30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఒక దీపం 17000 దీపాలు వెలిగించింది !

 ఒక దీపం 17000  దీపాలు వెలిగించింది ! 

[ మరిన్ని దీపాలను వెలిగిస్తూనే వుంటుంది ] 


ఆమె పేద మహిళ. పొలాల్లో కూలీపని చేసుకొంటూ వుండేవ్యక్తి. హఠాత్తుగా ఆమె బ్రతుకు మీద మరో పిడుగు పడింది. భర్త ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకడే కొడుకు. కర్నాటకలో ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్న 12 ఏళ్ళ పిల్లవాడు. వాడిని తీసుకొని ఆమె మరొక మహిళ ఇంటికి వెళుతోంది. మొత్తానికి అడ్రసు పట్టుకొని ఆ ఇంటి తలుపు తట్టింది. '' ఎవరమ్మా , మీరు ? '' అని అడిగింది ఇంటావిడ. ''అమ్మా , నా భర్త ఈ మధ్యనే చనిపోయాడు. వీడు నా కొడుకు. నేను ఒక కూలీ. వీడిని చదివించాలి. మీరు నా బోటివాళ్ళకు సహాయం చేస్తారని ఎవరో చెపితే వచ్చాను , '' అంది ఆమె.  "తప్పకుండా చేస్తాను. ఏమి చదువుతున్నావు , బాబూ ? '' అని ఆ ఇంటావిడ అడిగితే ''  ఏడవ తరగతి , '' అన్నాడు ఆ పిల్లవాడు. '' బాగా చదువుకో. పదవ తరగతి దాకా నీక్కావాల్సిన ఫీజు , పుస్తకాలు , బట్టలు నేను ఏర్పాటు చేస్తాను. పదవ తరగతి లో నీవు 95 % మార్కులు తెచ్చుకొంటే , ఆ తరువాత నీవు ఏమి చదవాలనుకొంటావో , అది ఎంత ఖర్చుతో కూడిందైనా , మేము చదివిస్తాం. ఇంతకూ ఏమి కావాలనుకొన్నావు ? '' అని అడిగింది ఆమె. '' మేడం , మేము చాలా పేదవాళ్ళం. ఒకసారి మా అమ్మకు ఆరోగ్యం పూర్తీగా దెబ్బతినింటే , ఒక డాక్టరు ఆమెను కాపాడాడు. మా అమ్మకు ప్రాణం పోసిన డాక్టరు లాగా , నేనూ డాక్టరు కావాలనుకొన్నాను, '' అన్నాడు ఆ చిన్న పిల్లవాడు. '' తప్పకుండా అవుతావు, కానీ బాగా కష్టపడాలి. చెడు అలవాట్లు , స్నేహితులకు దూరంగా వుండాలి. మీ అమ్మను బాగా చూసుకోవాలి. మధ్యలో ఇవన్నీ మరచిపోతావా ? '' అని అడిగింది ఆమె. '' లేదు, మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను , '' అన్నాడు. '' మంచిది. నీక్కావాల్సిన అన్ని ఏర్పాట్లూ నేను చేస్తాను , '' అనింది ఆమె. 

ఆ అబ్బాయి ఈ కఠిన పరీక్షకు తట్టుకొంటాడా ,లేడా అని తెలుసుకొనేందుకేనా అనిపించేలాగా , అతనికి 14 వ ఏట ఒక ప్రాణాంతకమైన అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. . అపుడు చాలా భయపడ్డారు తల్లీ కొడుకులు. ఆ సమయంలో తనకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన ఆమెకు తానిచ్చిన మాటను గుర్తుచేసుకొనేవాడు ఆ అబ్బాయి. ఇంతకూ ఆ అబ్బాయి పదవతరగతిలో 95 % మార్కులు తెచ్చుకొన్నాడా ? MBBS చదివాడా ?  డాక్టరు అయ్యాడా ?  ఇది తెలుసుకోవాలంటే మనం కర్నాటక గదగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళాలి. అక్కడ COVID- 19 బారిన పడిన వ్యక్తులకు చాలా అంకిత భావంతో సేవలు అందిస్తున్న డా. కె.వి. మనోజ్ కుమార్ ను కలవాలి. ఆయనే అప్పటి నిరుపేద కూలీ కొడుకు. 


ఇలాంటి నిరుపేద విద్యార్థులు  [ ఏ కులమైనా , మతమైనా ] వాళ్ళ కలలను నిజం చేసుకొని , వాళ్ళ కుటుంబాలను పేదరికంలోంచి బయటకు తెచ్చేవిధంగా సహాయం చేయడానికే శ్రీమతి కుమారీ శిభులాల్ అనే ఈ మహిళ [ ఫోటో చూడండి] 1999 లో Shibhulal Family Philanthropic Initiatives [ SFPI] ను స్థాపించి , ప్రభుత్వాలనుండి ఎటువంటి నిధులూ ఆశించకుండా నిస్వార్థంగా  పనిచేస్తున్న ఒక స్వచ్చంద సంస్థ. 1999 నుండి 2020 దాకా ఈ సంస్థ 17000 పేద కుటుంబాలలో పెద్ద మార్పును తీసుకురాగలిగింది.[ ప్రస్తుత సంవత్సరంలో 4300 మంది విద్యార్థులు SFPI చేత చదివించబడుతున్నారు]  ఈ కుటుంబాల్లోని విద్యార్థులు  పేదరికం నుండి తమ వాళ్ళను బయటకు తెచ్చారు. ఈ సంస్థ సహాయం అందుకొన్న పేద బాల బాలికల్లో ఇపుడు 230 మంది డాక్టర్లు , 940 మంది ఇంజినీర్లు , 131 మంది టీచర్లు వున్నారు. వినీత్ కుమార్ అనే ఒక పేద విద్యార్థి  గతం లో NEET State topper ,  అనిత అనే అమ్మాయి JEE topper.  

'' మా జీవితాలను మార్చిన మీకు మేము ఏమి ఇవ్వగలం  మేడం ? '' అని వారు అడిగితే , '' మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. ఒక పేదవాడింటికి వెళ్ళి , అతని కొడుక్కో , కూతురుకో  వాళ్ళకు అవసరమైన అంశంలో పాఠం చెప్పండి. మీలాగా మరొక్కడిని తయారుచేయండి చాలు , '' అంటారు ఆవిడ. 


నీవు మొదట అడుగు పెట్టినప్పుడు , ఒక ప్రదేశంలో ముళ్ళు కనపడుతుంటే , నీవు దాన్ని వదిలే నాటికి అక్కడ పువ్వులు పూస్తుండాలి.

కామెంట్‌లు లేవు: