31, అక్టోబర్ 2022, సోమవారం

నైధన తార

 *నైధన తార -- మల్లాది సూరిబాబు*


*శ్రీ మల్లాది సూరిబాబుగారు మహా కవిపండితులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి రెండవ కుమారులు*

తండ్రిగారి నుంచి వారసత్వంగా లభించిన సాహితీ సృజన వీరిని మంచి కథకునిగా తీర్చి దిద్దింది. వీరు సుమారు 70 కథలకు పైగా వ్రాశారు. చక్కటి తెలుగు నుడికారంతో, మధ్యతరగతి జీవితాలను హృద్యంగా తన కథలలో నింపుతారు. పాఠకుడిని పట్టి చదివించే రచనాశైలి వీరి ప్రత్యేకత.


'చివురంటి చిన్నది', 'వాసవసజ్జిక', 'శహన', 'మరణం ధృవమ్' మొదలైన గొప్ప కథలెన్నో సూరిబాబుగారు వ్రాశారు.


ఇప్పుడు పరిచయం చెయ్యబోయే  *నైధనతార* అనే వారి కథ 2002లో  'రచన' మాస పత్రికలో ప్రచురింపబడింది.

                         *   *    *



*"మా అమ్మగారు మీకు తాంబూలం ఇస్తారుట. ఈ పూట ఇంటికి తప్పక రమ్మన్నారు. రేపు ఆవిడ వూరికి వెడతారుట" అంటూ శారదాంబగారి నౌకరు నారాయణ సిద్ధాంతిగారి ఇంటికి వచ్చి చెప్పేడు.*


నారాయణ సిద్ధాంతిగారు ఆ పరగణాలో --ముహూర్తం, ప్రశ్న, జ్యోతిషం, వాస్తు శాస్త్రాలలో మేటి మొనగాడు. ఆ శాస్త్రాలలో ఆయనకి తెలియని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు.  ఎందుకంటే ఆయన సద్గురువుల వద్ద వేదవేదాంగాలు సక్రమంగా చదువుకున్నవాడు. పీఠాధిపతుల వద్ద మంత్ర దీక్ష పొందారు. వాక్ శుద్ధి గలవారిగా పేరు పొందారు.

ఆయన ఎందరి తల రాతలనో సరిదిద్దారు. 


ఇన్ని పనులు చేసినా, పెద్దమ్మవారి (జ్యేష్ఠాదేవి) ముద్దుబిడ్డగా, సరస్వతీ వరప్రసాదుడుగానే మిగిలిపోయారు.


తన ఇల్లాలి సలహా మేరకు నిత్యం కనకధారా స్తవం, విష్ణు సహస్రనామం పారాయణ చేసినా, ఆయనకి రవ్వంత విరామం దొరికితే మాత్రం స్మరణ చేసేది -- బమ్మెర పోతనగారి 'భాగవతం' లోని... *శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్* అనే మొదటి పద్యం!


ఆయన ముఖంలో వర్ఛస్సు పెరిగింది. కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది. కానీ... అడుగు నేల మీదనే ఉంది. 


"ఇంతమందికి ఇంతకాలంగా ఎంతో మేలు చేస్తున్నారు. ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు. మీరు ఏ మాత్రమూ ఎదుగూ బొదుగూ లేకుండా ఈ తీరుగానే ఉన్నారేం?" అని ఆయనతో పనిలేనివారు ప్రశ్నిస్తూ వుంటే ఆయన సమాధానం- మధురమైన మందహాసం!

తనలో తాను 'పూర్వ జన్మ సుకృతం!' అనుకునేవారు.

"ఇందరి జాతకాలు చూశారు కదా - మీ జాతకం ఎప్పుడైనా చూసుకున్నారా?" అని కావలసిన వారు అడిగితే,

"పెద్ద పెద్ద దైవజ్ఞులే చూశారు! చాలా గొప్ప యోగ జాతకం అన్నారు. బుధాదిత్య యోగం అన్నారు. గజ కేసరి యోగం వంటి మంచి యోగాలు ఉన్నాయన్నారు. కానీ - వీటన్నింటినీ కేమద్రుమ యోగం మింగేసిందని అన్నారు" అని చెప్పేరు.

"దానివల్ల ఏమి జరుగుతుంది?- నష్టమా?" కొందరి సందేహం.

"పెద్ద నష్టమేమీ లేదు. మనం అందరికీ ఉపయోగ పడతాం..కానీ ఇతరుల వలన మనకు ఉపయోగం ఉండదు."

"దీన్ని మార్చడానికి ఏదైనా అవకాశం కాని, శాంతి ప్రక్రియ కానీ ఉందా?"

"ఉన్నదల్లా ఒక్కటే ఉపాయం! ఈ జన్మలో పుణ్యం సంపాదించడం, వచ్చే జన్మలో ఆ పుణ్యఫలాన్ని అనుభవించడం."

"అంతేనా?"

"అంతే!"

ఆ తరవాత ఆయన యోగక్షేమాల సంగతి ఎవరికీ పట్టలేదు! ఆ శ్రీ హరికి తప్ప!!


*రెండు పుష్కరాలుగా ఆ దంపతులకు రెండు జతల బట్టలు, ఒక పూట భోజనం!*

*నెలకు పదిహేను ఏకాదశులు!!* (పస్తులు).

దారిద్ర్యం ఉన్నా దీనత్వం లేని ఈ నిష్ణాతులకు భగవంతుడు అడగకుండానే ఇచ్చిన వరం-- ఆనందం!


అందరు ఇల్లాళ్ళలాగే ఆయన అర్థాంగి సోమిదేవమ్మ కాపురానికి వచ్చిన తొలి సంవత్సరాలలో సంతానం కోసం ఎదురు చూసింది. కలగకపోయే సరికి పున్నామనరకం గురించి భయపడింది!

'పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు' అన్న వాక్యం గుర్తుకొచ్చి దాన ధర్మాలు చెయ్యాలని సంకల్పించింది. ఉబలాట పడింది. 

అయితే, ధర్మంగా ఉండడం సాధ్యమైంది! దానమే- శక్తికి మించిన పనయింది! ఆమెకు అంతులేని దిగులు వేసింది. కాని ఆయన మాటలు విన్న తరువాత మనసుకు ఉపశమనం కలిగింది!

"దానం అంటే... ధనదానం, వస్తుదానం ఒక్కటే కాదు.  ఆపదలో ఉన్నవారికి మంచి మాటలతో, మంచి చేతలతో మనం చేసే సహాయం కూడా దానమే!" అన్నారాయన.


ఆ నాటినుంచి ఆవిడ ఆ వాడలోవారికి పెద్ద దిక్కు అయ్యింది. తలలోని నాలుక అయ్యింది.

ఆ ప్రాంతానికి వారే పార్వతీ పరమేశ్వరులు అయ్యారు కానీ...కుబేరుడి స్నేహితులు కాలేకపోయారు!

ఆనాటికీ ఈనాటికీ ఆ లోగిలిలో ఉయ్యాల తొట్టె కట్టలేదు, పసిపిల్ల ఏడుపు వినిపించలేదు!


ఓనాడు సోమిదేవమ్మ ఆయనను, "నేను గొడ్రాలిని. మన వంశం నిలబడటం కోసమన్నా మీరు మళ్ళీ వివాహం చేసుకోండి" అని అమిత వేదనతో ప్రార్థించింది.

"శివ శివా!" అంటూ సిద్ధాంతిగారు చెవులు మూసుకున్నారు. 

"సోమిదేవీ! హాస్యానికైనా ఎప్పుడూ ఇటువంటి మాటలు అనవద్దు" అంటూ మందలింపుగా అంటూంటే ఆయన మనస్సు, మాట గద్గదమయ్యాయి.

"ఏ వంశం ఎంతకాలం ఈ భూమిమీద ఉండాలో, అవి ఎవరి ద్వారా నిలబడాలో నిర్ణయించేది ఆ సర్వేశ్వరుడే! మానవుల లాగానే వంశాలూ పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి. అది సహజం. కాలం తీరిన వంశం కాలగర్భంలో కలిసిపోతుంది. దాని ఆయుర్దాయము పొడిగించడానికి మనం ప్రయత్నం చెయ్యడం అవివేకం!" అన్నారు.

ఆ విషయం గురించిన ప్రస్తావన ఆ ఇంట్లో మళ్లీ రాలేదు.



సుమారు పద్దెనిమిది మాసాల క్రితం తనని వెతుక్కుంటూ శారదాంబ వచ్చింది. ముఖంలో దైన్యం, భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. నమస్కారం చేస్తూ తన ముందు నిలబడ్డది. 

చేతిలో ఫలం, పుష్పం ఏమీ లేవు. ఆవిడ తన జాతకం కాగితాలు ఆయన చేతిలో పెడుతూ,

"చాలా కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నాను. ప్రాణ భయం వేస్తోంది. మీరు రక్షిస్తారని, ఈ ఆపద గట్టెక్కిస్తారని మీ శరణుకోరి వచ్చాను" అంటూ మోకరిల్లింది.


ఆయన ఆవిడను దీవిస్తూ, 

"అందరికీ శరణు ఇవ్వగలిగిన కరుణానిధి, శరణాగత వత్సలుడు - ఆ శ్రీమన్నారాయణుడే. వారిని ఆశ్రయించండి. అన్ని ఆపదలూ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది." అన్నారు.

ఆవిడ మళ్లీ నమస్కరిస్తూ,  "నాకు తెలిసిన లక్ష్మీనారాయణులు మీరే. మీరు ఏది చెయ్యమంటే అది చేస్తాను!" అంది.


సిద్ధాంతిగారు ఆ జాతకం క్షుణ్ణంగా పరిశీలించారు.

రవ్వంతసేపు అంతర్ముఖులయ్యారు.

ఆవిడ మనసులోని మాటలు ఆయనకు వినిపించాయి.

*నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపం దగున్ దీనునిన్*....


ఆయన చిరునవ్వుగా ఆవిడ వంక చూశారు.

"మబ్బులు తొలగిపోతాయి. మళ్ళీ వెలుగు వస్తుంది. జీవితమంతా ఎప్పుడూ అమావాస్యగా ఉండదు. మీరు చేయవలసిన పనులు ఈ కాగితం మీద రాశాను. ఆ ప్రకారం చేయండి... సుఖం కలుగుతుంది" అన్నారు.

"ఏమేమి చెయ్యాలో చెప్పండి, తప్పక చేస్తాను" అందామె.


"ఈ మంగళవారంనాడు.. నూట ఎనిమిదిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అనంతరం ప్రతినిత్యం ఉదయం ఋణ విమోచన అంగారక స్తోత్రం మూడుసార్లు పారాయణ చేయండి. 

తరువాత మీ ఇంటి దగ్గర ఖాళీస్థలంలో నేను నిర్దేశించిన శుభ ముహూర్తాన శంకుస్థాపన చెయ్యండి. తరువాత గృహనిర్మాణం ప్రారంభించి, నేను నిర్ణయించిన ముహూర్తంలో గృహప్రవేశం చెయ్యండి - మూడు అంతస్తుల భవనం నిర్మించండి! సందేహించకండి. సాధ్యమా అని తర్కించకండి. మీ జాతకం అపూర్వ వస్తు లాభం సూచిస్తోంది. దానిని నిర్లక్ష్యం చేస్తే, ఆ ధనం రోగ నివారణకు... వ్యాధి రూపంగా వ్యయం అవుతుంది." అన్నారు.


ఆవిడ ఇంకొకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయింది! ఆనాటికి ఈనాడు ఆవిడ కబురు వచ్చింది.


"శారదాంబగారింటికి వెళ్లొస్తాను" అంటూ సిద్ధాంతిగారు లేచారు.

సోమిదేవమ్మ  ఒక్క క్షణం తటపటాయించింది. 

"ఈనాడు మంగళవారం! నక్షత్రం మీకు *నైధనతార*!! రేపటి రోజున వెడితే బాగుంటుందేమో" అన్నది.

"రేపు ఆవిడ ఊరికి వెడతారుట. ఈ రోజే రమ్మని కబురు చేశారు. వెళ్ళొస్తే సరిపోతుంది" అన్నారు.

"ఆహ్వానం - ఉభయులకూనా? మీ వక్కరికేనా?"

"ఆ వార్తలో ఆ వివరాలు లేవు... పిలుపు నా వరకూ మాత్రమే ననిపించింది."

ఆవిడ చిరునవ్వు నవ్వి శుభ శకునంగా ఎదురు వచ్చింది.

"క్షేమంగా వెళ్ళి లాభంగా రండి!" అంది.

ఆయన కూడా స్మిత వదనంతో,  "లాభం కంటే క్షేమం ముఖ్యం" అని శారదాంబగారి ఇంటివైపు నడిచారు.


తాను నిర్ణయించిన ముహూర్తానికే ఆర్భాటంగా శంకుస్థాపన చేశారనీ, అలాగే వైభవంగా గృహప్రవేశం కూడా జరిగిందనీ ఆయన కర్ణాకర్ణికగా విన్నారు.

తనకు పిలుపు లేదు, పేరంటమూ లేదు!

ఆ సంబరం ముగిసిన చాలా రోజులకు ఈనాడు ఈ ఆహ్వానం! 

వెళ్లకపోతే... కబురు చేసినా రాలేదనే మాట మిగిలిపోతుంది.

ఆయన అన్యమనస్కంగానే వెళ్ళేరు.


ఎదురుగా వచ్చి ఎవ్వరూ స్వాగతం పలుక లేదు. రెండు ఘడియలు నిరీక్షణ అనంతరం ఆవిడ వచ్చింది. రావడమే...

"కబురు చేసిన యింత సేపటికా రావడం? శంకుస్థాపనకి, గృహప్రవేశానికి రాలేదేం? బొట్టూ  కాటుక పెట్టి పిలవాలా? దగ్గరుండి చేయించవలసిన బాధ్యత మీకు లేదా??" అంటూ ప్రశ్నలతో ప్రళయంగా వచ్చింది.


ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదు. చూపు ఆవిడను దాటి గోడ మీద ఉన్న తంజావూరు చిత్రపటం మీద నిలిచింది. మర్రిఆకు మీద పవళించిన బాలకృష్ణుడు!

ఆవిడ కూడా అటు చూసింది. ఆ చూపులో దర్జా ఉంది. గర్వముంది. ఆవిడ ఏదో చెప్పబోయింది.

"నేను ఇల్లు చూడవచ్చునా?" అని ఆయన అడిగారు.

ఆవిడ ఒక్క క్షణం తటపటాయించింది. చివరకు నౌకరును పిలిచి, 

"దగ్గరుండి సిద్ధాంతిగారికి ఇల్లు చూపించు" అని ఆజ్ఞాపించింది.


సిద్ధాంతిగారు ఇల్లు చూసి వచ్చారు.

"ఎల్లా వుంది? అద్భుతంగా వుంది కదూ?" అని అడిగింది శారదాంబ.

"తూర్పు ఈశాన్యాలు రవ్వంత పల్లం చేయించండి. కుబేర స్థానానికి బలం చేకూరుతుంది" అన్నారాయన.

ఆవిడ ముఖంలో చికాకు కనిపించింది. 

"ఇప్పుడు మార్పులు చేర్పులు చెయ్యడానికి కుదరదు" అంది.


ఆయన లేచి నిలబడ్డారు.

బహుశః అప్పుడు ఆవిడకు అసలు విషయం గుర్తుకొచ్చింది కాబోలు...

"మీకు తాంబూలం ఇవ్వాలి కదా... ఊరికే ఎవ్వరిచేతా పని చేయించుకోవడం నా కిష్టం ఉండదు. మీకేం కావాలో అడగండి ఇస్తాను" అంది.

*సిద్ధాంతిగారి మనస్సుకు క్షణకాలం మాయ కమ్మింది! పరమాత్మ మీద నుండి మనస్సు పదార్థం మీదకు మరలింది. చూపు మళ్లీ ఆ వటపత్రశాయి చిత్రం మీద నిలిచింది*.


ఆవిడ కూడా అటువంక చూసింది. హేళనగా ఎగతాళిగా నవ్వింది.

"సిద్ధాంతిగారూ! మీకు ఇంత అత్యాశ కూడదు. ఆ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? పదిహేను వేలు! మీ అంతస్తుకు, తాహతుకు తగినది అడగండి...ఇస్తాను" అంది.


*'అడగండి...ఇస్తాను!'* -- ఆయన మనస్సులో యీ మాటే పదేపదే మసలింది. 

మాయ తొలగింది. వెలుగు వచ్చింది. వివేకం గుర్తు చేసింది. 

'నువ్వు యాచకుడివి కావు! దైవజ్ఞుడివి!! ఇటువంటి ప్రలోభం, ప్రతిఫలాపేక్ష లేకుండా సమదృష్టితో, సమభావనతో ఫలితాలు చెప్పవలసినవాడివి.

ఆశలకు అతీతంగా దూరంగా ఉండవలసిన వాడివి. నీవు స్వీకరించవలసింది సంభావన! దానం కాదు!'


'ఎందుకు ఈ పొరబాటు జరిగింది?' అని మనస్సు ప్రశ్నించింది. నీ సాధన ఇంకా పూర్తికాలేదు.  అందుకనే ఇటువంటి అగ్ని పరీక్షలు. దిగులు పడకు. 'ప్రమాదో ధీమతా మపి' అని అన్నారు. ఎంతటి వారికైనా యిటువంటి సమస్యలు తప్పవు' అంటూ హృదయం ఊరడించింది... చిన్నబోయిన మనస్సు చిరునవ్వు నవ్వింది. మల్లె కన్నా తేలికయ్యింది.


ఆవిడ చికాకుగా ఆయన వంక చూసింది.

"మీరు ఇంకా ఆ పెయింటింగ్ గురించే ఆశపడుతున్నారా? ఆ బొమ్మ సంగతి మరచిపొండి! అసలు విషయం గురించి ఆలోచించండి" అందామె. 


*బొమ్మను మరచిపొండి! అసలు విషయం గురించి ఆలోచించండి* సిద్ధాంతిగారికి వినిపించింది.

అలవాటుగా ఆశీర్వదించడానికి అలవాటు పడ్డ చేతులు - అప్రయత్నంగా ఆవిడకి నమస్కరించాయి. క్షణం కాలు నిలవలేదు. ఎనుగెక్కినంత సంబరంతో యింటికి తిరిగి వచ్చాడు....ఉత్త చేతులతో!


కను సన్నలతోనే యిల్లాలు ప్రశ్నించింది - "క్షేమమా? లాభమా?"

"అది నువ్వే నిర్ణయించాలి. నా దృష్టిలో పెద్ద ప్రమాదం తప్పింది. గొప్ప గండం గడిచింది" అని ఆయన అనగానే ఆ యిల్లాలి మొహంలో ఆందోళన కనిపించింది. 

"ఏం జరిగింది?" అని అడిగింది.

"తనది కాని దాని మీద మమకారం కలిగింది. ప్రతిబింబం- పదార్థమనే భ్రమ కలిగింది! అసలు విషయాన్ని గురించి ఆలోచించడం మానేశాను. నేను ఆలోచించవలసింది పరమాత్మను గురించి!..అది క్షణకాలం మరిచాను" అన్నారాయన.

"నాకు అర్థమయ్యేలా చెప్పండి" అందామె.


ఆయన జరిగిన విషయమంతా చెప్పారు. ఆ మాటలన్నీ విని ఆవిడ హాయిగా నవ్వింది.

"మీరు నిత్యం కొలిచే పర్వతరాజ నందిని ఆ శారదాంబగారి రూపంలో మీకు జ్ఞానోపదేశం చేసింది. మీ అంతరాళాల్లోని అజ్ఞానాన్ని ఒక్క మాటతో తొలగించింది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే సంభావించింది. ఆవిడకు మనం చాలా ఋణపడి ఉన్నాం" అందామె.


సిద్ధాంతిగారు పంచాంగం పరిశీలనగా చూశారు- ఎంతో సంతోషం వేసింది.

*"సోమిదేవీ! నైధనతార వెళ్ళిపోయి మిత్రతార వచ్చింది"* అని అన్నారు.

ఆయన మాట విని ఆ ఇల్లాలు నవ్వింది. ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది.


                   *------@@@@@------*


*అన్ని ముహూర్తాలకు ప్రధానంగా తారాబలం చూస్తారు. ఈ తారాబలం తొమ్మిది రకాలుగా విభజించారు.*

అవి: 1) జన్మతార,2) సంపత్తార,3) విపత్తార,4) క్షేమతార,5) ప్రత్యక్తార,6) సాధనతార,7) *నైధనతార*, 8) మిత్రతార, 9) పరమ మిత్రతార.


వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం నుండి ముహూర్తం నిర్ణయించవలసిన రోజున ఉన్న నక్షత్రం వరకూ లెక్కపెట్టి, వచ్చిన సంఖ్యను 9 చేత భాగించి, ఆ వచ్చిన శేషాన్ని బట్టి తారాబలం తెలుసుకుంటారు.


తప్పనిసరిగా చేయవలసిన పనులకు తారాబలం సరిపోకపోయినా, ప్రత్యామ్నాయాలు (దానాల వంటివి) సూచించారు పెద్దలు.

కానీ, *నైధనతార* అన్ని ముహూర్తాలయందూ విడిచిపెట్టాలని చెప్పారు.

*(జన్మతార నుంచి 7, 16, 25 నక్షత్రాలు నైధనతారలు)*.


ఇక ఈ కథ విషయానికి వస్తే....

ఒక ఇంటింటి మాస పత్రికలో వచ్చిన ఈ కథలో రచయిత మల్లాది సూరిబాబుగారు ఎంతో లోతైన తత్త్వాన్ని, జ్యోతిషశాస్త్ర విషయాన్నీ ప్రబోధించారు. 


ఈ కథకు *నైధనతార* అని అనే పేరు ఎందుకు పెట్టేరో, కథలో  *వటపత్రశాయి* చిత్రాన్ని ఎందుకు  తీసుకున్నారో అనే విషయాలను విశ్లేషించుకుంటే ఒక రచయితగా మల్లాది సూరిబాబుగారి భావాలు ఎంత పరిపక్వత చెందాయో, వారి పారమార్థిక చింతన ఎంతటిదో

మనం అర్థం చేసుకోవచ్చు.

ఆయన మూడు పాత్రల ద్వారా లోతైన జీవిత సత్యాలని ఆవిష్కరించారు.


నారాయణ సిద్ధాంతిగారు వేద వేదాంగాలు పఠించిన వారు. మంత్రదీక్షాపరులు. ఎన్నో శాస్త్రాలలో మహా పండితులు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ, ఎవ్వరి దగ్గర్నుంచీ ఏమీ ఆశించని నిష్కామ కర్మ యోగి.

శారదాంబ మొదటిసారి ఆయన దగ్గరికి వచ్చి, ఆయనే దిక్కు అని వేడుకొన్నప్పుడూ.., ఆనక అన్నీ బాగున్నాకా ఆమె ఈయనను తన ఇంటికి తాంబూలానికి రమ్మని పిలిచి, ఆయనను ఒక సామాన్య యాచకుడిలాగ, యాయవారపు బ్రాహ్మణుని లాగ ఉద్దేశించి అవమానంగా మాట్లాడినప్పుడూ ఒకేలా చిరునవ్వుతో స్వీకరించారు. అంటే మానావమానాలకు ఆయన అతీతంగా ఉన్నారు. 

నెలకు పదిహేను రోజులు పస్తులున్నా ఏనాడూ చేయిచాచి ఎవరినీ ఏమీ అడగలేదు.


అటువంటి నారాయణ సిద్ధాంతి గారు శారదాంబగారింట్లో వటపత్రశాయి చిత్రపటాన్ని చూసి ముగ్ధులైపోయారు. భక్తి భావంలో తన్మయులై ఏమి అడగాలో తెలియని స్థితిలోకి జారిపోయి, ఆ బొమ్మ మీదే దృష్టి పెట్టారు. కానీ...ఎంతయినా అది కేవలం చిత్రమే కదా! *అసలుకి--ప్రతిబింబమే*  కదా!! *అసలు పదార్థాన్ని* దర్శించాలంటే *లో చూపు* కావాలి. ఎందుకంటే బాహ్యంగా కనపడేది ఏదయినా నశించేదే! నశ్వరమైన దానిని తను ఆశించడమేమిటి? 


ఈ భావాలని చెప్పడం కోసమే రచయిత వటపత్రశాయిని తీసుకున్నారు. వటపత్రశాయి వృత్తాంతము భాగవతంలో మార్కండేయ మహర్షి చరిత్రలోనూ, మహాభారతం అరణ్య పర్వములోనూ వస్తుంది. 

వటపత్రశాయి అంటే మర్రి ఆకు మీద శయనించిన దేవుడు (విష్ణువు) అని అర్థం.

మార్కండేయుడు విష్ణువును గూర్చి తపస్సు చేసి, తనకు వరంగా ఆ దేవదేవుని *మాయ* చూడాలని ఉంది అని అడుగుతాడు. 

ఆ తరవాత విపరీతమైన గాలులూ, ధారాపాతంగా వర్షమూ వచ్చి సముద్రాలు పొంగిపోతాయి. నీటితో సమస్తం ములిగిపోతుంది. మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయతో నీటిమీద జీవించాడు. అలా తిరుగుతున్న ఆయనకు ఒక చోట మర్రి ఆకుపై శయనించిన బాలుడు కనిపించాడు. అతడే వటపత్రశాయి. ఆ వటపత్రశాయి ఉదరంలో మార్కండేయునికి నీట ములిగిన సమస్త భూమి, ప్రాణికోటి కనిపిస్తుంది.

అపుడు మార్కండేయునికి నారాయణుని గురించి సమస్తమూ అర్థమవుతుంది. బ్రహ్మాది దేవతలు, సూర్య చంద్రులు, ఈ సృష్టి సమస్తమూ శ్రీ మహావిష్ణువే అని అర్థమవుతుంది. ఆయనకు మాయ స్వరూపం బోధపడుతుంది.


అలా క్షణకాలం మాయలో పడిన సిద్ధాంతిగారు ఆ అద్భుత కళాస్వరూపంలో  పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి బదులు ఆ చిత్రాన్నే కోరుకున్నారు. 


ఇక నిధనం అంటే మరణం. అందుకే నైధనతార ఉన్నప్పుడు ఏ ముహూర్తమూ పెట్టరు. ఈ కథలో నైధనతారలో నారాయణసిద్ధాంతి గారు శారదాంబ ఇంటికి వెళ్ళేరు.

అక్కడ ఆయనకు ఒక చిత్రం పట్ల కమ్మిన మోహమనే మాయ నిధనమైంది. అందుకే రచయిత  *నైధనతార* అని కథకి పేరు పెట్టారు. 


ఈ లోకంలో శారదాంబగారి లాంటి వాళ్ళను చాలామందిని చూస్తాము. కష్టాలలో ఉన్నప్పుడు ప్రాధేయపూర్వకంగా మాట్లాడతారు. అవి గట్టెక్కి ఒడ్డునపడ్డాకా గతం మరచిపోయి, అహంకారం నెత్తికెక్కించుకుంటారు. 

రేవు దాటించే దాకా ఓడ మల్లన్న, రేవు దాటేకా బోడి మల్లన్న అనేవాళ్లంటే వీళ్ళే! 

'తాంబూలం ఇస్తాను' అని కబురంపిన ఆమె తనకు తోచింది ఇచ్చి పంపించాలి కానీ, "ఏం కావాలో అడగండి ఇస్తాను" అనడమేమిటి? అదే అహంకారం అంటే!


సోమిదేవమ్మ మహా దొడ్డ ఇల్లాలు. తన భర్త పట్ల శారదాంబ అలా ప్రవర్తించినా, ఆయనలో జ్ఞానజ్యోతిని వెలిగించిన పార్వతీదేవి గానే భావించింది. అంతకు మించిన సంభావన ఏదీ లేదని ఆనందపడింది.


ఈ కథ చదివాకా ఒక గొప్ప కథ చదివిన భావన కలిగింది.


           *--------- సి.యస్, కాకినాడ*

కామెంట్‌లు లేవు: