**దశిక రాము**
**హిందూ ధర్మం** 68
(రాజర్షి విశ్వామిత్రుడు)
నీరు అగ్నిని చల్లార్చినట్టు, వశిష్టమహర్షి బ్రహ్మదండం విశ్వామిత్రుడు ప్రయోగించిన అన్ని అస్త్రాలను అడ్డుకుని తనలో కలిపేసుకుంది. అప్పటికే ఆగ్రహం మీద ఉన్న విశ్వామిత్రుడి, ఇంకా రెచ్చిపోయాడి, కోపం మరింత పెరిగి ఇతర ఆయుధాలను సంధించాడు. వరుణ, రుద్ర, ఇంద్ర, పాశుపత, చిక్షేప, సన్నని గడ్డి మధ్యలోనుంచి కూడా దూసుకెళ్ళి శత్రువులను మట్టుబెటగల ఐషీక అస్త్రాలను, మానవ, మోహన, జృంభణం, మదం, సంతాప, విలాప అనే పేరుగల అస్త్రాలను, శోషణ, దారణ అస్త్రాలను, అతిశక్తివంతమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇవే కాక బ్రహ్మపాశం, కాలపాశం, వరుణపాశం, శివుడి ఆయుధమైన పినాకం, దైత్యం, శుష్క, ఆశని, ఆర్ద్ర, పిశాచ, దండాస్త్ర, క్రౌంచం మొదలైన మహామహా అస్త్రాలను, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం మొదలైన చక్రాలను, వాయవ్యం, మథనం, హయశీర్ష మొదలైన భయనంకరమైన ఇతర అస్త్రాలను వశిష్టమహర్షిపైన ప్రయోగించాడు. శివవిష్ణువు శక్తులు కలిసిన ఇంకొక అస్త్రాన్ని, కంకాలం, ముసలం, వైధ్యధారం, మహాస్త్రం, కాలాస్త్రం, దారుణమనే అస్త్రాలను, త్రిశూలం, అఘోరాస్త్రం, కపాలం, కంకణం మొదలైన అస్త్రాలతో పాటు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను అద్భుతంగా ప్రయోగించాడు.
తనమీదకు వస్తున్న అన్ని అస్త్రాలను వశిష్టమహర్షి బ్రహ్మదండం శాంతపరిచి, వాటిని గ్రహించి తనలో కలిపేసుకుంది. దీంతో విశ్వామిత్రుని కోపం ఇంకా రెట్టింపైంది. తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్నితీసి ఎక్కుపెట్టాడు. ఇది చూడగానే అగ్ని దేవునితో సహా దేవతలు, దేవర్షులు, గంధర్వులు,జంతువులు హడలిపోయారు. మూడులోకాలు బ్రహ్మాస్త్రం యొక్క వేడి చేత కాలిపోతున్నాయి. కానీ ఈ అస్త్రాన్ని కూడా బ్రహ్మదండం గ్రహించి, తనలో కలిపేసుకుంది. అప్పుడు వశిష్టమహర్షి రోమకూపాల నుంచి దట్టమైన వెలుగులు విరజిమ్ముతూ పొగలు వ్యాపించాయి. ఆయన చేతిలో పట్టుకున్న బ్రహ్మదండం మెరిసిపోతూ, ప్రయళకాలంలో కనిపించే కాలగ్నిని తలపిస్తోంది, అపర యమదండంలా అనిపిస్తోంది.
అక్కడున్న మునిగణం వశిష్టమహర్షితో 'ఓ బ్రహ్మన్! మీ బలం అమోఘమైనది. తేజోమూర్తులు మీరు. తేజస్సును కలిగి ఉన్నారు. విశ్వామిత్రుడు గొప్ప తపస్వి అయినా, మీ బలం చేత నిరోధింపబడ్డాడు. కానీ మీ శక్తి చేత చేత అతనితో పాటూ మూడు లోకాలు పరితాపం చెందుతున్నాయి. మూడులోకాలుల్లో శాంతి నెలకొనెలా అనుగ్రహించండి' అని వేడుకున్నారు.
తరువాయి భాగం రేపు.....
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి