26, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీమహావిష్ణు సహస్రనామ వైభవము-33*

 **దశిక రాము**


🕉🏵️ *శ్రీమహావిష్ణు సహస్రనామ వైభవము-33* 🏵️🕉


❄ *శ్లోకం 27.*❄


*అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|*

*సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః||*


247. అసంఖ్యేయః --- లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.

248. అప్రమేయాత్మా --- కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.

249. విశిష్టః --- అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.

250. శిష్టకృత్ --- తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.

251. శుచిః --- (157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.

252. సిద్ధార్థః --- సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.

253. సిద్ధసంకల్పః --- సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.

254. సిద్ధిదః --- భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.

255. సిద్ధిసాధనః --- సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.

శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః


సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః !!27!!


(నామాలు 247 ... 255)


57. ఎన్న నామ రూపు లెన్నొన్నొ యున్నవి


అప్రమేయుడతడె, యధికుడనగ


శాసనములు చేయు, శౌచమునకె గుర్తు


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : అసంఖ్యేయ ... లెక్కకు అందనివి, అప్రమేయం ... అంచనాలకు అందని, విశిష్ట ... మిక్కిలి గోప్ప, శిష్ట కృత్ ... శాసనములు చేయు, శుచి ... శుభ్రమైన.


భావము : అనంతమైన నామ రూపాలు గలవాడు, (కనుకనే) సాధారణ కొలతలూ, ప్రమాణాలతో నిర్వచింప సాధ్యం కానివాడు, ఉన్నతులలో కెల్లా ఉన్నతమైన(గొప్ప)వాడు, జీవులకు విధి విధానాలు నిర్దేశించువాడు, నిర్మలుడు, నిరంజనుడు( శుచి, శౌచము సమానార్థక పదాలే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }


58. పూర్ణ కాముడతడు, పూర్తి సిద్ధిని పొందె


ఫలములందజేయు భక్తులకును


సకల సిద్ధులకును సాదన మాతడే


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : సిద్ధార్థ ... పురుషార్థములన్నియూ సాధించినవాడు, సిద్ధి సంకల్ప ...సంకల్ములన్నియు సిద్ధింపజేసుకున్నవాడు, సిద్ధి ద ... ఫలములిచ్చివాడు, సిద్ధి సాధన ... సిద్ధి పొందుటకు సాధనము.


భావము : ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములనూ పూర్తిగా స్వంతం చేసుకున్నవాడు, తన సంకల్పములన్నియూ తానుగా సిద్ధింపజేసుకున్నవాడు, సిద్ధి అనగా కర్మఫలములు ద అనగా ఇచ్చువాడు, సిద్ధి పొందుటకు తానే సాధనమైనవాడు అనగా ఆయనను త్రికరణ శుద్దిగా నమ్మి కొలుచుట ద్వారానే సిద్ది పొందగలుగునట్లు చేయువాడు ... అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


*-ఓం నమో నారాయణాయ*


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

కామెంట్‌లు లేవు: