26, అక్టోబర్ 2020, సోమవారం

16-22-గీతా మకరందము


16-22-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కామాదులను తొలగించుకొనువాడు పరమశ్రేయమును బొందునని సెలవిచ్చుచున్నారు -


ఏతైర్విముక్తః కౌన్తేయ ! 

తమోద్వారై స్త్రిభిర్నరః | 

ఆచరత్యాత్మన శ్శ్రేయః

తతో యాతి పరాంగతిమ్ || 


తాత్పర్యము:- ఓ అర్జునా! (కామక్రోధలోభములనునట్టి) ఈ మూడు నరకద్వారముల నుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు.


వ్యాఖ్య:- కామ, క్రోధ, లోభములను ఈ మూడు దుష్టగుణము లున్నంతవఱుకును ఎవడును వృద్ధికిరాలేడు. హితమును బొందలేడు. తనకు మేలొనర్చుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించివేయవలెననియు, అపుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయము నొనగూర్చుకొని సర్వోత్తమమగు మోక్షపదవిని బడయగలడనియు భగవాను డిచట బోధించుచున్నారు. సూర్యచంద్రులు రాహువునుండి విడువబడినట్లున్ను, గజేంద్రుడు మొసలిబారినుండి విడుదల బొందినట్లును, బంధితుడు కారాగృహమునుండి విముక్తుడైనట్లును జీవుడీ దుష్టత్రయము యొక్క బంధమునుండి విడుదలను బొందవలెను. "ముక్తః” అని చెప్పక "విముక్తః" అని చెప్పుటవలన వానినుండి పూర్తిగ విడుదల జెందవలెనని, వానిజాడ ఏమాత్రము హృదయకోశమున నుండరాదని భావము. మఱియు అవి ‘తమోద్వారము' లని పేర్కొనబడుటవలన, ఆ కామాదులు అజ్ఞానరూపములే యనియు, అంధకార బంధురములనియు, ప్రకాశ అభావరూపములనియు, నరకహేతువులనియు స్పష్టమగుచున్నది. అవి తమోద్వారములగుటచే, అవి కలవాడు "చీకటియింటి" లో కాపురము పెట్టిన చందముననే యుండును. అనగా దుఃఖములనే యనుభవించును.


"ఆచరత్యాత్మనః శ్రేయః” - ఆ కామాదులున్నంతవఱకు ఎవరును తనకు శ్రేయమును గలుగజేసికొనజాలరు. ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు. తానెవరు? జగత్తేమి? అని విచారింపజాలరు. అనగా వాసనాక్షయము కానంతవఱకు ఆత్మజ్ఞానము పూర్ణముగ ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగ కలుగదనియు అర్థము. కామాదులు వదలిపోయినపుడే అట్టి జ్ఞానము బాగుగ సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకముద్వారా తెలియుచున్నది.

 కాబట్టి సాధకుడు ప్రప్రథమమున ఆ దుష్టత్రయమును పారద్రోలవలెను.

"పరాంగతిమ్" - అని చెప్పుటచే మోక్షము అన్ని పదములకంటెను, అన్ని గతులకంటెను సర్వోత్కృష్టమైనదని తెలియుచున్నది. మఱియు కామాదులున్న స్థితి అత్యంతనికృష్టమైనదనియు దీనివలన ధ్వనించుచున్నది.

ప్రశ్న:- కామాదు లెట్టివి?

ఉత్తరము:- అవి నరకద్వారములు.

ప్రశ్న:- మోక్షమను హితమునకై ఎవడు యత్నించును?

ఉత్తరము:- ఆ కామాదులనుండి లెస్సగ విముక్తుడైనవాడు.

ప్రశ్న:- అట్లు యత్నించుటవలన నతనికి కలుగు ఫలితమేమి?

ఉత్తరము:- అతడు మోక్షమును బడయగలడు.

ప్రశ్న:- మోక్షపద మెట్టిది?

ఉత్తరము:- అన్నిటికంటెను సర్వోత్తమమైనగతి (పరాంగతిమ్).

*🌹తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం. అవడానికి చాలా చిన్న ఊరే! కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది🌹*




తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే గాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాట ప్రముఖ శైవభక్తులైన నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి, ప్రశస్తి కనిపిస్తుంది. వైష్ణవులకు 108 దివ్యదేశాలు ఎలా ఉన్నాయో... నయనార్ల పద్యాలను అనుసరించి శైవులు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని ‘పాడల్ పెట్ర స్థలం’ (పాటలలో పేర్కొన్న స్థలాలు) అంటారు. వాటిలో తరువక్కరై ఆలయం ఒకటి!

ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించనట్లు తెలుస్తోంది. ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడి స్వామివారి లింగం అరుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. తూర్పువైపున ఉన్న ముఖాన్ని తత్పురుష లింగం అనీ, ఉత్తరం వైపుగా ఉన్న లింగాన్ని వామదేవ లింగమనీ, దక్షిణం వైపుగా చూసే ముఖాన్ని అఘోర లింగమనీ పేర్కొంటారు.


ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుని దర్శించుకోవడమే ఓ అద్భుతమైతే... ఆలయంలో విష్ణుమూర్తి, కాళికా అమ్మవార్లకు కూడా ఉపాలయాలు ఉండటం మరో విశేషం. ఒకప్పుడు వక్రాసురుడనే రాక్షసుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. ఆయన శివభక్తుడు కావడంతో, తన చేతులతో అతనిని వధించలేననీ... వెళ్లి విష్ణుమూర్తినే అర్థించమని పరమేశ్వరుడు చెప్పాడు. అంతట విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసురుని వధించాడు. అందుకే ఇక్కడి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ‘ప్రయోగ చక్ర’ అనే భంగిమలో కనిపిస్తుంది. అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణుభగవానుడు ఉంటాడు.

విష్ణుమూర్తి వక్రాసురుని వధించే సమయంలో ఆ రాక్షసుని నెత్తురు నేల మీద పడినప్పుడల్లా... ప్రతి రక్తపు బొట్టు నుంచీ వేలమంది రాక్షసులు పుట్టుకురాసాగారు. దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని ఒడిసిపట్టేందుకు కాళికా అమ్మవారు అక్కడకు చేరుకున్నారు. అంతేకాదు! వక్రాసురుని చెల్లలైన దున్ముఖి అనే రాక్షసిని కూడా వధించారు. దాంతో ఇక్కడి కాళికా అమ్మవారికి ‘వక్రకాళి’ అన్న పేరు స్థిరపడింది. ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్ర తత్వాన్ని శాంతింపచేసేందుకు ఆదిశంకరులు అమ్మవారి కాలికింది శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు.


అటు శివుడు, ఇటు విష్ణుమూర్తి.... వారికి తోడుగా కాళికా అమ్మవారు. ఇంతమంది కొలువైన ఆలయం కనుకనే ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి వంటి సందర్భాలలో అయితే వేలమంది భక్తులతో ఈ చిన్న గ్రామం కిటికిటలాడిపోతుంటుంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడి వక్రకాళి అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకూ కొదవ ఉండదు. శని వక్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కనుక కొలిస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు! ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చని, ఎలాంటి ఆపదనైనా దాటవచ్చని తమిళనాట నమ్మకం.

అందుకనే రాజకీయ నాయకులు ఇక్కడికి తరచూ వస్తుంటారు. 


శ్రీ మాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: