఉపగమయితృత్వాత్ ఉపనిషణ్ణం వా స్యాం పరంశ్రేయ ఇతి”

ఉపనిషత్తనగా విద్య. అట్టి విద్యను పొందినవారికి జరామరణాద్యనర్థజాతము నశించుట వలనను, బ్రహ్మమును పొందించుట వలనను, ఈ విద్యయందు పరమశ్రేయస్సు నిహితమై ఉన్నది కనుక ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.

పూజ్యశ్రీ పరిపూర్ణానందస్వాములవారు శ్రీవ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు, శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు, చిత్తూరు జిల్లా. వారి అనుగ్రహంతో 

సేకరణ మీ 

భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: