30, ఏప్రిల్ 2023, ఆదివారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర

 🙏 


*గ్రంథం*: శ్రీ అవధూత బోధామృతం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 

*రచన* : శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*కార్యదీక్ష*


కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో ఆచరించి చూపారు శ్రీ స్వామివారు. "వర్షాలు లేక గొడ్డు పిల్లా చచ్చేట్టున్నారు" స్వామీ అని మొరపెట్టుకున్న భక్తులతో అట్లా అయితే *మనమన్నా కష్టపడి వర్షం కురిపించు కోవాలయ్యా!* అన్నారు. ఒక అరగంట తర్వాత గంజి తాగండి స్వామి అంటే *అనుకున్న పని అయితే గదయ్యా అన్నం తినాల్సింది* అని సెలవిచ్చారు. వర్షం కురిసే అంతవరకు మూడు రాత్రులూ, మూడు పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆసనమైన మార్చకుండా కూర్చుండిపోయారు. కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారిని చూసి నేర్చుకోవాలి.


 కానీ శ్రీ స్వామివారు సంకల్ప మాత్రం చేత వర్షాలు కురిపించిగలిగి ఉండి కూడా అలా చేయడం లేదు ఎందుకు? ప్రజల సామూహిక పాపకర్మల ఫలితమే అనావృష్టి రూపంలో అనుభవమవుతుంది. అట్టి పాప కర్మలను రెండు మూడు రోజులపాటు రేయింబవళ్ళు చేసిన తపోశక్తితో భస్మం చేశాకనే వర్షం కురిపిస్తున్నారు. కనుక మన సమస్యలు తీరాలంటే ఎంత పట్టుదలగా సాధన చేయాలో ఆలోచించండి. 


కొద్దిపాటి శ్రద్ధ పట్టుదల లేకుండా శ్రీ స్వామివారికి విన్నవించినంతమాత్రాన మన చెడు కర్మలను శ్రీ స్వామివారు తీసేయాలి అనుకోవడం ఎంత అధర్మమో ఆలోచించండి. మన బాధలు తీరేందుకు సాధన చేసే శక్తి, పట్టుదల, శ్రద్ధ ప్రసాదించమని శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. గొప్ప కార్యదీక్ష పట్టుదల లేకుంటే మానవుడు ఏమీ సాధించలేడని శ్రీ స్వామివారు ఆచరణపూర్వకంగా బోధించారు. ఈ విషయాన్నే శిరిడి సాయినాధుడు *శక్తినంతా వినియోగించి కృషి చేస్తేగాని ఆధ్యాత్మిక పథంలో ఫలితం ఉండదు* అని సెలవిచ్చారు.


🙏 *ఓం నారాయణ -  ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   ఆయన తమ శిష్యుని చేత మూడు పుస్తకాలు తెప్పించి వాటిపై ఒక పువ్వు, కొద్ది కలకండ పెట్టి నాకిస్తూ, "ఇది మా గురు మహారాజ్ శ్రీ టెంబైస్వామి సంస్కృతంలో వ్రాసిన గురుచరిత్ర, స్తోత్రాలు. మావద్ద ఈ గ్రంథాలన్నీ అయిపోయాయి. నీకోసమేనన్నట్లు ఇలా ఒక్క ప్రతి మిగిలింది, ఇవి చదువుకో" అన్నారు. వాటిలో ఒక గ్రంథం " 'శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి", రెండవది "శ్రీ గురుచరిత్ర (సమశ్లోకి)", మూడవది "స్తోత్రావళి". నేను వారి భావం గుర్తించలేక వాటి వెల చెల్లించడానికి పైకం తీసేసరికి ఆయన నవ్వుతూ వారించి, "ఇవి మా గురు మహారాజ్ ప్రసాదం. ఇవి కోటి రూ||లు ఇచ్చినా లభించవు. వీటి వెల నీవేమి చెల్లిస్తావు? నీవివి చదువుకొని తరించడమే వీటి వెల" అన్నారు. నేను వారికి నమస్కరించుకొని సెలవు తీసుకొని శిరిడీ చేరి నా కార్యక్రమం నెరవేర్చుకున్నాను. ఇద్దరు- మహాత్ముల దర్శనము, వారి ప్రసాదము సాయి నాకు ప్రసాదించారు.


*******************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


మాస్టారుగారు గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా చాలా చక్కగా పాటించేవారు. ఇంటి విషయాలలో అమ్మగారి సలహాలు తీసుకునేవారు. ఒకసారి బనియన్లు అమ్మగారికి చూపిస్తూ "ఇవి బాగున్నాయా?" అని అమ్మగారిని అడిగే సమయానికి నేను మాస్టారుగారి దగ్గరకు పోవటము, ఆ సన్నివేశము చూసి "ఈయన ప్రతి చిన్న విషయాన్ని భార్యను అడిగేటట్లుంది అని నేను మనస్సులో అనుకోగానే నా వైపు చూచి "ఏంటిరా ” అని నవ్వారు. ఆయనకు మన మనసులోని విషయాలు వెంటనే తెలిసిపోయేవి. అలాగే పిల్లల విషయంలో వాళ్ళకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళకు మందులు వాడేటప్పుడు గాని, వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకునేటప్పుడు గాని ఒక ఆదర్శ గృహస్థుగా కన్పించేవారు.


                         🙏జై సాయిమాస్టర్🙏

కామెంట్‌లు లేవు: