శు భో ద యం🙏
శు భో ద యం🙏
*సూర్యాస్త మయం-
శ్రీనాధమహాకవి వర్ణనము*
శా: " వ్రాలెం బశ్చమ శైలశృంగము పయిం బ్రత్యగ్ర మధ్వాగమో
న్మీలత్కింశుక కోరకస్తబక కాంతిన్ భానుమన్మండలం ,
బాలంబించె ,మరుండు హస్తమున దక్షారామ లీలావతీ
భ్రూలేఖానిభ విభ్రమాభ్యుదయమున్ బుండ్రేక్షు కోదండమున్;
శివరాత్రి మాహాత్మ్యము- శ్రీ నాధుఁడు;
ఆగామి ప్రబంధ యుగ కవులకు ప్రేరణ నిచ్చిన వాడు శ్రీనాధమహాకవి. అతని వర్ణనలు అపూర్వ భావ సంభరితములై ఆంద్రసరస్వతికి అనుపమానమైన యాభరణము లైనవి. ఇది సూర్యాస్తమయ వర్ణనం.ముందుగా కఠిన పదాలకు
అర్ధం తెలియ జేస్తాను.
అర్ధములు; ప్రత్యగ్రము- ఎదురేగుట; అధ్వాగమము:బాటసారులరాక; ఉన్మీలనము- పెరకివేయుట; కింశుకము-మోదుగ-కోరకస్తబకము-మొగ్గల గుత్తి ; భానుమన్మండలము- సూర్యమండలము ; ఆలంబించెన్- అలముకొనెను; మరుండు- మన్మధుడు;
లీలావతీ- అందగత్తె ; భ్రూలేఖానిభ- కనుబొమవలె వంపుతిరిగిన; విభ్రమాభ్యుదయము- ఆకర్షణ శోభ ; పుండ్రేక్షు కోదండము- చెరకు
విల్లు;
భావము: పడమరకు సూర్యకిరణాలు వ్యాపిస్తునాయట. (సూర్యుడస్తమించేది పడమరనేగదా!) ఎర్రని యాకాంతులు బాట
సారుల గుండెలను పిండే మోదుగ మొగ్గల కాంతి నుప మిస్తున్నాయట! ఇక పొద్దుగూకుతోంది మనకు అడ్డులేదని మన్మధుడుఅనుకునేలా దక్షారామవిలాసినీ జనులు తమ కన్నుల సొబగుతో విటుల నాకర్షించుచున్నారట. వంపులు దిరిగిన వారి
కనుబొమలు మన్మధుడెత్తిన చెరకు విల్లులా ఉన్నవట!
సూర్యస్త మయంలో కిరణాలు యెర్రగానే ఉంటాయి. వాటిని మోదుగ మొగ్గలతో పోల్చి భార్యలకు దూరంగా ఉన్న బాటసారులను అవి వేదన కల్పిచేలా ఉన్నాయని చెప్పటం. ఆవెంటనే దక్షారామ విలాసినీ జనాల కనుబొమలు మన్మధుని చెరకు
విల్లువలె ఉన్నాయనటం; శ్రీనాధుని ప్రత్యేకత!
సూర్యాస్త మయంతో విరహులైన పాంధులకు సేదతీరిచే సాధనాలుగా దక్షారామ విలాసినీ
జనం సంసిధ్ధులై యుండటం శ్రీనాధుని రసికతకు నిదర్శనం!
స్వస్తి !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి