24, నవంబర్ 2024, ఆదివారం

కాలభైరవాష్టమీ

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 23/11/2024 - కాలభైరవాష్టమీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

 

సాక్షాత్ పరమశివుని అవతారం కాలభైరవుడు. కాలము అనే శునకాన్ని వాహనంగా కలిగి వుంటాడు కాబట్టే ఆయనను కాలభైరవుడు అని పిలుస్తారు.


నుదుట విభూతి రేఖలను ధరించి, సాధారణంగా భైరవుడు భయంక రాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదు నైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. ఆయన రూపం భయంకరంగా కనిపించినా, తనను ఆరాధించిన వారిపట్ల ఆయన రక్షకుడుగా వ్యవహరిస్తూ వుంటాడు. ఇవి తెలియక కాలభైరవుడికి కొందరు  కాస్త దూరంగా వుంటారు. దుష్టగ్రహబాధలు నివారించగల  రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు.


శైవక్షేత్రాలలో కనిపించే కాలభైరవ స్వామి ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు.  

దేవాలయములలో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా ఆయన దర్శనం చేయవలెను.


*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*

*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*


*అష్టభైరవులు*


అసితాంగ భైరవుడు.

రురు భైరవుడు.

చండ భైరవుడు.

క్రోధ భైరవుడు.

ఉన్మత్త భైరవుడు.

కపాల భైరవుడు.

భీషణ భైరవుడు.

సంహార భైరవుడు.

అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.


*కాలభైరవ వృత్తాంతం*


తనను అవమానించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహించి భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించ మని ఆదేశిస్తాడు. క్షణ మైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సును ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయట పడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి కపాలాన్ని చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుం దని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.


శ్రీకాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకలగ్రహదోషాలు, అపమృత్యుదోషాలు, తొలగిపోతా యని, ఆయురారోగ్యాలు పెంపొందుతా యని మంత్రశాస్త్రగ్రంథాలు చెబుతాయి.


శ్రీకాలభైరవపూజను అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవపూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీకాలభైరవుడి విగ్రహానికి గాని, చిత్రపటానికి గాని పూజ చేయవచ్చు. శని, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికర మైన రోజులు. 


శ్రీకాలభైరవహోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు, అనారోగ్యబాధలు తొలిగిపోతాయి. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూరతైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో వున్న సమస్త గ్రహదోషాలూ తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్షు పెరుగుతుంది.


ఇంకా ఎనిమిది మిరియాలను ఓ తెల్లని గుడ్డలో కట్టి వత్తుగా చేసి భైరవుని తలచి రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తే  అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే పాలను అభిషేకానికి సమర్పించుకున్నా శనిదోషా లుండవు. శ్రీకాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవదర్శనం చేసి భైరవునికి పెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అపమృత్యుదోషాలు తొలగిపోతా యని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.


*శ్లో౹౹ ఉపోషణస్య అంగభూతం అర్ఘ్య దాన మిహస్మృతం*

*తధా జాగరణం రాత్రౌ పూజాయామ చతుష్టయే!!*


ఈ కా భైరవ అష్టమి నాడు ఉపవాసం చేయాలి. ఉపవాసానికి తోడుగా అర్ఘ్యదానం చేయాలి. అలాగే రాత్రి జాగరణ కూడా చేయాలి. నాలుగవ జామున పూజ చేయాలి - అని త్రిస్థలీసేతులో  చెప్పబడింది. 


కాలస్వరూపం తెలిసినవాడు. కాలం లాగే తిరుగులేనివాడు. గ్రహబలాలను అతిక్రమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్య మని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక శాశ్వతుడు, నిత్యుడు అయిన కాలభైరవుణ్ణి అత్యంత పవిత్ర మైనది, మహిమాన్విత మైన  ఈ కాలభైరవ అష్టమి మహాపర్వదినమున

స్తుతించినట్లయితే, ఆ సంవత్సరమంతా ఏ కార్యము చేసినా విఘ్నము లుండవు.* ఈ అష్టమి నాడు సకాలంలో పుణ్య తీర్థములలో స్నానం చేసి మంత్రంతో తర్పణం చేసి అర్ఘ్యం సమర్పించి కాలభైరవుని పూజించినచో పితృ దేవతలు నరకము నుండి ఉద్ధరింప బడుదు రనే ఋషి వచనముల ననుసరించి విహిత కర్మానుష్ఠానము ఆచరించి ఆనందించి కృతకృత్యుల మవుదాం.


*శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు* పఠించడం వల్ల భైరవానుగ్రహాన్ని పొందవచ్చు.


*కాలభైరవ గాయత్రి*


*ఓం కాలకాలాయ విద్మహే*

*కాలాతీతాయ ధీమహి*

*తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥*


 *కాలభైరవాష్టకం*


*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*

*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*


*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*

*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*


*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*

*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*


*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*

*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*


*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*

*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*


*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*

*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*


*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*

*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*


*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*

*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*


*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*

*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*


🚩 *_శుభమస్తు!_* 🚩


🙏🏻 *హర హర మహాదేవ!* 🙏🏻


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*

కామెంట్‌లు లేవు: