27, డిసెంబర్ 2023, బుధవారం

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *118వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*కేతుగ్రహ చరిత్ర - 4*


తన ప్రయాణం ముగించిన కేతువు చంద్రుడికి సమీపంలో ఉన్న ఒక తెలిమబ్బు చాటుకు నక్కాడు. దొంగచాటుగా , చంద్రుణ్ణి గమనిస్తున్నాడు.


చంద్రుడు లోపల నుంచి ఉబికి వస్తున్న ఆందోళనను , త్రిమూర్తులు ఆదుకుంటారన్న ఆలోచనతో అణగద్రొక్కుతూ , గగనయానం సాగిస్తున్నాడు. క్రిందటి రాత్రి చవిచూసిన బీభత్సానుభవం ఎంత మరిచిపోవాలనుకున్నా , ఆయనకు గుర్తు వస్తూనే ఉంది !


*"నిర్భయంగా నీ నిశావిహారాన్ని కొనసాగించు ! 'కేతువు నీ సమీపానికి రాకుండా త్రిమూర్తులు..."* చంద్రుడు చెవులలో ప్రతిధ్వనిస్తున్న నారదుడి ధైర్య వచనాలను మ్రింగివేస్తూ , కేతువు భీకరాట్టహాసం దిక్కుల్ని కుదిపివేస్తూ వినిపించింది.


చంద్రుడు భయం భయంగా చూశాడు. తెల్లటి మేఘం చాటు నుండి వికృతంగా కనిపిస్తోంది కేతువు ముఖం , నివురు చాటున నిప్పులా !


మబ్బుల చాటు నుండి వెలికి వచ్చి , చంద్రుడి వైపు దూసుకు వెళ్ళబోయిన కేతువు - తటాలున ఆగాడు. తన ఎదురుగా , ఉన్నతమైన , విశాలమైన , అలంఘ్యమైన గోడలా నిలుచున్నారు. త్రిమూర్తులు ! ముగ్గురి ముఖాల మీదా వెన్నెలను వెక్కిరిస్తున్న దివ్యమందహాసాలు !


*"కేతూ ! నీ జన్మ రహస్యం నీకు తెలీదు ! రాక్షసాంశతో , మృత్యుపుత్రుడిగా జన్మించిన దేవతామూర్తివి నీవు ! సూర్య చంద్రులతో , ఇతరులతో బాటు గ్రహదేవతగా వెలుగొందే వేలుపుగా నిన్ను అభిషేకిస్తాం !"* కేతువు ఆవిర్భావానికి కారకుడైన బ్రహ్మ ఉపోద్ఘాతంగా అన్నాడు.


*"మేఘహాసుడి ద్వారా నేను ప్రసాదించిన వరాలనూ , శక్తులనూ సూర్య చంద్రులను కబళించే అవాంఛనీయ చర్యతో వృధా చేయవద్దు , కేతూ !"* శివుడు మందలిస్తున్నట్టు అన్నాడు.


*“నా సుదర్శన చక్రధారతో నీకు శిరచ్ఛేదం కావడం యాదృచ్ఛికం ! పరమేశ్వరుల వరం ఆ నష్టాన్ని రూపు మాపి , నీకు రూపాన్ని ప్రసాదించింది ! పగతో , ప్రతీకార జ్వాలతో రగిలిపోవడం నీ భవిష్య పదవికి తగదు ! నిరంతరాయంగా సూర్యచంద్రులను కబళించే ఆలోచనను విరమించు..."*


*“మాట మాటకు అడ్డు వస్తున్నందుకు మన్నించండి !"* కేతువు వినయంగా అన్నాడు. *“సూర్యచంద్రుల మీద ప్రతీకారం చేస్తూనే ఉండిపోతామంటూ చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి ? నా తల్లికీ ధర్మపత్నికి ఇచ్చిన మాట ఏం కావాలి ?"*


*"నీ ప్రతిన నెరవేరేలా , వెసులుబాటు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం ! నీ అన్న రాహువు అభ్యర్థించి , అనుమతి పొందిన ప్రకారం నిర్ణీత కాల వ్యవధితో , నియమిత సమయాలలో - లోకాలకు కీడు వాటిల్లని విధానంలో నువ్వు సూర్యచంద్రులను కబళిస్తూ తృప్తి చెందవచ్చు !"* శ్రీమహావిష్ణువు అన్నాడు.


*"సంధి పూర్వకమైన ఈ విధానం మా ముగ్గురికీ ఆమోదమే కేతూ !"* పరమేశ్వరుడు నవ్వుతూ అన్నాడు.


*“అంగీకరించు , ఆనందించు !"* బ్రహ్మ నచ్చచెప్తున్నట్టు అన్నాడు.


*"మీ ఆజ్ఞను శిరోధార్యంగా స్వీకరిస్తున్నాను. అమావాస్య దినాన సూర్యుడినీ , పౌర్ణమి రాత్రులలో చంద్రుడినీ - వంతుల ప్రకారం మేమిద్దరమూ గ్రహణం చేసే ప్రాతిపదికతో ముందుకు సాగుతాము !"* కేతువు వినయంగా అన్నాడు.


*“తథాస్తు !”* త్రిమూర్తులు ఏక కంఠంతో అన్నారు.


కేతువు ముగ్గురికీ భక్తితో ప్రణామాలు చేశాడు. చంద్రుడి వైపు ఒకసారి చిరునవ్వు నవ్వి , విజయ గర్వంతో వెనుదిరిగాడు. త్రిమూర్తులు అంతర్థానమయ్యారు. చంద్రుడు నూతనోత్సాహంతో వెన్నెల వెదజల్లసాగాడు.


**************************


ఆశ్రమం ముందు నిలుచున్న రాహువూ , మేఘహాసుడూ , సింహికా , దనూదేవీ , సింహిదేవీ , కేతువు పత్ని చిత్రలేఖా కేతువుకు ఆప్యాయంగా స్వాగతం చెప్పారు. చిరునవ్వులతో ,


దగ్గరగా వచ్చిన కేతువును ఆలింగనం చేసుకుంటూ బిగ్గరగా నవ్వసాగాడు రాహువు , కేతువు తన విజయ వికట - అట్టహాసంతో అతనితో శ్రుతి కలిపాడు ! ఇద్దరి నవ్వులూ జంట కారుమేఘాల రాపిడితో పుట్టిన భీకరమైన ఉరుముల ధ్వనుల్ని మరిపించాయి. కేతువు నవ్వులో అతని విజయగాథ ధ్వనిస్తోంది ! రాహువు స్వరంలో అభినందన ప్రతిధ్వనిస్తోంది !


రాహువు కేతువుల నవ్వులు అక్కడున్న వాళ్ళందరినీ అంటు వ్యాధిలా ఆవహించాయి. క్షణంలో కశ్యపాశ్రమ ప్రాంగణం ఆ ఏడుగురి నవ్వుల బృందగానంతో దద్దరిల్లిపోయింది !


కశ్యప ప్రజాపతీ , అదితీ , వినతా , కద్రువా , దితీ , ఇతర పత్నులూ లోగిలిలోకి పరుగు పరుగున వచ్చారు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా పగలబడి నవ్వుతున్న రాహువూ , కేతువూ , మేఘహాసుడూ , దనూదేవీ , సింహికా , రాహుపత్ని సింహిదేవీ , కేతుపత్ని చిత్రలేఖా వాళ్ళను గమనించే స్థితిలో లేరు !


*"దనూ...సింహికా !"* అదితి చెల్లెళ్ళను పిలిచింది.


దనూదేవీ , సింహికా నవ్వులు ఆపి , చూశారు. ఒకరి తరువాత ఒకరుగా - అందరూ నవ్వు ఆపేశారు. కశ్యపప్రజాపతికి అంతా అయోమయంగా ఉంది. చంద్రుడిని కబళించడానికి వెళ్ళిన కేతువు ఇక్కడే ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ! వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ?


*"పితామహా..."* మేఘహాసుడు వినయంగా అంటూ కశ్యప ప్రజాపతి సమీపానికి వచ్చాడు. నవ్వు తెప్పించిన కన్నీళ్ళతో అతడి చెంపలు మెరుస్తున్నాయి.


*"ఎందుకు నాయనా అలా నవ్వుతున్నారు ?"*


*“నా తండ్రి గారిలాగే , పినతండ్రిగారు , కూడా త్రిమూర్తుల నుండి వరాలు మూటగట్టుకుని వచ్చారు , పితామహా !”* మేఘహాసుడు చిరునవ్వుతో అన్నాడు.


*"నిజమా ! ఏయే వరాలు సొంతం చేసుకున్నావు , కేతూ ?”* కశ్యపుడు అడిగాడు. కేతువు తన విజయగర్వానికీ , ఆనందానికీ , వినయం జత చేస్తూ తనకూ త్రిమూర్తులకూ మధ్య జరిగిన ఒడంబడిక గురించి వివరించాడు.


*"అంటే , చాలా తక్కువ పర్యాయాలు , తక్కువ వ్యవధానం పాటు మీరిద్దరూ సూర్యచంద్రులను గ్రహణం చేస్తారన్నమాట !'* అదితి అంది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: