29, జూన్ 2024, శనివారం

ఇనుప మూకుడు

ఇనుప మూకుడు  

హిమోగ్లోబిన్ అనునది ఇనుము సంబంధిత రసాయన పదార్ధము. ఇది మన శరీరంలో ఎక్కడ శక్తి కావాలో అక్కడకు ఆక్షీజనును తీసుకొని వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాకూడా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మన శరీరానికి కావలసినంత ఆక్షీజను లభించదు దద్వారా మన శరీరాన్ని శక్తివంతంగా పనిచేయలేము. ఈ రోజుల్లో ఎక్కువగా మహిళల్లో రక్తహీనత సర్వసాధారణమైనది. ఎవ్వరు చూసిన రక్త హీనతతో బాధపడుతున్నవారే అయితే ఎక్కువగా మహిళలకే ఎందుకు రక్త హీనత వస్తుంది అని ఆలోచించినట్లయితే దానికి అనేక కారణాలు వున్నాయి. అందులో ఒకటి మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పురుషులలో వుండే హిమోగ్లోబిన్ శాతం కన్నా తక్కువ ప్రకృతి సిద్దంగానే ఉంటుంది. 

పురుషుల్లో హిమోగ్లోబిన్ : 14 to 18 g/dl;

మహిళల్లో హిమోగ్లోబిన్  12 to 16 g/dl

ఇక్కడ ఇచ్చిన సమాచారం సగటు ఆరోగ్యవంతులైన వారి విషయం. ఇంకొక విషయం మనం గుర్తించాలి పురుషలల్లో రక్తం శరీరంలో వున్నది వున్నట్లే ఉంటుంది.  కానీ మహిళలకు ఋతుక్రమంలో వారి ప్రమేయం లేకుండా చాలా రక్తం వెలువడుతుంది. అసలే శరీరంలో హిమోగ్లోబిన్ పురుషులకన్నా తక్కువ ఉంటే వారు ఈ విధంగా కూడా  రక్తాన్ని కోల్పోతారు. నాకు వున్న సమాచారం ప్రకారం చాలామంది మహిళలు 10g /dl కన్నా తక్కువ ఉన్నట్లు తెలిసింది. పూర్వకాలంలో మన ఇండ్లలో వున్న వస్తువులు, ఆహారపు అలవాట్లు చాలావరకు మనం ముఖ్యంగా  మహిళలు ఆరోగ్యంగా రక్త హీనత లేకుండా ఉండటానికి ఉపకరించేవి. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రక్త హీనత వలన అనేక ఇతర రుగ్మతలు కూడా రావచ్చు. ఎందుకంటె ఎప్పుడైతే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందో అప్పుడు శరీరం బలహీన పడుతుంది దానివల్ల శరీరం ఇతర రోగాలను రాకుండా నిరోధించే శక్తిని కోల్పోతుంది దాని పర్యవసానంగా ఇతర రోగాలు ప్రవేశించటానికి తలుపులు తేరాచినట్లు అవుతుంది.  కాబట్టి ప్రతివారు తమ ఇంటిలోని ఆడవారి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ కాకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. 

వంటశాలలో మార్పులు: పూర్వం మన ఇండ్లలో అనేక వంట సామాగ్రిని మనం ఇనుముతో చేసినవి ఉపయోగించే వాళ్ళము. ఇప్పుడు మన వంటశాలలో ఇనుము పూర్తిగా కనుమరుగు అయ్యింది.   వాటి వల్ల శరీరం అనారోగ్యం పాలు అవుతున్నది. ఇప్పుడు నిశీతంగా పరిశీలిద్దాం. 

ముఖ్యంగా మనందరికీ తెలిసిన వంట ఇంటి వస్తువు ఇనుప మూకుడు. మనం పూర్వం ఇనుప మూకుడులో అనేక పిండివంటలను చేసుకునేవారము. పూరి, వడ, బజ్జే కారపూస, అదే జంతికలు, వడియాలు, అప్పడాలు, చల్లమెరపకాయలు అంతే కాదు బండపచ్చళ్ళు గోంగూర, బచ్చలికూర, చింతకాయ, మామిడికాయ, దోసకాయ మొదలయిన పచ్చళ్ళు చేయటానికి ఇనుప మూకుడునూనెలో వేయించి రోట్లో రుబ్బుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినే వాళ్ళం. అంతే కాకుండా పోపుపెట్టాలన్నా ఇనుప మూకుడు లేక ఇనుప గరిటను వాడే వాళ్ళము. ఒక్క మాటలో చెప్పాలంటే మన వంట సగానికి సగం ఇనుప ముకుడు మీదనే ఆధారపడి వున్నది. పూర్వం ఆడవారు ఇలా మాట్లాడుకునే వారు "వదిన మా ఇంట్లో మూకుడు పెట్టి వారం రోజులైంది నా కుమారుడు వచ్చాడు ఏదైనా చేయాలి" అని అంటే ఇంట్లో పిండి వంట చేసి అని అర్ధం. ఈ రకంగా మన వంట ఇల్లు ఇనుప మూకుడుతో అనుసందానం చేసి ఉండటం వలన మనం ఆరోగ్యంగా వుండే వాళ్ళము. మూకుడు తరువాత స్తానం ఇనుప పెనం తీసుకుంది. అట్లు వేసుకోవాలన్న, రొట్టెలు చేసుకోవాలన్న, పెనం మనకు అవసరం. వీటితో పాటు అట్లకాడ, జాలి గంటె ఇవికూడా ఇనుమువే ఉండేవి.

వీటితరువాట్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్న వంట ఇంటి ఇనుప వస్తువు కత్తిపీట కత్తిపీట లేని ఇల్లు  గతంలో ఉండేదే కాదు. ప్రతి కూరగాయను కత్తిపీటతోటె తరిగే వాళ్ళు ఎప్పుడైతే కూరలు కత్తిపీటతో తరుగుతారో ఆ కూరలలో వుండే ఆమ్లము ఇనుముతో రసాయనకిక్ చర్య చెంది ఆమ్లంలో కరిగిన  ఆ పదార్ధం కూరలతో పాటు వంటగిన్నెను చేరేది. మనందరికీ తెలిసిన విషయం మనం మామిడికాయలు తిరిగినప్పుడు కత్తిపీట చాలా పదును ఎక్కుతుంది. "అరె ఇప్పుడే మామిడి కాయలు తరిగా కత్తిపీట బాగా పదును మీద వుంది జాగ్రత్త"  అని కత్తిపీట పిల్లలకు ఇచ్చేటప్పుతూ అనటం కద్దు అంటే మరి కత్తిపీట ఎలా పదును ఎక్కింది అంటే కత్తిపీటలోని ఇనుము మామిడి కాయలలో కరిగి ముక్కలలో కలిసింది అని అర్ధం. 

గతంలో మనకు ప్రతి ఆహారపదార్ధం ఇనుముతో చేసిన వస్తువుమీది నుంచి వచ్చేవి దానివలన ఇనుము స్వల్పంగా ఆహారపదార్ధాలలో కరిగి మన ఆహారంలోకి ప్రేవేశించేది. దాని వలన ఇనుము మన శరీరానికి అందేది రక్త హీనత అనేది అస్సలు ఉండేది కాదు. 

ఇప్పుడు ఇనుప వస్తువులు అన్నీ  స్టీలు  అల్యూమినియం, ప్లాస్టిక్ పదార్ధాలతో మార్పు చేయబడినవి వాటి వలన ఆరోగ్యకరమైన కరిగిన ఇనుము మన  శరీరంలోకి వేళ్ళ కుండా అనారోగ్యాన్ని చేకూర్చే ప్లాస్టిక్కు, అల్యూమినియం వెళ్లి శరీరాన్ని సుషుకింపచేస్తూ అనారోగ్యం పాలుచేస్తున్నాయి. 

శరీరంలో రక్త హీనతను గుర్తించటం ఎలా: రక్తహీనత వుండే వారిలో త్వరగా అలసట చెందటం, కంటి గ్రుడ్డు క్రింది రెక్కను ప్రక్కకు అని చుస్తే అక్కడ గులాబిరంగుగా, లేక పాలిపోయి ఉంటాయి. శరీరం శుష్కించినట్లుగా కనపడుతుంది. రక్తహీనత సాదారణ మైన విషయమే కానీ దీనిని ఆశ్రర్ధ చేయకూడదు. సత్వరం తగిన ఆహారపదార్ధాలు అంటే ఇనుము ఎక్కువ ఉండేవి తినటం వలన దీనినుండి కాపాడుకోవచ్చు. 

కొన్ని వంటింటి చిట్కాలు: 

1) పల్లీ చెక్క అంటే వేరుశనగ పల్లెలను బెల్లంలో కలిపి చేసే స్వీట్ ఇది చావుకగా లభిస్తుంది. దీనిని రోజు స్వేకరించాలి . 

2) పల్లీలు, బెల్లం నువ్వులు, రోజు తినే అలవాటు చేసుకోవాలి.

విధిగా మన వంటకాలలో పంచదార బదులుగా బెల్లాన్ని వాడాలి.  మరల ఇనుపముకుడును మన వంటశాలకు ఆహ్వానిస్తే చాలావరకు మనం రక్త హీనతనుండి కాపాడుకోగలుగుతాము. ఈ వ్యాసము చదివిన వారందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆశిస్తున్నాను.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ


కామెంట్‌లు లేవు: