23, మార్చి 2025, ఆదివారం

సీతా జన్మదినోత్సవం ..

 🍀✡️🍀🕉️🍀🕉️🍀


🙏 నేడు సీతా జన్మదినోత్సవం ...!!


🌿కృత్యరాజ సముచ్చయం అనే గ్రంథంలో ఈనాడు సీతాపూజ చేయాలని ఉంది. ఇది సీతాదేవి పుట్టిన రోజు పండుగ. 


🌸సీత రాముని భార్య అనే విషయం తెలిసిందే. ఆమె జనక మహారాజు పుత్రిక. ఆమె పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. వేదవతి కథ చదవదగినది.


🌿కుశధ్వజుడు అనే మునికి మాలావతి అనే భార్య ఉండేది. ఈ దంపతుల కుమార్తె వేదవతి. కుశధ్వజుడు వేదాలు చదువుతూ ఉండగా, ఈమె పుట్టడం వల్ల, ఈమె పుట్టినపుడు పురిటింటి నుంచి వేదఘోష వెలువడుట వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు.


🌸 శిశువు పెరిగి పెద్దదయ్యింది. ఈమెను విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేస్తానని కుశధ్వజుడు చెబుతుండే వాడు. అంతలో ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వచ్చి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడు. 


🌿కుశధ్వజుడు అందుకు నిరాకరించాడు. దీంతో రాక్షసుడు ఒక రాత్రివేళ దొంగచాటుగా వచ్చి నిద్రపోతున్న కుశధ్వజుడిని హతమార్చాడు. అప్పుడు అతని భార్య మాలావతి భర్త మరణాన్ని తట్టుకోలేక తానూ ప్రాణాలు విడిచింది. 


🌸తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తండ్రి నిశ్చయం ప్రకారం విష్ణువును పతిగా కోరి తపస్సు చేయడానికి వెళ్లింది. తపోదీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు దిగ్విజయార్థం వెళ్తూ చూశాడు.


🌿 ఆమె రూపానికి మోహితు డయ్యాడు. తనను వరించాలని కోరాడు. విష్ణు మూర్తిని తప్ప ఇతరులను తాను పెళ్లాడనని వేదవతి ఖరాఖండీగా చెప్పింది.


🌸రావణుడు మోహపారవశ్యం వీడక ఆమెను బలాత్కారంగా ముట్టుకున్నాడు. అప్పుడామె కఠిన స్వరంతో- ‘నువ్వు నీచుడవని తెలిసీ నీతో మాట్లాడాను. 


🌿నువ్వు నన్ను అవమానించావు. అవమానితమైన ఈ దేహం ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోజనిగా ఈ భూమీ మీద తిరిగి పుట్టి నిన్ను పుత్ర మిత్ర కళత్రంగా నాశనం చేయడానికి కారణభూతురాలిని అవుతాను’ అని యోగాగ్నిని సృష్టించు కుని అందులోకి దూకి దహనమైంది.


🌸అనంతరం ఆమె లంకలో ఒక తామర కొలనులోని ఒక తామర పువ్వు బొడ్డులో సూక్ష్మరూపంతో దాగి తపస్సు చేసుకోసాగింది. 


🌿శివపూజ కోసం రావణుడు ఒకనాడు తామరపువ్వులను కోస్తూ వేదవతి దాగిన పువ్వును కూడా కోశాడు. అన్ని పువ్వుల కంటే ఈ పువ్వు బాగా బరువుగా ఉంది. 


🌸కారణం ఏమిటోనని అతను ఆ పువ్వును చీల్చి చూశాడు. అందులో నుంచి కన్యక బయటకు వచ్చింది.

‘రావణా! నన్ను వదులు. లేకుంటే నువ్వు చచ్చిపోతావు’ అని ఆ కన్యక పలికింది. 


🌿అయినా సరే, రావణుడు ఆ కన్యకను తన మందిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆస్థాన జ్యోతిష్యులతో సంప్రదించాడు. ఆమె జన్మ లంకకు చాలా అరిష్ట సూచకంగా ఉందని వారు చెప్పారు. అప్పుడు రావణుడు ఆమెను ఒక బంగారపు పెట్టెలో పెట్టి సముద్రంలోకి వదిలేశాడు.


🌸 అది అలల తాకిడికి కొట్టుకునిపోయి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకసారి యజ్ఞశాల నిమిత్తం భూమిని దున్నిస్తుం డగా, ఒక నాగలికర్రుకు ఈ బంగారపు పెట్టె తగిలింది.


🌿 ఆయన దానిని వెలికి తీయించి తెరిచి చూశాడు. ఒక కన్య బయపడింది. ఆనాడు ఫాల్గుణ అష్టమి. నాగలి చాలును సంస్క•తంలో సీత అంటారు. నాగలిచాలులో లభ్యమైనందున ఆమెకు సీత అనే పేరు పెట్టారు.


🌸 ఆమెను కాల క్రమంలో రాముడికి ఇచ్చి వివాహం చేశారు. సీత తాను వేదవతిగా ఉన్నప్పుడు పలికినట్టే.. సీతగా పుట్టి లంకకు చేటు తెచ్చింది. అదెలాగో నన్న విషయం అందరికీ తెలి సింది

🌿 సీతాదేవి పుట్టిన ఫాల్గుణ కృష్ణ అష్టమి నాడు సీతాదేవిని పూజిస్తే పుణ్యము. గ్రంథాంత రాల్లో ఈ తిథి నాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు..🙏🙏🙏🙏


.

కామెంట్‌లు లేవు: