21, డిసెంబర్ 2023, గురువారం

కపాలమోక్షం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*కపాలమోక్షం..*


*(అరవై నాలుగవ రోజు).*


శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి  ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..


ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..


శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..


అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..


తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..


శ్రీ స్వామివారి ఆశ్రమం..దత్తక్షేత్రంగా రూపాంతరం చెందడం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: