30, ఏప్రిల్ 2023, ఆదివారం

దేవ్యుపాసనాఫలము

 దేవ్యుపాసనాఫలము


సౌందర్యలహరిలో చిట్టచివరిశ్లోకానికిముందటిశ్లోకంలో శాక్తోపాసకులు ఉపాసనా ఫలితముగా ఏయే ప్రయోజనాలు పొందుతారో ఆయాప్రయోజనాలను శ్రీమత్ శంకర భగవత్పాదులు విశదీకరించారు. 


శైశవంలో ఆకలివేసినప్పడూ దడపుట్టినప్పుడూ మనం మన శరీర ధారణకు కారణమైన కన్నతల్లి ఒడిలో చేరి ఆక్రందనం చేసి పాలు క్రోలి పెరిగి పెద్దలమైనాము. బిడ్డ కొంచెం ఏడిస్తే చాలు. తల్లితన పనులన్నీ ఒకవంకకునెట్టి తన శిశువును గమనిస్తుంది. శిశువులు తల్లిని నోరార 'అమ్మా' అని పిలిచేటట్లు లేగదూడలుకూడా తమ తల్లులను అంబా అని సంబోధిస్తవి. 'మేస్తూవున్న గడ్డి వదిలిపెట్టి దూడదగ్గరకు వేగముతో పరిగెత్తే గోమాత హృదయానికే ఆయేడ్పులోని కలత తెలుసు.' అంబా రవము నుండియే అమ్మ అనే మాట పుట్టివుండాలి. అంబాఅని ఆక్రందించే లేగదూడలవలె మనంకూడా ఆబ్రహ్మ కీటజననియైన అంబిక మ్రోల మొరపెట్టుకుంటే ఆలోకమాత అనుగ్రహానికి పాత్రులము కాగలమని గ్రంథాంతంలో ఆచార్యులవారు గ్రంథ ఫలశ్రుతిగా కాక అంబికాచరణ దాన ఫల శ్రుతిగానే చెప్పారు. 


సరస్వత్యా లక్ష్యా విధి హరి సవత్నో విహరతే 

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేతి వపుషా, 

చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః 

పరానందాభిఖ్యం రనయతి రనం త్వద్‌భజనవాన్. 


భక్తవత్సలవు నీవు. నీ భక్తులు నిన్ను ఏం కోరినా యిస్తావు. నీవో, లక్ష్మి ఒక చేత్తోనూ వాణి ఒక చేత్తోనూ వింజామరలు వీస్తుండగా కొలువుతీరుస్తావు. లక్ష్మీసరస్వతులు నీకు దాసికలై వింజామరలతో సేవ చేస్తుండగా నీ కతివత్సలుడైన నీభక్తునికి సైతం వారు సేవ చేయరా ఏమి? పరిపూర్ణతకు లక్ష్మీకటాక్షం తప్పనిసరి. ఆ లక్ష్మీ పురుషోత్తమునిధామం వైకుంఠం వదలి నీపాదాలముందే పడిగాపులు కాస్తూంది. అంతటితో ఆగక నీభక్తునికి సైతం పరిచర్యచేయడానికి సమకట్టుతూంది. అపుడు నీభక్తుణ్ణి చూస్తే పురుషోత్తమునికి అసూయ కలుగుతూంది. 


ఎవరైనాసరే లక్ష్మీకటాక్షాన్నే మొదట కోర్తారు. తన బిడ్డ తెలివితక్కువతనం తల్లికి తెలుసుగనుక లక్ష్మీకటాక్షాన్నే మొట్ట మొదట అనుగ్రహిస్తే అజ్ఞానవశాన ధనం దుర్వ్యయం చేసేసి పాపాలు మూటకట్టకుంటాడని అతనికి మొదట సరస్వతీ ప్రసన్నత అనుగ్రహించి, తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించే వివేకం ఇస్తుంది శ్రీమాత. 


'స మేంద్రో మేథయా స్పృణోతు తతో మేశ్రియ మావహ' అని తైత్తిరీయం మొదట మేధ తరువాత శ్రీ ప్రసాదం. దీనికి ఆచార్యులవారు భాష్యం వ్రాస్తూ 'ఏవమాదీని కుర్వాణా శ్రీర్యా తాం తతో మేధా సాహిశ్రీ రనర్థాయేవేతి' మేధలేని వానికి డబ్బిస్తే అనర్థమే కలుగుతుందట. డబ్బెందుకు? పుణ్యము సంపాదించటానికి బుద్ధి లేని వానికి డబ్బిస్తే వాడు పాపాలభైరవు డవుతాడు. అట్టిచోట అర్థానికి అర్థం అనర్థమే- ''అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ స్సత్యమ్'' అని భజగోవిందంలో భగవత్పాదులే బోధించారు. 


సర్వోత్పాదకశక్తి పరాశక్తి. ఆమె కటాక్షమాత్రం చేత భక్తునికి ఎక్కడలేని తెలివీ పుట్టుకొని వస్తుంది. అతని మనస్సనే ఆకాశంలో మెరుపుతీగవలె అపూర్వములైన సత్యాలు హఠాత్తుగా మెరుస్తాయి. మంచిపనులు చేయడం అతనికి అలవాటవుతుంది. అతడెప్పుడూ ఇహానికీ, పరానికీ ఉపయోగించే కార్యాలనే ఎల్లప్పుడూ చేస్తుంటాడు. జగన్మాత యెడల ఏకాంతభక్తి నెరపినవానినాలుకమీద పలుకుల వెలది కాలి గజ్జలమోతలు వినిపిస్తయ్. అట్టి భక్తునియెడల సరస్వతికి గల మక్కువను చూచి బ్రహ్మగారికే కలవరం పుడుతుందిట. 


ఐశ్వర్యానికి ఏమిటి ప్రయోజనం? అది మొదట తన అనుభవానికి రావాలి. పరహితకోసం చేసే దానధర్మాలకు కూడిరావాలి. పాపికి ఐశ్వర్యంపడితే అది అతనికి కోపమోహ కారణమవడమేకాక లోకానికి కష్టకారణంకూడా అవుతుంది. 


డబ్బుమాట యెత్తితే అందరికీ కొరతే. అందరికీ ధనవాంఛే. ఒకనికెంతధనమున్నా బ్యాంకిలో ఎంత నిలువచేసినా అతన్ని అడిగిచూడండి. మీరేమిటో అనుకుంటున్నారు! నాదంతా పైవేషమే. నాచేతిలో నయాపైసా లేదు అని చెపుతాడు. 'ఫలానా ఆయన డబ్బుకలవాడు' అని ఎవరైనా చెపితే ఆ ఆసామికి ఆ చెప్పినవాడిమీద ఎక్కడలేని కోపం వస్తుంది. తమకు ఎంతధనమున్నా అదిఅల్పమనే అందరీభావన. మరింత సిరిపట్టకూడదా అని ఆగర్భ శ్రీమంతులుకూడా ఎదురుచూస్తుంటారు. ఇదిలోకంతీరు. అందుచేతనే భక్తుని చూచి 'నీకు డబ్బుకావాలా నాయనా? కావలిస్తే మొదట మేథావంతుడవు, వివేకివి కా. అప్పుడుకాని నీకిచ్చే అర్థం సార్థకం' అని అమ్మ బుద్ధి చెప్పుతుంది. 


నిజానికి దారిద్ర్యం అంటే ఏమి? నేను దరిద్రుడను అని చెప్పుకోడమే తృప్తికలవాడు నిత్యసంతోషి. 'నేనుదరిద్రుణ్ణి' 'నేనుదరిద్రుణ్ణి' అని సొద వెళ్ళబోసుకుంటే ఒక్కనయాసైసా యిచ్చే పుణ్యాత్ముణ్ణి చూపండి. 'అంతో ఇంతో దేవుడిచ్చాడు' అని తలపోస్తే సంతోషంగానైనా బ్రతకవచ్చు. 

సరి, వేదశాస్త్ర పరిజ్ఞానం, వివిధ భాషా కోవిదత్వం ఐశ్వర్యం వివేకం అన్నీ ఉన్నవి. అయినా ఏదోకొరత వున్నది. అదేమి? 


విద్యాధనాలుంటే చాలదు. అందచందాలు మీద ఇచ్ఛ పరుగులెత్తుతుంది. చూచేవాళ్ళకు కొట్టవచ్చినట్లుండే తేజస్సు కావాలని కోరిక వూరుతుంది. అంబికానుగ్రహంవున్న ఉపాసకునకు అదిన్నీ చేకూరుతుంది. అందంలో వధిపొందిన వాడు అంగలేనివాడు. 'కోటిమన్మథ విగ్రహమ్' అని ఈశ్వరాదుల వర్ణనం అనంగుని మించిన అందగాడు మరొకడులేడు. అతని శ్రీమతి రతి మహాసౌందర్యవతి. మగనికి తగిన మగువ. ఓ అమ్మా! నిన్ను థ్యానించేవాడు రతీదేవి పాతివ్రత్యానికి శైథిల్యం కలుగజేసి అందచందాలతో అలరారుతాడట. 


చదువూ డబ్బూ అందమూ ఇవి అన్నీవున్నా ఆయుర్దాయం లేకపోతే నిష్ప్రయోజనం. అంబికా కటాక్ష మున్న సాధకుడు దీర్ఘాయుష్మంతుడౌతాట్ట. 


మంచిది. అన్నీ అమరినవి. తతః కిమ్ - తరువాత? ఈ అనుభవానికి పిదప ఈప్రశ్న వైరాగ్యానికి బీజం. మనకు వైరాగ్యం గనుక సొంతంగానే కలిగితే అది క్షణకాలం ఉంటుందో. ఉండదో, అమ్మ దయచే కలిగితే ఆ వైరాగ్యం మేకు పాతినట్లే. 


అక్కరలేని విషయాలమీద ప్రేమ మనలను బాధిస్తూంది. బంధిస్తూంది. ఈ పాశాలు వున్నంతవరకూ మనం పశువులం. భగవానుడు పశుపతి. డబ్బు, మనస్సు, అందము, ఆయుస్సు అనే పాశాలతో ఆయన మనలను బంధించివున్నాడు. ఎన్నడు నిర్వేదపూర్వకమైన వైరాగ్యం కలుగుతుందో ఆనాడు మన పాశాలు జారి పశుత్వంపోయి పరబ్రహ్మలమై కూర్చుంటాము. శుద్ధప్రకాశచేతనవస్తువే ఆత్మ. మనము పాశవిముక్తులమైతే పరమానందం మన సొమ్ము. అంబిక మనకిచ్చే అంతిమ ఫలం అదే. 


పురుషార్థాలను ప్రసాదించేది పరమేశ్వరి. గోమాత కడకు వెళ్ళే లేగలవలె శ్రీమాత చరణారవిందములను చేరితే గాని ఐహికవిషయానుభవము పిదప మనకు ఆముష్మికమగు కైవల్యానందం దొరకదు.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: