21, డిసెంబర్ 2023, గురువారం

హార్ట్ ఫుల్ నెస్ కథ

 ✈️ హార్ట్ ఫుల్ నెస్  కథ 


భావం - నా చుట్టూ  ప్రేమతో నిండిన ప్రతీ సంబంధానికి నేను కృతజ్ఞతతో  ఉంటాను  


 గొర్రెల మంద 


ఒకసారి ఒక రాజు  తన మంత్రిని  “ మంత్రిగారు , కుక్కలు , గొర్రెల మధ్య గమనిస్తే, గొర్రెలకన్నా కుక్కలకి ఎక్కువ పిల్లలు పుట్టినప్పటికీ గొర్రెలు గుంపులు గుంపులుగా ప్రతిచోటా కనిపిస్తాయి. కానీ కుక్కలు మాత్రం దూరం దూరంగా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి, దీనికి కారణమేమిటి ?", అని అడిగాడు. 

దానికి మంత్రి, “మహారాజా, నాకు ఒక్క  రోజు సమయం ఇవ్వండి, రేపు ఉదయం మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను” అని అన్నాడు. 

ఆరోజు సాయంకాలం రాజుగారికి ఎదురుగా రెండు గదులను మంత్రి సిద్ధం చేయించాడు. ఒక గదిలో ఇరవై కుక్కలను వుంచి వాటి మధ్య ఒక బుట్టలో రొట్టెలు ఉంచాడు. రెండవ గదిలో  ఇరవై గొర్రెలను వుంచి వాటి మధ్య ఒక తొట్టెలో మేత ఉంచాడు. ఆ గదులను బయట నుండి తాళం వేసి వెళ్ళి పోయాడు. 


మరుసటి రోజు మంత్రి రాజుగారి తో కలిసి అక్కడికి వెళ్ళాడు. మొదటి గది  తాళం తెరిచాడు. అక్కడ కుక్కలన్నీ మరణించాయి, వాటి మధ్య రొట్టెలు అలాగే  వున్నాయి.  కుక్కలు ఒక్క చిన్న రొట్టె ముక్కను కూడా తినలేదు. 

ఆ తరువాత మంత్రి రెండో గదికి రాజుగారిని తీసుకొని వెళ్ళాడు. తాళం తీసి  గదిలోకి వెళ్లి చూడగా, అక్కడ ఒక గొర్రె మీద ఇంకొక గొర్రె తల పెట్టుకొని సుఖంగా నిద్రపోతూ కనిపించాయి. దాణా వుంచిన బుట్ట ఖాళీగా వుంది. 


గదులు రెండూ చూపించిన తర్వాత రాజుగారితో మంత్రి ఇలా అన్నాడు, “కుక్కలు ఒక్క రొట్టె ముక్క కూడా తినకుండా పరస్పరం  దెబ్బలాడుకుని మరణించాయి. అలా కాకుండా  గొర్రెలు వాటి మేతను ఒకదానితో మరొకటి పంచుకొని, సుఖంగా ఒకదాని మీద ఒకటి పడుకోగలిగాయి.  

ఈ కారణం వల్లనే గొర్రెలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ కుక్కలు వాటి ప్రక్కన ఇంకొక కుక్క ఉండటం సహించలేక దెబ్బలాడుకుంటూ ఉండటం వలన అవి ఎక్కువగా కనిపించవు.” 

 మంత్రి మాటలకు రాజు ఎంతో తృప్తిచెంది అతనికి ఎన్నో బహుమతులను, కానుకలను ఇచ్చారు. పరస్పర ప్రేమ, సోదరభావం కలిగి వుంటేనే వంశాభివృద్ది చెందుతుందని రాజుగారికి  నమ్మకము కలిగింది. 


ఈ సందర్భంలో మంత్రి రాజుకు ఒక కధను చెప్పాడు.

ఒకసారి దేవతలను, రాక్షసులను బ్రహ్మదేవుడు ఒక సమావేశానికి ఆహ్వానించాడు.  బ్రహ్మదేవుని కొలువుకు దేవతలు, రాక్షసులు అందరూ వచ్చారు. ఆ రెండు వర్గాలకు బ్రహ్మ దేవుడు మంచి ఆతిధ్యాన్ని అందించినా  ఆయనకు దేవతలంటే కొంచెం ఎక్కువ గౌరవం, భక్తిభావం వుంది. 

బ్రహ్మదేవునికి దేవతల మీద పక్షపాతం వుందని, బయటకు మాత్రం అందరినీ ఒకే విధంగా చూస్తున్నట్లు నటిస్తున్నాడని  రాక్షసులు గ్రహించారు. 

" బ్రహ్మదేవా! మీరు దేవతలకు ఎక్కువ ప్రాముఖ్యత  ఇస్తున్నారు, మీ హృదయంలో వాళ్లమీద ఎక్కువ గౌరవం వుంది అటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఇక్కడకు ఎందుకు  ఆహ్వానించారు?", అని రాక్షసులు బ్రహ్మని అడిగారు. 


బ్రహ్మ అది నిజం కాదని రాక్షసులను ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా వారి కోపాన్ని తగ్గించలేక పోయాడు. అందుకని దేవతలతో రాక్షసులు ఎట్టి పరిస్థితులలోనూ సమానం కాలేరని నిరూపించాలని బ్రహ్మ నిర్ధారించుకున్నాడు. 

అప్పుడు బ్రహ్మ దేవుడు  రాక్షసరాజుతో ," మీరు దేవతల కంటే వెనకపడిపోకుండా వాళ్ళతో సమానంగా ఉంటే, నాకు ఎంతో సంతోషం”, అని అన్నాడు. 

దానికి రాక్షస రాజు,“మేము ఇప్పటికే వాళ్ళ కన్నా ఎంతో  ముందు ఉన్నాం”, అని చాలా ధృడంగా చెప్పాడు. దానికి బ్రహ్మ,“మీకు అభ్యంతరం లేకపోతే నేను పరీక్షించవచ్చా?” అని అడిగాడు.

 “ ఓ !తప్పకుండా పరీక్షించండి”, అని రాక్షస రాజు అన్నాడు. 

బ్రహ్మదేవుడు రాత్రి భోజనసమయంలో దేవతలకు, రాక్షసులకు వాళ్ళ చేతివేళ్ళ వరకు కర్రలను బిగించాడు, దేనివలన ఎవ్వరూ కూడా వారి చేతులను వంచలేరు. బ్రహ్మ పెద్ద పళ్ళాలలో లడ్డూలను రాక్షసుల ముందు వుంచి, “ఎవరు ఎక్కువ లడ్డూలను తింటారో వాళ్ళే  ఉత్తములని నిరూపించుకుంటారు “,అని చెప్పాడు.  

చేతులకు కర్రలు ఉండటం వలన  రాక్షసులు లడ్డూలను చేతులోకి తీసుకోగలిగినా, నోటికి అందించలేకపోయారు. లడ్డూలను ఎగురవేసి నోటితో అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పెద్ద సమస్య గా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ రాక్షసుడు కూడా లడ్డూలు తినడంలో విజయం సాధించలేకపోయాడు. కాసేపటికి అందరూ ప్రయత్నంచేయడం కూడా మానేశారు . 


ఆ తర్వాత దేవతల వంతు వచ్చింది, వాళ్ళ చేతులకు కూడా అదే విధంగా కర్రలు  బిగించారు. వరసగా కూర్చున్న దేవతల ముందు కూడా లడ్డూలు వడ్డించారు. దేవతలు రెండు వరసల్లో కూర్చొని ఒకరికి ఒకరు లడ్డూలను  తినిపించారు. రాక్షసులు అందరూ ఈ వింతను చూస్తూ ఉండిపోయారు. 

చివరిగా దేవతలు రాక్షసుల కన్నా ఉత్తములు అన్న  వాస్తవాన్ని అంగీకరించారు. 

రాజుగారికి ఆ కధ బాగా నచ్చింది. సమైక్యంగా, ప్రేమతో ఏ పనైనా సాధించగలం  అన్న వాస్తవాన్ని అంగీకరించారు.

 

మిత్రులారా మన జీవితంలో అన్నీ సమస్యలను ఒకరితో ఒకరు పోటీపడి సాధించడానికి ప్రయత్నిస్తాం కానీ  దానికి బదులుగా ప్రేమతో ఒకరినొకరు జయించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు?


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: