శు భో ద యం 🙏
పెద్దల పరిహాసాలు
మన యిళ్ళలో పెళ్ళిళ్ళు జరిగినపుడు పెళ్ళికి వచ్చినవారు ఒకరితో నొకరు యెన్నిపరిహాసాలో! యెన్నెన్ని
వినోదాలో! చెప్పటానికి వీలా? అలాటి సందర్భంలో ఒకవేళ జగత్పాలకులైన త్రిమూర్తులే అలాంటి వ్యవహారం నడిపితే యెలాఉంటుంది? దానిని ఊహించే శ్రీమతి గంటికృష్ణవేణమ్మగారు తాము విరచించిన "గిరిజా కళ్యాణము"- అనేకావ్యలో ఒక
చక్కని ఘట్టం చిత్రించారు. గిరిజా కళ్యాణానికి విష్ణుమూర్తి సకుటుంబంగా విచ్చేశాడు. వివాహం జరిగాక భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్నపదార్ధాలను అటునిటు కదుపుతున్నాడట!
అప్పుడు విష్ణువు శివుడు ఒకరినొకరు వేళాకోలా లాడుకొన్నారట! ఎలా? ఇదిగో ఇలా---
విష్ణువు శివునితో-- " విసము తిన్న నోట కసవయ్యెఁగాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారములు లే
వటంచు పల్కె విష్ణుఁ డభవు తోడ ..
విష్ణువు శివునితో యిలా అంటున్నాడు. " ఏమయ్యా! ఈబూరెలూ ,గారెలూ, అవీ నీకు నచ్చినట్లు లేదే?
కాలకూటం తిన్న నోటికి యీభక్ష్యాలన్నీ గడ్డిలాగ రుచిలేనివై కనబడుచున్నవేమో? ఏంచేస్తాం? అన్నాడు.
దానికి సమాధానంగా శివుడు ఇలా అంటున్నాడు.
" నిక్కము నీవుపల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న ! తెత్తు మన చిక్కవు యెంగిలి కాయలెందు, నీ
కెక్కడ దెత్తుమయ్య? అవి ; ఇప్పు డటంచు శివుండు నవ్వగా
నక్కడ పంక్తి భోజనము నందు ఫకాలున నవ్విరందరున్ "!
నిజమేనయ్యా విష్ణూ! నువ్వుచెప్పింది. ఇక్కడెక్కడా దొంగతనంచేద్దామన్నా వెన్న దొరకదు. తెద్దామన్నా యెంగిలి కాయలుదొరకనే దొరకవు. ఎక్కడనుండి తేగలం మరి ! అని శివు డనగానే బ్రహ్మ, ఇంద్రాది దేవతలు ఫకాలున నవ్వారట !
మనదృష్టిలో యిది పరిహాసమేయైనా కవిదృష్ట్యా ఇది నిందాస్తుతి!
దీని అంతరార్ధం యేమిటంటే- లోకాలను నాశనంచేసే కాలకూట విషాన్ని కంఠాన ధరించి, అందరినీ కాపాడిన వాడు శివుడని విష్ణువు ప్రస్తుతించితే ,వెన్నదొంగిలి నెపంతో గోపికలనుధ్ధరించినవాడనీ,, శబరి యెంగిలిపండ్లను తిని భక్తపరాధీనుడైన వాడు విష్ణు వనీ శివుడు విష్ణువును ప్రశంసించాడు..
బాగుంది కదూ?
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷💐💐🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి