6, జనవరి 2026, మంగళవారం

*సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*613 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


పుణ్యతీర్ధములు

ధర్మరాజు " పితామహా ! నాకు తీర్ధ విశేషాలు తెలియజేయండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము గౌతముడికి అంగిరసుడు వివరించిన విశేషములు నీకు వివరిస్తాను. చంద్రబాగ, వితస్తనదీ తీరాలలో ఏడు దినములు ఉపవాసము చేసిన వాడు మునిసమానుడు ఔతాడు. కాశ్మీరదేశంలో పారే నదులలో నదులలో నీరు త్రాగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కర తీర్ధము, ప్రభాస తీర్ధము, నైశారణ్యము, ఇంద్ర మార్గము, దేవిక, స్వర్గ బిందువు వీటిలో స్నానం చేసిన అప్సరసలతో విమానవిహారము ప్రాప్తిస్తుంది. గంధమాధన పర్వతములలోని ఇంద్రతోయ, కరతోయ అనే నదీతీరాన మూడు రోజులు ఉపవాసము ఉండి స్నానమాచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలితము కలుగుతుంది. కనఖలములో, గంగాద్వారములో, కుశావర్తములో, బిల్వకములో స్నానము చేస్తే పాతకములు తొలగి పోతాయి. కైలాసశిఖరమున గంగాస్నానము చేసిన దేవతాదర్శనం ఔతుంది. ఒకనెల పాటు ఆహారము భుజించక అగ్నిని ఆరాధించిన వారికి సకలసిద్ధులు ప్రాప్తిస్తాయి. భృగుతుంగము అను సరస్సులో మూడురోజులు ఉపవాసము ఉండి స్నానము చేసిన బ్రహ్మహత్యాపాతకము తొలగిపోతుంది. సుందరికాసరస్సులో స్నానము చేసిన మరుజన్మలో అత్యంత సుందరాకారము ప్రాప్తిస్తుంది. వైమానికము అనే తీర్ధములో స్నానం చేస్తే స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. కృత్తిక, అంగారకుల సేవచేస్తే, పాపములు నశించి స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. విపాశానదిలో మూడు రోజులు స్నానము చేస్తే పునర్జన్మ ఉండదు. కృత్తికా ఆశ్రమంలో స్నానము పితృతర్పణం చేసిన వాడికి శివసాన్నిధ్యము కలుగుతుంది. ద్రోణ శర్మ, శరస్తంభము, దేవదారు వనమును సేవించిన వారికి అప్సరస వంటి భార్య దొరొకుతుంది. చిత్రకూటము, జనస్థానం సేవించిన వారికి రాజ్యసంపదలు కలుగుతాయి. శ్యామాశ్రమంలో ఒక నెల పాటు నిరాహారంగా ఉంటే అతడికి అంతర్ధ్యాన ఫలము కలుగుతుంది. కైశికవాలములో మౌనంగా నిరాహారంగా 21 రోజులు గడిపితే అతడు ముక్తిని పొందగలడు. మతంగవాపిలో ఒక రాత్రి గడిపితే సిద్ధుడు ఔతాడు. నైమిశారణ్యమున ఒకమాసము నివసించిన పురుషమేధము చేసిన ఫలము పొందగలడు. అలాగే ఉత్పలావనములో చేసిన సగము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందగలడు. గంగా యమునా సంగమములో ఉన్న కాలాంజనము అను పర్వతము మీద స్నానము చేస్తే విముక్తిమార్గము పొందుతాడు. వైవసత్వతీర్ధంలో స్నానము చేసిన అనేక సంపదలు పొందుతాడు. ప్రయాగక్షేత్రములో మూడుకోట్ల పదివేల పుణ్యతీర్ధములు వచ్చి కలుస్తాయి. ప్రయాగలో ఒకనెల గడిపిన వాడికి ముక్తి లభిస్తుంది. గంగానదిలోను, బ్రహ్మకపాలం లోనూ ఒక మాసం రోజులు ఉపవాసము ఉంటే చంద్రలోకప్రాప్తి కలుగుతుంది. అష్టావక్రము కలవింకము, దేవహ్రదుము వీటిలో స్నానము చేసిన నరుడికి బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. రామహ్రదములో 12రోజులు నియమంగా ఉపవాసము ఉంటే సకలదోషములు హరిస్తాయి. మహాహ్రదంలో నెల రోజులు ఉపవాసం ఉంటే జమదగ్ని పొందిన లోకములు ప్రాప్తిస్తాయి. వింధ్యపర్వతము మీద నెల రోజులు తపస్సు చేస్తే సకలధర్మములు అలవడతాయి. నర్మదానదిలో స్నానము చేస్తే రాకుమారుడిగా పుడతాడు. జంబుద్వీపంలో మూడుమాసముల ఒక్క రోజు నివసిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకాముఖంలో స్నానము చేసి తండులికాశ్రముకు పోయి, నార చీరలు ధరించి, శాకాహారము తింటూ శాంతిగా జీవిస్తే పదిమంది కన్యలకు భర్త అయి ఆరోగ్యవంతుడుగా అకాలమరణం లేకుండా జీవిస్తాడు. కుల్యతీర్ధంలో మూడు రాత్రులు నిరాహారంగా, శుచిగా, అఘమర్షణ జపం చేస్తే అతాడికి అశ్వమేధయాగము చేసిన ఫలితము దక్కుతుంది. ఆర్షిసేనాశ్రమంలో ఉన్న ఉజ్జానకము అనే తీర్ధములో స్నానము చేసిన మానవుడు సకల పాపములు హరించబడతాయి. పిండారకములో ఒక రాత్రి గడిపిన వాడికి అగ్నిష్ఠోమ ఫలము దక్కుతుంది. ధర్మారణ్యములో ఉన్న బ్రహ్మసరస్సులో స్నానం చేసిన మానవుడు పుండరీక యాగము చేసిన ఫలితము దక్కుతుంది. హిమాలయ పర్వతములలో మునులకు సేవ చేస్తూ తపస్సు చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తించి బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. ధర్మనందనా ! పుణ్యతీర్ధములను సేవించునప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేని ప్రశాంత చిత్తముతో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే తీర్ధములు సేవించిన ఫలము దక్కుతుంది. ధర్మజా ! నిజానికి అన్ని తీర్ధములు మనసులోనే ఉంటాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో ఉంచడం, ఇవన్నీ తీర్ధసేవనంతో సమానములే. కేవలము వట్టి నీళ్ళతో స్నానము చేసిన శరీరము శుభ్రపడుతుంది కాని మనసులోని కల్మషములు తొలగవు. ధర్మనందనా ! దొరకని వాటికి తాపత్రయ పడకుండా దొరికిన వాటితో సంతృప్తి చెంది, కోరికను జయించిన వాడికి ఏ తీర్ధములతో పని లేదు. అటువంటి వారు సదా పవిత్రులే. ధర్మనందనా ! మానవుడు ఎంతో శ్రమకోర్చి దుర్గమమైన ప్రదేశములో ఉన్న అన్ని తీర్ధములు సేవించ పని లేదు. ఆ తీర్ధములను మనసున స్మరించిన చాలు సకల పాపములు హరించబడతాయి " అని భీష్ముడు చెప్పాడు. ఇంతలో శరతల్పగతుడైన భీష్ముడిని చూడడానికి అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరసుడు, అగస్త్యుడు, కణ్వుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో సహా అక్కడకు వచ్చారు. వారిని చూసిన పాండవులు ఆశ్చర్యచకితులై వారికి భక్తిశరద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని చూసిన పిమ్మట వారంతా అక్కడ నుండి వెళ్ళారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: