🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 61*
*****
*శ్లో:- అర్ధాతురాణాం న గురు ర్న బంధు: ౹*
*కామాతురాణాం న భయం న లజ్జా ౹*
*విద్యాతురాణాం న సుఖం న నిద్రా ౹*
*అన్నాతురాణాం న రుచి ర్న పక్వమ్ ౹౹*
*****
*భా:- లోకంలో నాలుగు విషయాలలో రసపిచ్చ గలవారు తారసపడుతుంటారు. 1. ధనమదంతో ఊగిపోయేవాడికి బంధువు- మిత్రుడు ; హితుడు- సన్నిహితుడు ; మాన్యుడు- పూజ్యుడు అనే తేడా ఉండదు. అందరి వద్ద నిర్దాక్షిణ్యంగా వడ్డీకి వడ్డీ వసూలుచేసి తీరతాడు. డబ్బు కూడబెడతాడు. 2. కామవాంఛతో చెలరేగిపోయేవాడికి వావి- వరుస; సమయము- సందర్భము ; ఉచితము- అనుచితము ; మంచి- చెడు అనే తేడా ఉండదు. సిగ్గు-బిడియము ; నయము -భయము ఉండవు. కోరిక తీర్చుకోవడమే ప్రధాన లక్ష్యము. 3.అభ్యసన, అధ్యయనశీలియైన విద్యార్థికి పగలు- రాత్రి ; కష్టము- సుఖము; తిండి- తిప్పలు పట్టవు. తపనతో నిద్రాహారాలు వీడి, విద్యార్జనకై నిరంతరకృషితో పురోగమిస్తాడు.గమ్యాన్ని సాధించి తీరతాడు. 4.అన్న పానీయాలు కరువై, తీవ్రమైన ఆకలితో అలమటించేవాడికి రుచి- శుచి పట్టవు. ఉడికిందా! లేదా! అనే తేడా తెలియదు. అన్నమైనా, పరమాన్నమైనా అమృతముగా భావించి తృప్తిగా తేనేస్తాడు. "ఆకొన్న కూడె అమృతము" అంటాడు సుమతీశతక కర్త. మితిమీరిన "కాంతా కనకాలు" మనిషికి కీడు చేస్తాయని, "ఆతురత" మంచి విషయాలలో కనబరచి, కష్టపడి, ఆయా రంగాలలో నిష్ణాతులం కావాలని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి