30, జనవరి 2021, శనివారం

ఋభు మహర్షి

 మన మహర్షులు - 9


 ఋభు మహర్షి


🍁🍁🍁🍁


ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు. అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట,


భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు .చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋధువు సరేనన్నాడు


నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం వంటబట్టించుకోలేక పోయాడు.


నిదాఘుడు వివాహం చేసుకుని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపస్సు, అతిధులకి సేవచేస్తూ, గురుభక్తి తో కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి


ఒకరోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు.. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు. నాకు అన్నం తినాలని లేదు. ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు. నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా! ఆకలి తీరిందా? భోజనం బాగుందా అనడిగాడు


ఆకలి వున్న వాడికి ఆకలి తీరిందా? లేదా? తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు, భోజనము రుచిగా ఉందా? లేదా? అనేది దేహానికి సంబంధించింది. మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది. ఏది రుచి ఏది రుచి కాదు, నువ్వు, నేను ఇల్లాంటివన్నీ విడిచిపెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు


నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు. 


ఆ మహర్షి నా పేరు ఋభుడు, నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది. అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు.


ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి., 


మళ్ళీ బుభు మహర్షి శిష్యుడు నిదాఘుడు ఉన్న నగరానికి వచ్చాడు, నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు, పండ్లు మొదలయినవి పట్టుకొని వస్తూ దార్లో నడవడానకి వీలవక ఒకచోట కూర్చున్నాడు.


ఋధుమహర్షి నిదాఘుణ్ణి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు


. శిష్యుడికి మళ్ళీ మామూలే, గురువుగార్ని గుర్తుపట్టలేదు. నడుస్తుంటే రాజ బలగం అడ్డు వచ్చింది. అందుకే ఆగానన్నాడు.


గురువు మళ్ళీ అడిగాడు. ఇందులో రాజెవరు? బలం ఎవరు? అని. 


శిష్యుడు అది కూడ తెలియదా! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు. 


గురువు గారు ఊరుకోలేదు రాజెవరు? ఏనుగెవరు ? అన్నాడు


. శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు, క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు.


 గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు. పైన అంటే ఏమిటి క్రింద అంటే ఏమిటి ? అన్నాడు. 


ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు. ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు.


 గురువుగారు ఇంకా వదలడల్చుకోలేదు శిష్యుణ్ణి, నువ్వంటే ఎవరు? నేనంటే ఎవరు? అన్నాడు. 


శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాల మీద పడి మహాత్మా! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా.. మిమ్మల్ని గుర్తించలేదు. క్షమించండి అన్నాడు.


ఋధ మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను నీకేమయినా సందేహాలుంటే అడుగు. ఇంక రాను అన్నాడు.


 శిష్యుడు మహాత్మా ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు


ఋభుష మహర్షి వత్సా! ఈ శరీరం మాయచే కప్పబడింది. మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది, నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది. పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆశ్మే పరబ్రహ్మం. దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి. ఏది పరబ్రహ్మ స్వరూపమో, ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఏది నిత్యమో అదే నేను. బ్రహ్మము నేను నాలోంచే అన్నీ పుడుతున్నాయి. నశిస్తున్నాయి. నేనే విశ్వమంతా ఉన్నాను. కళ్ళు లేకపోయినా చూడగలను, చెవులు లేకపోయినా వినగలను, నాకు పాపము లేదు, చావు లేదు, వేరే జన్మము లేదు, నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత..


అంతా నేనే వేరే ఏమీ లేదు. నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా.. దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో. అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది, అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు. నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో, దానికి మార్గం భగవన్నామం.


భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి, ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు.


తెలుసుకున్నాం కదా...

శిష్యుడికి గురవెంత ముఖ్యమో, గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం, గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు.


చూశారా! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ, జ్ఞానం, మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో..


అదే.. గురశిష్య సంబంధం.. తండ్రికి కొడుక్కి.. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం ...


శ్రీ గురుభ్యోన్నమః 🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: