26, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -7


ధృవోపాఖ్యానము 


విదురా! విను. స్వాయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు. ఆ స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి. (ఉత్తానపాదునికి) సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా...ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు.కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది?కనుక ధ్రువకుమారా! నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.” అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా.

ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గరనుండి ధ్రువుడు పట్టరాని దుఃఖంతో కఱ్ఱదెబ్బ తిన్న పాములాగా రోషంతో రోజుతూ (వచ్చాడు).బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....తన తొడలపై కూర్చుండబెట్టుకొని....

ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి, జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కార్చుతూ...సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికీ తలచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కళతప్పిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి “తండ్రీ! దుఃఖించకు” అంటూ ఇలా అన్నది.

నాయనా! మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మంలో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది. కనుక...భర్తచేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణంచేత నీకు అవమానం తప్పలేదు. నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు. కనుక పినతల్లి ఐన ఆ సురిచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు” అని తల్లి ఇంకా ఇలా అన్నది. లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు. ఇంకా...బ్రహ్మ మొదలైన దేవతలు వెదకినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరి కోసం వెదకుతూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుని (ఆశ్రయించు).

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: