🙏 బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ --- హిందూ సాంప్రదాయం 🙏
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం. పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు.ఇటువంటి కుటుంబ వ్యవస్థకు పునాది హిందువులే .
పెద్దలను సేవిస్తూ, పిన్ననలను ఆప్యాయంగా చూసేది మన కుటుంబ వ్యవస్థ.
నేటి వ్యష్టి కుటుంబాలు లోటుపాట్లు గురించి వ్రాయనవసరం లేదు ఈ సమస్య అందరికి తెలిసినదే. అయినా ఈ అంశం గురించి వేరే వ్యాసం వ్రాస్తాను. ఇప్పుడు మాత్రం
మన ముందు తరము వారి జీవన విధానం సమిష్టి కుటుంబ వ్యవస్థయే, వారి గురించి వ్రాస్తాను.
హిందూ సాంప్రదాయానికి ప్రతి బింబం మన కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే వేదంలో చెప్పిన షోడశ సంస్కారాలు ఆచరిస్తాము . మిగిలిన వారికి కొన్ని మినహాయింపు ఉన్నాయి..
బ్రాహ్మీ ముహూర్త సమయానికి నిద్రలేచి దైవ ప్రార్ధన, మేలుకొలుపు పాటలతో గృహము శోభిల్లేది. పశువులశాల శుభ్రం చేసి ఇంట్లో వ్యక్తుల వలెనే పశువులను సంరక్షణ చేసేవారు.సూర్యోదయానికి పూర్వమే స్నానాదికములు పూర్తి చేసుకునేవారు.
పనులలో పరస్పర సహకారం ఉండేది. ఏ ఒక్కరిమీద భారం పడకుండా ఆడ - మగ అనిగాని, అత్త కోడలు అనిగాని భేద భావం లేకుండా కుటుంబానికి సేవ చేసేవారు. అప్పట్లో సమిష్టికుటుంబం కాబట్టి వృద్ధులకు ఒంటరితనం లేకుండా చూసుకొనేవారు.కుటుంబ సభ్యులందరు పరస్పర ప్రేమానురాగములతో నడుచుకొనేవారు.మగవాళ్ళలో ఒకరు ధనసంపాదన చేయలేకపోతే కుటుంబానికి సేవ చేసేవారు.అందువలన బ్రాహ్మణ కుటుంబం అందరికి ఆదర్శం అయింది.
మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ"
దైవం ఎక్కడో లేడు. మాతృ, పితృ, గురు, అతిథి రూపాల్లో నిన్ను వెన్నంటే ఉంటాడు అనే విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు.
1మాతృ దేవః + భవ. 2. పితృదేవః + భవ.3..ఆచార్య దేవః +భవ. 4..అతిథి దేవః + భవ.
ఇవి చదువులు పూర్తి చేసుకొని వెళ్లే విద్యార్థికి గురువుగారు చేసే ఉపదేశాలు. వేదం ఈ విధంగా చెప్తుంది..ఈ విధంగా నడుచుకో —అని చెప్పి పంపుతారు ఆయన.
ఇవి బహువ్రీహి సమాసాలు.
మాతృ దేవః —అంటే మాతయే దైవంగా కలవాడు.
తల్లి దైవంతో సమానం— అని కాదు.. ..
1.తల్లి యే దైవంగా కలవాడివిగా నడుచుకో —అని
అలాగే 2.తండ్రి 3..గురువు 4.. అతిథి వీళ్ళే దైవం—అని .
ఏ పునరాలోచన లేకుండా వీళ్ళ మాట నిర్వర్తించు..అని ధర్మశాస్త్ర శాసనం. అనుసరించక పోతే శిక్షే. ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరవలసిందే…అని అంత గట్టిగా శాస్త్రం చెప్తుంది ఇదే బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థకు పునాది.
వేదములను మధుకర వృత్తితో గాని, వారములతో గాని జీవయాత్రగడుపుచు గురుశుశ్రూషనుచేసి, చదువుకొని, చదువుకున్నది మరచిపోకుండ వల్లించుచు, మననము చేయుచు, శాస్త్రముల చదివి ప్రవచనములు చేయుచు, వేద విధి విహిత సత్కర్మములను జేయుచు, తమ విద్య నభిలషించు విద్యార్థులకు విద్యాబోధ చేయుచు, అతిథి అభ్యాగతులను సత్కరింపుచు, చిత్త శుద్ధినిగడించి, జ్ఞానమును సముపార్జించిన వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ
‘అన్ని దానాలలోకీ అన్నదానమే శ్రేష్ఠమైందని’ మన సనాతన భారతీయులు మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. సృష్టిలో ప్రతి జీవి జీవించేది అన్నం (ఆహారం)తోనే. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో శరీరం శిథిలమైనా ప్రాణం నిలిచే ఉండేది. తపస్సుతో కేవలం ఎముకల గూడుగా మిగిలిన దధీచి, శరీరం మొత్తం పుట్టలో మునిగిపోయిన వాల్మీకి, పదివేల యేండ్లు ఒంటికాలిపై తపస్సు చేసిన భగీరథుడు.. మొదలైన వారంతా అన్నపానీయాలు లేకుండా ఎంతోకాలం బతికినవాళ్ళే. కలియుగంలో జీవులన్నీ అన్నగత ప్రాణులే. నీరు, అన్నం లేకుండా మనం బతకలేం. బాల్యంలో తల్లిదండ్రులు శిశువులను రక్షిస్తే, గురుకులంలో బ్రహ్మచారులకు గురుదంపతులు భోజనాలు పెట్టి రక్షించేవారు. ప్రతి గృహస్థు విధిగా ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావించి (అభ్యాగతః స్వయం విష్ణుః), ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గా నివేదించడం మన సనాతన కుటుంబ సంస్కృతిలోని గొప్పదనం.
నిత్యం పంచ మహా యజ్ఞాలు నిర్వహించేది మన కుటుంబ వ్యవస్థ.
వేదాలలో పంచ మహా యజ్ఞాల గురించి ఈ విధంగా చెప్పబడినది. అవి బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, మాతా పితరుల యజ్ఞం, అతిథి యజ్ఞం మరియు బలివైశ్వదేవ యజ్ఞం.
బ్రాహ్మణ కుటుంబ ఆచార వ్యవహారాలలో పంచ మహా యజ్ఞాలను ఆచరించేవారు
బ్రహ్మయజ్ఞమనగా సంధ్యావందనాదులను చేయుట, దేవతార్చన భగవంతుని సృష్టిని పూజించుట యని చెప్పియున్నారు.
రెండవది దేవ యజ్ఞం అంటే దేవతలను పూజించుట. దేవతలు అంటే శివ కేశవాది దేవతలే మాత్రమే కాకుండా నిస్వార్థంగా ఇతరులకు ఉపకారం చేసే వారు ఉదాహరణకి గోమాత, వృక్షాలు, నదులు, తల్లిదండ్రులు, గురువు మొదలైన వారు. మూడవది మాతా పితరుల యజ్ఞం అంటే తల్లి దండ్రులకు సేవ చేయటం, వారు చెప్పి విధంగా నడచుకోవడం, వారిని గౌరవించుట మరియు వారిని ఆదరించుట సేవజేయుట మొదలైనవి.
వారే మనకు మొదటి గురువులు కావున వారిని ఆదరించుట ఒక యజ్ఞం లాగా పేర్కొన్నారు. నాల్గవది అతిథి యజ్ఞం. దీనిలో అతిథులను అభ్యాగతులను ఆదరించుట వారికి తగిన సత్కారములు చేయుట మొదలైనవి. ఐదవది బలివైశ్వ దేవ యజ్ఞం అనగా ప్రపంచంలోని జంతువులను పశు పక్ష్యాదులు నాదరించుట. జంతులోకం కూడా దేవుని సృష్టియే. కనుక వాటి జీవనమును కూడా సహకరించుట చేయవలెను.
పంచ మహా యజ్ఞాలను వివిధ రకాలుగా పెద్దలు వర్ణిస్తారు. కొందరు భూత యజ్ఞము మొదలైన వాటిని కూడా ఈ పంచ యజ్ఞాలలో భాగమని అంగీకరిస్తారు.
భూత యజ్ఞమే బలివైశ్వ దేవ యజ్ఞమని కొందరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ సంక్షిప్తంగా చెప్పాలంటే మానవులందరూ కనీసం ఈ ఐదు యజ్ఞాల రూపంలో వివరించిన విధంగా తల్లిదండ్రులను గౌరవించుట వారు చెప్పిన విధంగా ఆచరించుట, దేవతలను పూజించుట, అతిథి రూపంలో వచ్చ్చినవారిని ఆదరించుట మరియు పశు పక్ష్యాదులనుr నిస్వార్థముగా ఆదరించుట మొదలైనవి కనీస బాధ్యగా భావించి వేదాలు చెప్పిన విధంగా ఆచరించిన బ్రాహ్మణ జీవితము పరిపూర్ణమౌతుందని ఋషులు తెలియజెప్పారు
మన కుటుంబ ఆచార వ్యవహారాలలో ఎంతో సాంప్రదాయబద్దమైనదే మడికట్టు ఆచారం.పూర్వ కాలం నుంచి ప్రస్తుత కాలంలో కొందరు ఇప్పటికీ మడికట్టు ఆచారాన్ని పాటిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పాటించాలి. శుచి శుభ్రత దానితో పాటు చిత్తానికి ఏకాగ్రత్త కలిగి మంత్ర సిద్ధి కలుగుతుంది.
బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థను -- గృహ యజమానిని అల్లసాని పెద్దన మనుచరిత్రలో అద్భుతంగా వర్ణించాడు
కెలకుల నున్న తంగెటి జున్ను గృహమేధి యజమానుడంక స్థితార్ధ పేటి
పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు
దొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని యమృతంపు నడబావి సంసారి
సవిధ మేరు నగంబు భవన భర్త
మరుదేశ పథ మధ్యమప్రప కులపతి
యాకటి కొదవు సస్యము కుటుంబి
బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిధి క్షపణ కావ ధూత కాపాలికాద్యనాధులకు గాన భూసురోత్తమ! గార్హస్త్యమునకు సరియె !
ఓ బ్రాహ్మణోత్తమా! ఆశ్రమాలు నాల్గింటిలోకీ గృహస్థాశ్రమమే (గార్హస్త్యము) గొప్పది. తక్కిన అన్ని ఆశ్రమాలవారికీ ఇదే ఆధారం. చెవిటి, కుంటి (పంగు), గ్రుడ్డి, భిక్షువులు, బ్రహ్మచారులు, జటి (వానప్రస్థులు), పరివ్రాజకులు (సన్యాసులు), అతిథులు, క్షపణకులు (బౌద్ధ భిక్షువులు), అవధూతలు (దిగంబరులు), కాపాలికులు (శాక్తేయులు) - ఈ మొదలైన అనాథులకు అందరికీ గృహమేథి (యజమానుడు, వాస్తవ్యుడు, కాపు, సంసారి, భవన బర్త, కులపతి, కుటుంబి ఇవన్నీ గృహస్థుకి పర్యాయపదాలు) దగ్గరలో ఉన్న తంగేటిజున్ను లాంటివాడు (చేతితో తీసుకోవచ్చునని) ఒడిలో ఉన్న ధనపేటిక (డబ్బుపెట్టి), పెరటిలో ఉండి పండిన కల్పవృక్షం, దొడ్డిలో కట్టేసుకున్న కామధేనువు (వేల్పుగిడ్డి) అంతులేని అమృతకూపం, అందుబాటులోఉన్న మేరుపర్వతం, ఎడారిదారిలో (మరుదేశపథం) చలివేంద్రం మీరే పంట- అన్నీ అభేద రూపకాలు.
ఇంట అందరూ సుఖంగా ఉండి, పుత్రుడు బుద్ధి మంతుడై, పత్ని మధుర భాషిణియై, మంచి మిత్రులు, స్వపత్నీసంగమం, ఆజ్ఞానువర్తులైన సేవకులు, రోజూ అతిథి సత్కారం, శివారాధనం కలిగి ఉంటూ పవిత్రమూ, రుచికరము అయిన అన్నపానాదులు, నిత్యసత్సాంగత్యము ఉన్న గృహస్తుని ఆశ్రమం ధన్యము! అట్టి బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థకు సాటి లేదు
స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!
ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గం లో పాలింతురు గాక. గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి