26, అక్టోబర్ 2020, సోమవారం

మోహముద్గరః

 దశిక రాము**


**మోహముద్గరః** (భజగోవిందం)


4) 


నలినీదళగత జలమతి తరళం 


తద్వజ్జీవితమతిశయచపలం |


విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం


లోకం శోకహతం చ సమస్తం ||


మనం ఎక్కణ్ణించి వచ్చామో, ఎక్కడకు పోవాలో, ఆ మార్గంలో ప్రయాణించటానికి 'ఇప్పుడే - ఇక్కడే' నిర్ణయం ఏమని ఎలా తీసుకోవాలి?

తామరాకు మీద నిలిచిన నీటిబొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఇటూ అటూ కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది. అలాగే మానవజీవితం నీటి బుడగలాంటిది. క్షణికమైనది. ఇప్పుడున్నట్టే ఉంటాం. మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవితకాలం అత్యంత అల్పమైనది.

  పోనీ అల్పమైనదైతే అయింది. ఉన్న కొద్ది కాలమైనా సుఖంగా హాయిగా ఉంటామా? అదేం లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం. పుట్టిన తర్వాత బాల్యంలో తల్లిదండ్రులు అడిగిన వాటిని కొనిపెట్టలేదని ఏడుస్తాం. యుక్తవయస్సు వచ్చిన తర్వాత అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. అవి తీరకపోతే తీరలేదని ఏడుస్తాం. తీరితే కొత్త కోరికలు పుట్టి వాటికోసం ఏడుస్తాం. ఆ తర్వాత వృద్ధాప్యం ప్రవేశిస్తుంది. శరీర అవయవాలు పట్టు తప్పుతాయి, బలం సన్నగిల్లిపోతుంది. దానికీ ఏడుస్తాం. ఇక జీవించినంతకాలం రకరకాల జబ్బులు - దీర్ఘవ్యాధులు వస్తూ ఉంటాయి. వాటితో దుఃఖ పడుతుంటాం. ఏడుస్తుంటాం. 

నాది నాది అనే భ్రమలతోను, వ్యాధులతోను బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ, చావలేక బ్రతుకుతూ ఎలాగో గడుపుతుంటారు జీవితాన్ని చాలామంది. అందుకే “లోకం సమస్తం శోకహతం” అంటున్నారు శంకరాచార్యులవారు. 

జన్మ ఉండేది కొద్దికాలం; ఆ ఉన్నంతకాలం కూడా అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో నీవు ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదు. వాటిని తీర్చుకొనుటకు ప్రయత్నిస్తూ నీవు మూఢుడివి కావద్దు. ఒక్కక్షణం ఈ జీవితాన్ని వృధా చేసినా ఆ క్షణం మళ్ళీ తిరిగిరాదు. మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుంది - అని నిత్యమూ గుర్తుంచుకోవాలి. 

మరైతే మన కర్తవ్యం ఏమిటి? మానవ జీవిత పరమలక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎక్కణ్ణించి వచ్చామో, ఎక్కడకు పోవాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణించటానికి 'ఇప్పుడే - ఇక్కడే' నిర్ణయం తీసుకోవాలి. రేపు చూద్దాం అంటే కుదరదు. ఆ రేపు అసలు నీకున్నదో లేదో తెలియదు.

  భగవద్గీత చెబుతున్నారట గదా! నాకూ వినాలని ఉన్నదండీ! ఏదీ ఎంత తెముల్చుకుందామన్నా పనులతో తీరటం లేదు. ఏమైనా సరే వచ్చే సంవత్సరం నుండి తప్పక రావాలి; వినాలి అంటాడు. పాపం వచ్చే సంవత్సరానికి భగవద్గీతను వాయిదా వేశాడు గాని, వచ్చే నెలలో రాబోతున్న చావును వాయిదా వేయగలడా? 

కనుక భగవత్సంబంధమైన కార్యాలలోగాని, సత్కార్యాలు చేయటంలోగాని ఏమాత్రం జాప్యం పనికిరాదు. “ఆలస్యం అమృతం విషం” అన్నారు. వాయిదాలు కూడదు. ఇప్పుడే - ఇక్కడే అనే సూత్రాన్ని పాటించాలి.

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: