26, అక్టోబర్ 2020, సోమవారం

శతభిష నక్షత్రము

 శతభిష నక్షత్రము  - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. శతభిషము రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.


శతభిష నక్షత్రము మొదటి పాదము

శతభిషా నక్షత్ర మొదటి పాదము ధనసు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు, శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. 


ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండా పోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. 


51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది. 


శతభిష నక్షత్రము రెండవ పాదము

ఈ నక్షత్ర జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం.. కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  


ఈ జాతకులకు 12 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. 


47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.


శతభిష నక్షత్రము మూడవ పాదము

 వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.  


ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 


60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది. 


శతభిష నక్షత్రము నాలుగవ పాదము  

వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  


ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది.  అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 


39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.


శతభిష నక్షత్రము - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులకు విద్యభ్యాసం కొంతకాలం మందకొడిగా సాగినా.. క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. వీరికి సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపారవెత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలతో పాటు, చిక్కులు కూడా ఎదుర్కొంటారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. 


వివాహాది శుభకార్యాలు వాయిదా పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వల్ల మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం దశలో కొంత కాలం జరిగిన తరువాత సుఖం మొదలవుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వల్ల మార్పులు తప్పవు.  

*చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: