26, మే 2024, ఆదివారం

వైశాఖ పురాణం - 18.

 వైశాఖ పురాణం - 18.


18వ అధ్యాయము - యమదుఃఖ నిరూపణము


నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.


వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.


స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము.

కామెంట్‌లు లేవు: