*కాలుగాలిన పిల్లి*
ఏంటో తెలుగు నానుడ్లను గురించి ఆలోచిస్తుంటే కొన్ని సందేహాలు అడపాదడపా రాక మానదు. ఈరోజు నా మదిలో అకస్మాత్తుగా *కాలుగాలిన పిల్లి* గురించి దృష్టి మళ్లింది.
కాలుగాలిన పిల్లిలా అంటే కుదురుగా ఒక ప్రదేశంలో కూర్చోకుండా అటూఇటూ పచార్లు చేసేవారిని అంటారు కదా. ఏదో పిల్లి ఎప్పుడూ ఒకే చోట కదలక ఉంటుందన్నట్టు, కాలుగాలితేనే అటుఇటుగా తిరుగుతున్నట్టు ఓ తలపును కలిగిస్తుంది. కాని మా ఇంటి ఆవరణలో ఓ పిల్లి అస్తమానం తిరుగుతూనే ఉంటుంది. ఇంతకీ కాలు కాలకుండానే.
కాలుగాలితే పిల్లే కాదు కుక్కైనా నక్కైనా అంటే ఏ జంతువైనా, జంతువు దాకా ఎందుకు మనుషులు కూడా కాలుగాలితే విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోతారు కదా.
ఈ నానుడి పిల్లికి మాత్రమే అన్వయించడం ఎంత వరకు సమంజసం అని శోధించినప్పుడు ఓ కథ తటస్థపడింది. ఇది నేను వెదికి వెదికి గ్రహించిన ఓ చిన్న కథ — సున్నితమైన వ్యంగ్యంతో, జీవిత సత్యాన్ని ముచ్చటగా చెప్పే కథ.
నలుగురు అన్నదమ్ములు ఆస్తి పంచుకునే సమయంలో, తమ పెంపుడు పిల్లిని ఏం చేయాలనే సందేహంలో పడ్డారు. చివరికి, ఆ పిల్లిని కూడా ఆస్తిలాగానే పంచేయాలని నిర్ణయించి, నలుగురూ తలా ఒక్కో కాలు తమ వాటాగా తీసుకున్నారు.
ఒక రోజు ఆ పిల్లి నాలుగో కాలులో ముల్లు గుచ్చుకుని కుంటుకుంటూ తిరగసాగింది. ఆ కాలికి చెందిన యజమాని జాలితో, నూనెలో ముంచిన గుడ్డతో కట్టు కట్టాడు.
కుంటుకుంటూ తిరుగుతున్న ఆ పిల్లి, అనుకోకుండా దేవుడి దీపం దగ్గరకు చేరి, ఆ నూనె గుడ్డకు మంట అంటించుకుంది. తన కాలు మండుతున్న బాధతో భయాందోళనకు లోనైన ఆ పిల్లి, కాలు గాలుతూ, నేరుగా అన్నదమ్ముల వ్యాపార గోదాములోకి పరుగెత్తింది.
ఆ గోదాంలో ఉన్నది పత్తి! పత్తికి మంట అంటుకుంటే ఏమవుతుందో తెలిసిందే కదా, క్షణాల్లోనే అంతా భస్మమైపోయింది.
అప్పుడు మిగతా ముగ్గురు అన్నలు, “కాలిన కాలు నీ వాటా కాబట్టి, నష్టం నీదే బాధ్యత” అంటూ ఆ తమ్ముడిపై కాంపెన్సేషన్ క్లెయిమ్ వేశారు.
ఆ తమ్ముడు వాపోయాడు, “నా పత్తి కూడా మీదితోపాటే కాలిపోయింది. ఇదేనా న్యాయం?” కానీ వారు ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడే ఆ తమ్ముడికి తెనాలి రామలింగడిని తలపించే చతురమైన లాయర్ ఒకడు దొరికాడు.
కోర్టులో అతను ఇలా వాదించాడు, “పిల్లిని దీపం దగ్గరకు కుంటుకుంటూ తీసుకెళ్లింది మీ ముగ్గురు అన్నల కాళ్లే. అంతేకాదు, నాలుగో కాలు మంటపట్టుకుని లబోదిబమంటున్నా, మీ మూడు కాళ్లూ దాన్ని ఆపకుండా, పత్తి గోదాం వైపే తీసుకెళ్లాయి. కాబట్టి నష్టం జరిగినందుకు మీరు ముగ్గురే ఆ తమ్ముడికి పరిహారం చెల్లించాలి!”
ఆ మాటల దెబ్బకు అందరికీ దేవుడు దిగి వచ్చినట్టే. చివరికి అందరూ సర్దుకుని రాజీకి వచ్చారు.
ఈ కథకు ఆ కవి పెట్టిన పేరు — “కాలు గాలిన పిల్లి”. అప్పటి నుంచీ అది ఓ నానుడిగా ప్రజల్లో ప్రచారం అయిపోయింది.
కాని ఈ కథ వింటూంటే వెనుకటి మరో కథ, ప్రశస్తమైనది, గుర్తుకు రావటం లేదూ, ఆ పాత కథను మొదటగా గుర్తించిన వారికి బహుమతులు ఖాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి