17, ఏప్రిల్ 2021, శనివారం

మొగలిచెర్ల

 *చీటీలు..స్వామి ఆదేశం..*


"నీకు గుర్తుంది కదా?..రెండేళ్ల క్రిందట నేను ఏ పరిస్థితుల్లో ఈ స్వామివారి వద్దకు వచ్చానో..అడుగుతీసి అడుగు వేయాలంటే ఆయాసం.. తలకాయ లోపల బొంగరం లా తిప్పుతున్నట్లు ఒకటే బాధ..ఏ దిక్కూ తోచక..స్వామినే నమ్ముకొని వచ్చాను..ఐదు రోజులు ఉండిపోదామని అనుకున్నదానిని నలభై రోజులపాటు నన్ను ఇక్కడే ఉంచాడు..రోజూ ఉదయం సాయంత్రం నా చేత ప్రదక్షిణాలు చేయించాడు..నా జబ్బు లన్నీ తగ్గిపోయేదాకా ఇక్కడే వున్నాను..నువ్వు కానీ..ఇక్కడున్న ఇతర మనుషులు కానీ నన్ను స్వంత మనిషిలా చూసుకున్నారు..అన్నీ గుర్తున్నాయి నాయనా..ఆరోగ్యం కుదటబడి మా ఊరికి వెళ్ళిపోయాను..రోజూ స్వామివారి పటానికి దణ్ణం పెట్టుకున్న తరువాతే నా పని చేసుకోవడం అలవాటైపోయింది..మూడు నెలల క్రితం ఇక్కడికి రావాలని అనుకున్నాను..ఒకరోజు దత్తదీక్ష తీసుకున్న స్వాముల భిక్ష కొరకు విరాళం ఇద్దామని అనుకున్నాను..తీరా మా ఆయన నేనూ రెండురోజుల్లో ఇక్కడికి వద్దామని బైలుదేరేలోపల..లాక్ డౌన్ పెట్టేసారు..ఎటూ వెళ్లలేని పరిస్థితి..మొన్న నీకు ఫోన్ చేస్తే..స్వామివారి మందిరం తీసే ఉంది..మీరు దర్శనం చేసుకొని వెళ్లొచ్చు అని చెప్పావు..సరిగ్గా బస్సులు లేవు..రైళ్ళూ లేవు..అంతదూరం నుంచి కారు మాట్లాడుకుని వచ్చాము..కళ్లారా స్వామి సమాధిని చూసాను నాయనా..తృప్తిగా ఉంది..మళ్లీ భోజనాలు కూడా పెడుతున్నారు..మంచిపని చేశారు..ఈ మారుమూల ఏమీ దొరకదు..దత్తుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆకలితో వుండరు..ఉండకూడదు.." 


అని నిన్న ఆదివారం ఉదయం 11 గంటల వేళ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చిన సరస్వతమ్మ గారు చెప్పారు..వారి భర్త వామనరావు గారు ప్రక్కనే కూర్చుని వున్నారు.."సరస్వతి మళ్లీ మామూలు మనిషి అవుతుందని నేను ఏకోశానా నమ్మలేదు ప్రసాద్ గారూ..అటువంటిది ఆమె తన పనులు తాను చేసుకోవడమే కాకుండా..మునుపటి లాగా నాకూ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది..స్వామివారి మహిమను కళ్లారా చూసాము..సమాధి లో ఉన్నాడేగానీ..పిలిస్తే పలుకుతారు..మాకు ఏ కష్టం వచ్చినా..స్వామివారి పటం ముందు నిలబడి చెప్పుకుంటాము..ఇంకా సందేహం ఉంటే..చీటీలు వ్రాసి..ఆ పటం ముందు పెడతాము..ఏ చీటి లో ఉన్నది ముందుగా మా చేతికి వస్తే..అదే స్వామివారి ఆదేశం క్రింద లెక్క పెట్టుకుంటాము..మా పిల్లల ఇళ్లకు వెళ్లాలన్నా..స్వామివారి ఆదేశం ఉంటేనే వెళతాము..లేకుంటే వెళ్ళము.." అని చెప్పారు..


ఆ దంపతులు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం అప్పుడు ఇచ్చే హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి మళ్లీ వచ్చారు.."ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గురుపౌర్ణమి కి దత్తహోమము చేస్తున్నారు కదా.." అని అడిగారు.."నిర్వహిస్తున్నాము.." అని చెప్పాను..కాకుంటే..ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ మంది కొరకు హోమగుండాలు నిర్మించడం లేదు..చాలా పరిమితంగా చేస్తున్నాము..ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.." అన్నాను.."అలాగా.." అన్నారు..కొంచెం సేపు ప్రక్కకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు.."ప్రసాద్ గారూ..దత్తా దీక్ష ల సమయం లో స్వాముల అన్నదానం కొరకు మేము తీసివుంచిన డబ్బు అలాగే ఉండిపోయింది..దత్తహోమము లో మేము పాల్గొంటాము..ఆరోజు ఆదివారం కూడా..స్వామి దగ్గరే ఉంటాము..ఆ తరువాత..మీకు వీలున్నప్పుడు..మా పేరుతో రెండురోజులు అన్నదానం చేయండి.." అని చెప్పారు.."నాయనా..నువ్వు అనుమతి ఇస్తే..ఇంకొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అని సరస్వతి గారు ప్రాధేయపూర్వకంగా అడిగారు..సరే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని ఆ దంపతులు వెళ్లిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380..మరియు..99089 73699).

కామెంట్‌లు లేవు: