26, మే 2024, ఆదివారం

ఒక సంఘటన

 ఒక సంఘటన 


చాలా సంవత్సరాల క్రితం అంటే 40 ఏళ్ళ పైబడే ఉండవచ్చు. నేను ఖమ్మం బస్టాండులో బస్సుకోసం 5వ నెంబర్ ప్లాటుఫామ్ మీద ఎదురుచుస్తూవున్నాను. సమయం 5-30 pm అయ్యింది. చాలా సేపటివరకు బస్సు రాలేదు దాదాపు 6 గంటల సమయంలో బస్సు వచ్చింది. నేను ఇల్లేందు వెళ్ళాలి అతి కష్టం మీద బస్సులోకి నా శరీరాన్ని చేర్చాను. ఆలా ఎందుకు అన్నానంటే అక్కడ చాలా సేపటివరకు బస్సు రానందు వల్ల రెండు బస్సులకు సరిపడా జనం వున్నారు. నేను గేటు దగ్గరే ఉండటంతో వెంటనే చాకచేక్యంగా బస్సులోకి దూరాను. అంతే వెనుకవాళ్ళ తోపుడుతో ముందుకు దూసుకొని వెళ్ళాను కానీ నాకు కూర్చోటానికి సీటు దొరకలేదు. అతి కష్టం మీద వెనక టైర్లు వుండే చోట నిలుచో గలిగాను. చుట్టూ చూసాను ఎక్కడైనా సీటు కాళిగా ఉందా అని కానీ ఒక్క సీటు కూడా కాళీ లేకపోగా నిలుచోవటమే అతి కష్టంగా అయ్యింది. లోపల గాలి ఆడటం లేదు. ఎప్పుడు బస్సు బయలుదేరుతుందా అని ఎదురు చూడసాగాను. కుడి ప్రక్క చిన్న తలుపు తీసుకొని డ్రైవరు లోపలి చొరబడ్డాడు. ఆ ఇక బస్సు బయలు దేరుతుంది అని నేను అనుకున్నాను. 


చిన్నగా డ్రైవరు వైర్లు కలిపి (ఆర్టీసీ బస్సులకు తాళం తీసి దాని వైర్లు ముడి వేసి పెట్టేవారు ఆ రెండు వైర్లు కలిపితే అప్పుడు స్టార్ట్ అయ్యేది)  బస్సును స్టార్టు చేసాడు.  అంతే ముందు ఆడవారి సీట్లలోంచి ఒక స్త్రీ పెద్దగా అరిచింది. అది నాకు పాము అన్నట్లు వినపడింది. నిజానికి ఆమె ఏమున్నదో నాకు తెలియదు. అరుపు మాత్రం ప్రాణం పోయినట్లు అరిచింది. అంతే కిటికీలలో పట్టిన వాళ్ళు అంతా ఒక్క క్షణంలో దూకారు. ముందు సీట్లలో వున్నవారు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లారు. ఒక్క క్షణంలో బస్సు మొత్తం కాళీ అయ్యింది. చుట్టూ చుస్తే బస్సులో నేను ఒక్కడినే వున్నాను. నేను కిటికీలోంచి దుకాణాల (అప్పుడు నేను చిన్నగా కిటికీలోంచి దుకే అంత సైజులోనే వుండే వాడిని) లేక బస్సు కాళీ అయింది కాబట్టి డోరులోంచి వెళదామా అని ఆలోచించిన తరువాత నాకు తట్టింది ఏమిటంటే ఆ అరచిన ఆమె పాము అన్నది కదా ముందు క్రింద ఎక్కడ పాము ఉందొ చూద్దాము అని సెట్ల మీద నిలుచొని చుట్టూ చూసాను. ఆ డిమ్ లైట్ల వెలుతురులో నాకు సెట్ల మధ్య ఏది కదిలినట్లు కనపడలేదు. 


అప్పుడు డ్రైవరు వచ్చి ముగ్గురు కూర్చునే ఆడవారి సెట్లలో మూడవ సీటు పైన సీటు తీసి క్రింద బ్యాటరీ వైరు గట్టిగా పిట్ చేస్తున్నాడు. నేను అడిగాను ఏమైందని. దానికి ఆయన లూసు కనెక్షన్ ఉండటం వలన బస్సు స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీ   వైరు దగ్గర స్పార్క్ వచ్చింది దానికి ఒక పల్లెటూరు ఆమె బస్సు తగలబడినట్లు అరిచింది అని అన్నాడు. ఆ మాటలకు నాకు ధైర్యం వచ్చింది నేను ముందరి రెండు సీటర్ సెట్లో కూర్చున్నాను. అక్కడ బయట వున్నవారిని డ్రైవరు లోపలికి రండి ఏమి ప్రమాదం లేదు అంటే జనం మళ్ళి  పుట్టలోని చీమలు వచ్చినట్లుగా వచ్చి బస్సునిండా చేరారు.  కాకపొతే ఇందాకటి సంఘటనకు కొంతమంది భయపడి వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని తెలిసింది.  నాకు తెలిసిన ఆమె ఒకామె ఈ విషయం గూర్చి తరువాత చెప్పి తనకు ఆ భయానికి బీపీ బాగా పెరిగి ఆస్పటలులో చేరినట్లు చెప్పింది. 


సామాన్య మానవులకు వస్తువులమీద అవగాహన లేకపోవటంతో వాళ్ళు బాధపడతారు ఇతరులను బాధపెడతారు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ.

కామెంట్‌లు లేవు: