30, జనవరి 2021, శనివారం

దత్త కరుణ.

 *దత్త కరుణ..*


"శనివారం నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి రావాలని అనుకుంటున్నామండీ..ఆరోజు రాత్రికి అక్కడ మేము బస చేయడానికి ఒక రూమ్ ఇవ్వగలరా?.." అని అతను అడిగాడు..ఈవారం కుదరదు ఆపై శనివారం నాటికి రూమ్ ఇవ్వగలము అని చెప్పాను..ఒక్కక్షణం ఆలోచించి.."పోనీ మేము మంటపం లో పడుకునే అవకాశం ఉన్నదా..? ఈ శనివారం తప్ప నాకు సెలవు లేదు..అందుకని అడుగుతున్నాను.." అన్నాడు.."మంటపం లో ఉండొచ్చు..మీ పేరు చెప్పండి..నమోదు చేసుకుంటాను..ఒకవేళ రూములు తీసుకున్న వాళ్లలో ఎవరైనా రాకపోతే..ఆ రూమ్ మీకు కేటాయిస్తాము.." అన్నాను.."చాలా థాంక్స్ అండీ..నాపేరు హరికృష్ణ, మా ఆవిడ పేరు..శిరీష..మేమిద్దరం వస్తాము..మీకు వీలుంటే రూమ్ చూడండి..లేకుంటే..మంటపం లో ఉంటాము.." అన్నాడు..


అనుకున్న విధంగానే శనివారం నాటి ఉదయం తొమ్మిది గంటల కల్లా హరికృష్ణ, అతని భార్య శిరీష వచ్చారు..మందిరం లోకి వచ్చి, నా గురించి వాకబు చేసి, నేను కూర్చున్న చోటుకి వచ్చారు.."మీరేనా ప్రసాద్ గారు..నమస్తే అంకుల్.." అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు..నేనూ నమస్తే అన్నాను.."అంకుల్..రూము ఏదైనా..." అని అతను కొద్దిగా నసుగుతూ అడిగాడు..అందరూ వస్తున్నారని..ఇక మీరు మంటపం లోనే ఉండాలి అని నేను చెప్పాను..అతను తన భార్య వైపు చూసి..మళ్లీ నా వైపు తిరిగి.."సరే అంకుల్..సాయంత్రం పల్లకీసేవ లో పేరు ఎప్పుడు నమోదు చేసుకుంటారు?.." అని నన్ను అడిగాడు..మధ్యాహ్నం మూడుగంటల తరువాత మా సిబ్బంది వద్ద నమోదు చేసుకోండి..అని చెప్పాను..


"అంకుల్..మీరు కొద్దిగా సమయం ఇస్తే..మా సమస్య చెప్పుకుంటాము.." అన్నాడు.."ఇప్పుడు ఖాళీగా వున్నాను..చెప్పండి.." అన్నాను.."మా ఇద్దరికీ వివాహం జరిగి ఆరేళ్ళు అవుతోంది..పెళ్ళైన రెండేళ్ల తరువాత తాను గర్భవతి అయింది..కానీ రెండో నెలలోనే అబార్షన్ అయింది..డాక్టర్ కు చూపించాము..ఒక్కొక్కసారి అలా జరుగుతుందని..కంగారు పడొద్దు..ఈసారి గర్భం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే..అలా జరుగదు..అని మందులు రాసిచ్చారు..మళ్లీ ఎనిమిది నెలల తరువాత గర్భం వచ్చింది..ఈసారి డాక్టర్ సలహాతో ముందు జాగ్రత్తలు తీసుకున్నాము..మా ఖర్మ ఏమిటో తెలీదు కానీ..మళ్లీ అబార్షన్ జరిగింది..తాను బాగా బాధపడింది..ఇప్పటికి మొత్తంగా మూడు సార్లు అబార్షన్ జరిగింది..ఇప్పుడు రెండో నెల తనకు..ఈ స్వామివారి గురించి బాగా విన్నాను..నేనూ చదివాను..ఒక నమ్మకం ఏర్పడింది..తనకు చెప్పాను..తాను మూడు నెలల నుంచీ స్వామివారి లీలలు ఫేస్బుక్ లో చదువుతున్నదట..నాతో చెపితే..నేను మూఢ నమ్మకం అంటానేమో అని సందేహం తో ఊరుకున్నదట..నేనే ఆడిగేసరికి..సంతోషంగా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నది..గర్భవతి కదా..ఇక్కడ నేల మీద పడుకోవడం కష్టం కదా అని రూమ్ అడిగాను..తానేమో..స్వామివారి ని నమ్మి వెళుతున్నాము..మన బాగోగులు ఆయనే చూసుకుంటాడు..అన్నది..ఇలా వచ్చాము.." అన్నాడు..


"మీ నమ్మకమే మీకు రక్ష.." అన్నాను.. సరే అని ఇద్దరూ లేచి వెళ్లిపోయారు..క్యూ లైన్ లో వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకొని..నమస్కారం చేసుకున్నారు..ఆరోజు సాయంత్రం పల్లకీసేవ కు పేర్లు నమోదు చేసుకున్నారు..సరిగ్గా సాయంత్రం ఆరు గంటలప్పుడు..మా సిబ్బంది నా దగ్గరకు వచ్చి, "అయ్యా..ఈరోజు రూములు బుక్ చేసుకున్న వాళ్లలో ఒకరు ఇంతవరకూ రాలేదు..వాళ్ళ సెల్ కు కాల్ చేస్తే..మాకు ఇబ్బంది వచ్చింది మేము రావటం లేదు..అన్నారు..మీరు చెప్పారు కదా..ఆ దంపతులకు అవకాశం ఇవ్వమని..వాళ్ళకే ఈ రూమ్ ఇద్దాము.." అన్నారు..ఆ దంపతులను పిలిచి విషయం చెప్పాను..సంతోష పడ్డారు.."చూసావా..నేను కష్టపడటం స్వామివారికి ఇష్టం లేదు..అందుకే మనకు రూమ్ ఇప్పించారు.."అని అతని భార్య అన్నది..ఆరోజు పల్లకీసేవ లో ఇద్దరూ పాల్గొన్నారు..ప్రక్కరోజు ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తమ సమస్య అక్కడ చెప్పుకొని..దయ చూపమని కోరుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం ఊరెళ్లిపోయారు..


పోయిన ఆదివారం ఆ దంపతులు ఇద్దరూ వచ్చారు..ఆ అమ్మాయి చేతుల్లో పసి బిడ్డ ఉన్నది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మా ఆవిడ చేతిలో..ఆ బిడ్డను పెట్టి.."స్వామివారి దయ వల్ల పుట్టింది అంకుల్..అందుకే "దత్త కరుణ" అని పేరు పెట్టుకున్నాము..ఇప్పుడు ఐదో నెల..మా మొరను స్వామివారు విన్నారు..కాకుంటే..ఇక నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది..ఈ బిడ్డ ఒక్కటే చాలు అని స్వామివారే నిర్ణయించారు అనుకున్నాము..ఏదైనా ఆయన దయ.." అన్నది.."నిజం అంకుల్..స్వామివారి ప్రసాదమే ఈ పాప.." అన్నాడు అతను..

స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వెళుతూ..ఆ దంపతులు మళ్లీ మా దగ్గరికి వచ్చారు.."అంకుల్..స్వామివారు మా కోరిక తీర్చారు..మేము కూడా మా చేతనైన పని ఇక్కడ చేయాలని అనుకున్నాము..అందరికీ ఉపయోగ పడే కార్యం ఉంటే చెప్పండి..మా శక్తి కొద్దీ మేము చేస్తాము.." అన్నారు..ఒక ఐదు నిమిషాలు ఆలోచించి.."మీరే చూసారు కదా..భక్తులు ఉండటానికి వసతి కావాలి..కొన్ని రూములు కట్టాలి..అందుకు మీ చేతనైన సహాయం చేయండి.." అన్నాను.."అలాగే అంకుల్..త్వరలోనే మా వంతుగా విరాళం ఇస్తాము.." అని చెప్పారు..సర్వం..దత్తకృప అని ప్రతిసారీ నేనెందుకు పదే పదే అన్ని పోస్టుల్లో వ్రాస్తుంటాను అని కొంతమంది నన్ను అడిగారు..ఇటువంటి సంఘటనలు కళ్లారా చూసినప్పుడు..అలా రాయడం లో తప్పులేదు అని వాళ్లకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను..ఆ దత్తుడి కృపను మీరూ పొందొచ్చు..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మి కొలవండి చాలు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 99089 73699)

కామెంట్‌లు లేవు: