🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 78*
ఆనాటి వేకువఝామునే నందులు ఆశ్రమానికి వెళ్లి జీవసిద్ధిని కలుసుకున్నారు. అప్పటికే గతరెండు రోజులనుంచీ జీవసిద్ధి శత్రుంజయ హోమాన్ని చేస్తున్నాడు.
"తానొక హోమం చెయ్యబోతున్నానీ, దాని ఫలితం చేత కోటదాకా వచ్చిన శత్రువులు కోట బయటే ఆగిపోతారని" యాగ ప్రారంభానికి ముందు మూడు రోజుల క్రితమే నందులకు చెప్పివున్నాడు జీవసిద్ధి. అతని మాట నిజమైనందుకు, అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు నందులు.
"ఈ రోజు శుభదినం... ఈ ఒక్కరోజు శత్రువుల మీద దాడిచేసి వీలైనంత విజయాన్ని సాధించండి. అలాగే ఈ ఒక్కరోజే మీకు అశుభదినం. ఈరోజు గట్టెక్కితే మీకన్నీ విజయాలే... కోటకి నాలుగు దిక్కులా ఉన్న అరవైనాలుగు ద్వారాలూ ఒక్కసారిగా... హఠాత్తుగా తెరిచి శత్రువుల మీద దాడి చెయ్యండి" అని చెప్పాడు యాగసిద్ధిలో వున్న జీవసిద్ధి మహోగ్రస్వరంతో.
నందులు తక్షణం రాజభవనానికి వచ్చి మంత్రి, సేనానులను సమావేశపరిచి తన వ్యూహాన్ని తెలిపారు. కోట బయట శత్రుసేనలు లోపలికి ప్రవేశించే మార్గాలు కానక దిక్కుతోచని స్థితిలో ఉంటే, ఇలా అన్ని ద్వారాలు తెరిచి వాళ్లపై దాడికి దిగడం ఎందుకో రాక్షసామాత్యునికి అర్థం కాలేదు. అతడి తన అభ్యంతరాన్ని బయటపెట్టబోయాడు.
కానీ ప్రధాన సేనాని భద్రభటుడు అతనిని వారించి "మనం చెప్పినా నందులు వినిపించుకోరు. ఎందుకొచ్చిన కంఠశోష ? మనమూ తగు జాగ్రత్తలోనే ఉన్నాం కదా... ఏం జరుగుతుందో చూద్దాం" అని చెప్పాడు. ఆ మాటతో రాక్షసామాత్యుడు మౌనం వహించాడు.
ఆనాటి సూర్యోదయంతో పాటే కోటకి నలవైపులా ఉన్న ఆరవైనాలుగు ద్వారాలూ ఒక్కసారిగా తెరవబడ్డాయి. నలువైపులా కందకాల మీద బల్లకట్టులు దించబడ్డాయి. మగధసైనికులు సింహనాదాలు చేస్తూ ఒక్క పెట్టున శత్రుసైనికుల మీదికి విరుచుకుపడ్డారు. ఆ ఆకస్మాత్తు దాడిని నలువైపులా ముందు వరసలో వున్న సైనిక దళాలు సర్వనాశనమైపోయాయి. ఉత్తర దిక్కున ముందు వరసలో నిలిపి ఉంచిన పారశీక దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా రెండు ఘడియల కాలం పోరుసలిపి పర్వతకుని బలగాలలో సగానికి పైగా నాశనమయ్యాయి.
అప్పటికి ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న పర్వతక, వైరోచన, మలయకేతులు మగధసైనికుల మీదికి విరుచుకుపడి ఎదురుదాడి ప్రారంభించారు. ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రమైంది.
శోత్రీయ బ్రాహ్మణుడైన చాణక్యుడు తలపైని శిరస్త్రాణము, వక్షస్థలమునకు కవచం ధరించి అశ్వారూడుడై ఖడ్గచాలనం చేస్తూ అద్భుతమైన పోరాటపటిమను కనపరచడం ఇక్కడ విశేషం.
పాంచాలా కిరాతకాదులు పడమటి దిక్కున అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తూ మాగధ సైనికులను సంహరించసాగారు. తూర్పున ముందు వరుసలోనున్న కామరూప సైన్యము తొలుత మాగధుల దాడిలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా ఆ తదనంతరం సింహపురి వీరులు ఎదురుదాటికి దిగి మగధసైన్యాన్ని వూచకోత కొయ్యసాగారు.
ఇక దక్షిణ దిశ నుండి ఆంధ్ర, కళింగ, పిప్పల వనసేనావాహినితో చంద్రగుప్తుడు మాగధులపై ఆది నుంచీ ఎదురుదాడి ప్రారంభించాడు.
దక్షిణ దిక్కున మగధసైన్యానికి రాక్షసామాత్యుడు నాయకత్వాన్ని వహిస్తున్నాడు, తొలి రెండు ఘడియల కాలంలో అసలైన పోరు ఇక్కడే జరిగింది.
రాక్షసుడు అరవీర భయంకరుడై విజృంభించి పోరాడుతూ, మహోగ్రస్వరంతో రంకెలు వేస్తూ మగధ సైనికులకు ఉత్సాహపరచసాగాడు. ఒకానొక దశలో భారత యుద్ధములోని భీష్మ పితామహుని జ్ఞప్తికి తెచ్చాడు. అతడిని నిలువరించడం చంద్రగుప్తునికి చాలా కష్టతరమైంది. ఇక తానే స్వయంగా రాక్షసామాత్యుని ఎదుర్కొన్నాడు చంద్రగుప్తుడు.
ఇద్దరి మధ్యా మహోధృతంగా పోరు జరిగింది. తుదకు రాక్షసమాత్యుని చేతనున్న కరవాలాన్ని ఎగరగొట్టి, నిస్సహాయుడై, నిరాయుదుడై క్రిందపడిన రాక్షసుని శిరస్సు ఖండించబోయాడు చంద్రగుప్తుడు. సరిగ్గా ఆ క్షణంలో అతనికి చాణక్యుని ఆదేశం గుర్తుకు వచ్చింది.
"ఎట్టి పరిస్థితులలోనూ రాక్షసామాత్యునికి మాత్రం ఏ హాని కలిగించరాదు" అన్న చాణక్యుని ఆజ్ఞని జ్ఞప్తికి తెచ్చుకొని "ఆర్య చాణక్యుల వారి ఆదేశమే నీకు ప్రాణభిక్ష పెట్టింది... పో... ప్రాణాలతో బ్రతికిపో..." అన్నాడు చంద్రుడు. ఆ మాటలు వింటూ నిశ్చేష్టుడయ్యాడు రాక్షసామాత్యుడు.
సరిగ్గా ఆ సమయంలోనే యుద్ధరంగంలో ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి