🚩🚩
మదురై మదనగోపాలుడు
🚩🚩
భక్తులను పరిరక్షించడానికి , పరమశివుని కోపోగ్ర తాపాన్ని ఉపశమింప చేయడానికి
శ్రీ మహావిష్ణువు కదళీ వనంలో వెలసిన స్ధలం మదురై.
ఒకానొక సమయంలో ఉగ్రంగా వున్న మహేశ్వరుడు యీ వనంలో తపమాచరించసాగాడుఆయన రూపం నుండి
ఉద్భవించిన అగ్నిశిఖలు ఎవరినీ దగ్గరకు చేరనివ్వలేదు. దేవతలందరూ శివుని తపోతీవ్రతకు అమితంగా భయపడి నారాయణుని వేడుకున్నారు. నారాయణుడు నదీ తీరాన గల కదళీవనం
చేరుకుని సమ్మోహనకరంగా వేణుగానం వినిపించాడు. ఈశ్వరుడు ఆ వేణుగానానికి తన్మయుడైనాడు. పరమశివుని ఉగ్రత చల్లారింది. తరువాత మహావిష్ణువు దగ్గరుండి మదురై లో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చేయించాడు.
పిదప, శివ దంపతులు
వేణుగానం వినిపించిన
వాసుదేవునికి కృతజ్ఞతలు తెలిపినట్లు ,ఆ తరువాత మదనగోపాలస్వామి
ఆలయం నిర్మించబడినట్లు ఆలయ స్ధలపురాణ చరిత్ర వివరిస్తోంది.
మదన అంటే అత్యధిక సౌందర్యం, మదర్త అంటే
అధికమైనది అని అర్ధం.
ఆండాళ్ నాచ్చియార్ శ్రీ రంగం వెళ్ళేముందు
పెరియాళ్వారుతో మదనగోపాలస్వామి
దర్శనం చేసివెళ్ళినట్లు,
ఆమె మదన గోపాలస్వామి లో
శ్రీ రంగనాధుని దర్శించినట్లు చెప్తారు.
సుమారు పది శిలా శాసనాలు ఆలయగోడల మీద కనిపిస్తాయి. వాటిలో యీ ఆలయ స్వామి నామం 'ఆందమైన
పెండ్లికొడుకు' అని చెక్కబడినది.
ఆ పేరునే మదనగోపాలస్వామి గా
పిలుస్తున్నారు. ఆళ్వారుల కాలానికే యీ ఆలయం నిర్మించబడినదని అంటారు.
అతి ప్రాచీనమైన యీ ఆలయం విజయనగర రాజుల కాలంలో , 1550వ సంవత్సరం లో యీ ఆలయం పునరుధ్ధరించ
బడినదని,
1942 సంవత్సరం లో
వసంత మండపం నిర్మించబడినదని తెలుస్తున్నది.
16 వ శతాబ్దంలో నాయకరాజులు మదురైని పాలించిన కాలంలో నిర్మించబడిన తూర్పు ముఖంగా వున్న ఐదంతస్తుల రాజగోపురం
అందమైన శిల్పాలతో
దర్శనమిస్తూవుంటుంది.
ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమ ప్రక్కన అశ్వధ్ధవృక్షానికి
క్రింద వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ
షష్ఠిపూర్తి కళ్యాణోత్సవాలు
ఎక్కువగా జరుపుకుంటారు. వినాయకుని పూజించిన వారి వంశం తామరతంపగా వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం.
మహామండపం అద్భుత శిల్పనైపుణ్యం కలిగిన స్ధంభాల మీద మహామండపం నెలకొల్పబడింది.
గర్భగుడిలో మదనగోపాలస్వామి నామంతో వేణుగోపాలుడు , రెండు చేతులలో వేణువును,
రెండు చేతులలో శంఖు
చక్రాలను ధరించి ఎడమకాలిమీద ఆనుకుని కుడికాలు కొంచెం వంచి అందమైన
భంగిమలో దర్శనం ప్రసాదిస్తున్నాడు.
వేణుగోపాలునికి రెండు
ప్రక్కలా భామా , రుక్మిణీలు నిలబడిన భంగిమలో కొలువై వున్నారు.
ఈ కృష్ణుని పై మదనగోపాల శతకం
వ్రాయబడినది.
ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలుగా , శీదేవి, భూదేవి సమేత మదనగోపాలుని దర్శనం లభిస్తుంది. స్వామికి
పెసరపప్పు పాయసం చేసి నివేదించి వేడుకుంటే
సంతానభాగ్యం కలుగుతుంది అని భక్తుల నమ్మకం.
ఇక్కడే ఒక ప్రత్యేకమైన ఆలయంలో
మదన మధురవల్లీ తాయారు చతుర్భుజాలతో ఆశీనురాలైన భంగిమలో కొలువై వున్నది.
ఈ దేవికి 'గడపదాటని దేవి ' అనే పేరు కూడా వున్నది. గోరింటాకును తెచ్చి ఈ దేవి చేతులకు పెట్టి
పూజిస్తే కళ్యాణం, మొదలైన శుభకార్యాలు ఏ అడ్డంకులు లేకుండా నెరవేరుతాయి,
శుక్రగ్రహ దోషం , కాలసర్ప దోషం
తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల
ధృఢ విశ్వాసం.
ఆండాళ్ దేవికి కూడా ఒక ప్రత్యేక సన్నిధి వున్నది.
హరిహర సర్పరాజు అనే పేరుతో వున్న నాగరాజు సన్నిధిలో, శక్రవారమునాడు రాహుకాల పూజలు జరుపుతారు. నాగ దోషం,కుజ దోషం ,
కాలసర్ప దోషం వున్న వారు యీ పూజలో పాల్గొని పూజించిన దోష నివారణమౌతుందని
భక్తుల ధృఢవిశ్వాసం.
శ్రీ రామునికి ప్రత్యేక సన్నిధి వున్నది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో ప్రక్కన
హనుమంతునితో దర్శనమిస్తాడు. రావణుని వధానంతరం అయోధ్యకు తిరిగి వెడుతున్న విజయరాఘవుని రూపంలోని భంగిమ ఇది. ఈ స్వామి
సన్నిధిలో వేడుకున్న ఏ కార్యమైనా దిగ్విజయంగా
నెరవేరుతుందని భక్తులు
విశ్వసిస్తారు.
ఈ ఆలయంలో పలు ఉత్సవాలు ఘన వైభవంగా జరుపుతారు.
వైకుంఠ ఏకాదశికి స్వర్గద్వారాలు తెరిచే ఉత్సవం అత్యంత ప్రసిద్ధి చెందినది.
ఫాల్గుణ మాసం ఉత్తరా
నక్షత్రం రోజున కళ్యాణోత్సవం
వైభవంగా జరుపుతారు.
మదురై మహానగరంలోని
మేల మాసి వీధిలో దక్షిణ పడమటి దిశగా
మదనగోపాల స్వామి
ఆలయం వున్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి