అర్చకుని ఓ చిన్న కోరిక
నమస్కారం. నా పేరు వారణాసి మహదేవ శాస్త్రి. శివార్చకులం. వంశ పారంపర్యంగా ఇదే మావృత్తి. నా చిన్నప్పుడే నాన్న నన్ను యింగ్లీష్ చదువు మానిపించి, ఆగమ పాఠశాల లో జేర్పించారు. అర్చక వృత్తికి కావలసిన అన్ని విద్యలు ఓ అయిదేళ్ళ పాటు క్షుణ్ణంగా నేర్చుకొని, యీ వృత్తిలో ఓ నలభై యేళ్ళుగా కాలం గడుపుతున్నాను. లక్షలు, కోట్లు సంపాదించకపోయినా.. నమ్ముకున్న ఆ పరమేశ్వరుని కృపతో కుటుంబం సజావుగానే సాగిపోతుంది. నా గురించిన పరిచయం యిక్కడతో ఆపి అసలు విషయానికి వస్తాను.
చాలా మంది భక్తులు దేవుడి దగ్గరకి వచ్చేటప్పుడు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమల ప్యాకెట్లు, నాలుగయిదు అగరు బత్తీలు, కొంత మందయితే ఓ గిన్నెలోనో, ఓ ప్లాస్టిక్ సీసాలోనో దీపారాధన నిమిత్తం నూనె లాంటిది తీసుకుని వస్తారు.
అయ్యాలారా ! అమ్మలారా !! ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుడి కోసం మీరు తెచ్చే ఆ పూజా ద్రవ్యాలన్నీ డబ్బు కక్కుర్తి తో అతి దారుణంగా కల్తీ చేయబడ్డవే. దేవుడికి సమర్పించే ఆ పూజా ద్రవ్యాలు యెంత హేయంగా, నికృష్టంగా తయారు చేస్తారో చెప్ప దలుచుకోలేదు. మీరు తట్టుకోలేరు.
చివరికి, మా అర్చకులు రోజూ వంటికి పూసుకొనే విభూది కూడా కల్తిదే. నిజానికి అది విభూదిగాదు. సున్నపు ముద్ద. కొన్ని యేళ్ళుగా ప్రతి రోజు ఆ విభూతి రాసుకొని.. రాసుకొని.. చర్మ వ్యాధులతో బాధ పడే అర్చకులు మాలో చాలమంది వున్నారు. ఆ హారతి కర్పూరం, ఆ అగరు బత్తీలు వెలిగించి.. వాటి వాసనలని కొన్ని గంటల పాటు ప్రతి రోజూ పీల్చి.. పీల్చి.. ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రాణాల మీదకి తెచ్చుకొన్న వాళ్ళూ, ప్రాణాలు పోగుట్టుకున్నవారు వున్నారంటే మీరు నమ్ముతారా? చచ్చిపోయిన పశువుల కొవ్వుతో తయారు చేయబడ్డ ఆ నూనెల దీపారాధనల వాసనలకి వైద్యులకంతుపట్టని రోగాలతో బతుకు గడుపుతున్న అర్చకులు.. యెంతో మంది. ఒక్క సారి ఆలోచించండి. ఆరోగ్యానికి ప్రమాదకరమైన రసాయనిక పదార్ధాలతో తయారు చేయబడ్డ ఆ నకిలీ పూజా ద్రవ్యాలతోనా మనం నమ్ముకున్న మన దేవుణ్ణి పూజించేది? ఆయన ప్రసన్నుడౌతాడా ? మనకు ముక్తి ప్రసాదిస్తాడా ? మనం పుణ్యం మూట కట్టుకుంటామా? అసలు ఆయన అడిగాడా? సృష్టి అంతా ఆయనదే అయితే ఆయనకి మనం యిచ్చేదేంటి ? మనం యెంత? మనకున్నది యెంత? కొద్దిగా ఆలోచించండి. నిష్కల్మషం, నిష్కామం, నిస్స్వార్ధం తో కూడుకున్న ధ్యానంలో ఓ నమస్కారం చాలదా ఆయన దీవెనలు అందుకోవటానికి?
గాలి కూడా దూరని గర్భగుళ్ళో గంటల తరబడి తమ విధులు నిర్వహించే అర్చకుల ఆరోగ్యంతో పాటు.. మీఆరోగ్యం కూడా దృష్టిలో వుంచుకొండి. ఇకనుంచైనా ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలతో.. విషపూరిత పదార్థాలతో ఆ పరమేశ్వరుని పూజించకండి. నా యీ మాటల్లోని వాస్తవికతను గుర్తించండి.
హర హర మహాదేవ !!
జై శ్రీరాం !!
భవదీయుడు
వారణాసి మహాదేవ శాస్త్రి
శోభకృత్ బహుళ చవితి
(10 ఏప్రిల్ 2023).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి